ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఒక అనూహ్య రాజకీయ వివాదంలో చిక్కుకుంది. అమెరికా జాతీయ జట్టు ఆటగాడు ఫోలరిన్ బలోగన్‌పై విధించిన రెడ్ కార్డ్, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో ఫోన్‌లో మాట్లాడటం క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉన్నతస్థాయి జోక్యం తర్వాత ఫిఫా క్రమశిక్షణా కమిటీ బలోగన్ సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

అస‌లేం జరిగింది?
ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన చివరి మ్యాచ్‌లో అమెరికా 2-0తో గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ 64వ నిమిషంలో అమెరికా స్టార్ స్ట్రైకర్ బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించారు. నిబంధనల ప్రకారం అతను తదుపరి మ్యాచ్‌కు దూరమవ్వాలి. దీంతో బెల్జియంతో జరగనున్న కీలకమైన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు బలోగన్ దూరం కానున్నాడని భావించారు.

అయితే, అనూహ్యంగా ట్రంప్ రంగంలోకి దిగారు. ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోకు ఫోన్ చేసి, రెడ్ కార్డ్ నిర్ణయం, సస్పెన్షన్ వెనుక ఉన్న కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణ జరిగిన కాసేపటికే, అమెరికా ప్రభుత్వం అందించిన అదనపు ఆధారాలతో స్వతంత్ర అప్పీల్ బోర్డు సస్పెన్షన్‌ను రద్దు చేసింది. "అధ్యక్షుడు, ఇన్ఫాంటినో మాట్లాడుకున్నారు. రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారో, సస్పెన్షన్ ఎందుకు విధించారో అధ్యక్షుడు తెలుసుకోవాలనుకున్నారు. చివరికి సరైన ఫలితం వచ్చింది" అని ఒక అమెరికన్ అధికారి ధ్రువీకరించారు.

ఫిఫా అసాధారణ నిర్ణయం
ఫిఫా క్రమశిక్షణా కమిటీ కూడా అసాధారణమైన రీతిలో ఒక ప్రకటన విడుదల చేసింది. బలోగన్‌పై విధించిన ఆటోమేటిక్ మ్యాచ్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు ప్రొబేషనరీ పీరియడ్‌కు లోబడి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే.. అతను వెంటనే మ్యాచ్ ఆడేందుకు అర్హత సాధించాడు. ఈ నిర్ణయం వెలువడగానే ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో "సరైన నిర్ణయం తీసుకుని, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినందుకు ఫిఫాకు ధన్యవాదాలు" అని పోస్ట్ చేశాడు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూరప్ దేశాలు
ఈ నిర్ణయంపై బెల్జియం, నార్వే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫిఫా తన సొంత నిబంధనలనే ఉల్లంఘించిందని బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య ఆరోపించింది. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు నార్వే మేనేజర్ స్టాలే సోల్బాకెన్ ఫిఫా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. "ఇది ఫిఫా చేసిన పెద్ద తప్పు. ఆటగాడికి రెడ్ కార్డ్ ఇచ్చారు. వీఏఆర్ కూడా దానిని ధ్రువీకరించింది. అలాంటప్పుడు సస్పెన్షన్ సహజం. రాజకీయ నాయకుల జోక్యంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, అది ఆటకే ప్రమాదకరం. భవిష్యత్తులో ఇచ్చే ప్రతి రెడ్ కార్డ్‌కు ఇలాగే కమిటీలు వేసి నిర్ణయాలు మారుస్తారా? ఇది చాలా చెడ్డ నిర్ణయం" అని ఆయన మండిపడ్డారు. ఈ వివాదం కారణంగా అమెరికా టోర్నమెంట్‌లో ఎంత ముందుకు వెళ్లినా, వారిపై ఈ మచ్చ అలాగే ఉండిపోతుందని వ్యాఖ్యానించారు.

ఈ వివాదం ఎలా ఉన్నా, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌కు ముందు స్టార్ స్ట్రైకర్ బలోగన్ తిరిగి జట్టులోకి రావడం అమెరికాకు భారీ ఊరటనిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ చేసిన బలోగన్, బెల్జియంతో మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. 2014 ప్రపంచకప్‌లో ఇదే రౌండ్ ఆఫ్ 16లో బెల్జియం చేతిలో ఓడిపోయిన అమెరికా, ఈసారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.