కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్: కన్నబాబు
- కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, రైతుల మోసపోయారన్న కన్నబాబు
- హామీలు నెరవేర్చామని కూటమి నేతలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్
- గత ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపాటు
కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల నిరుద్యోగులు, రైతులు తీవ్రంగా మోసపోయారని వైసీపీ నేత, మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందుకే అమరావతి రైతుల నుంచి డీఎస్సీ అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరూ ప్రస్తుతం జగన్ ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని తెలిపారు.
ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ... కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్ మాత్రమేనని కొనియాడారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవాళ్టికీ ఎందుకు ఇవ్వలేదని నిలదీసిన ఆయన... ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని కూటమి నేతలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ హయాంలో నడిచిన 'అమ్మఒడి'ని కాపీ కొట్టి 'తల్లికి వందనం'గా మార్చారని, అయినా దీని అమలులో కూటమి ప్రభుత్వం కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయిందన్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామన్న మాటను తుంగలో తొక్కి, ఏకంగా 20 లక్షల మంది విద్యార్థులకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. ఈ పథకానికి రూ.13,112 కోట్ల బడ్జెట్ అవసరమైతే, కేవలం రూ.8,456 కోట్లే కేటాయించడాన్ని తప్పుబట్టారు.
మరోవైపు, ఆక్వా రైతుల సమస్యలపై కూడా కన్నబాబు గళమెత్తారు. నిన్న జరిగిన ఎక్స్పోలో సీఎం చంద్రబాబు 'బ్లూ ఎకానమీ' అంటూ గొప్పలు చెప్పుకున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఆక్వా రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. జగన్ హయాంలో ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీలు ఇచ్చి, రొయ్యల మేత ధరలు పెరగకుండా నియంత్రణలో ఉంచామని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే రొయ్యల మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సీజన్ వచ్చేసరికి రొయ్యల ధరలను దారుణంగా పడిపోయేలా చేసి రైతులను నష్టాల్లోకి నెట్టేశారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.