భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. చాపెల్ కోచింగ్‌లో ఉన్న రెండేళ్ల కాలాన్ని భారత క్రికెట్ చరిత్రలోనే ఒక 'చీకటి అధ్యాయం'గా అభివర్ణించాడు. జట్టులో 'విభజించు, పాలించు' అనే దుర్మార్గపు విధానాన్ని అమలు చేసి, ఆటగాళ్ల మధ్య చిచ్చు పెట్టాడని తీవ్రంగా విమర్శించాడు. ఇటీవల ప్రఖర్ గుప్తా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

2003 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన బలమైన భారత జట్టుకు 2005లో గ్రెగ్ చాపెల్ కోచ్‌గా నియమితులయ్యాడు. అయితే, అత‌ని రాకతో జట్టులో ఐక్యత పూర్తిగా దెబ్బతిన్నదని హర్భజన్ ఆరోపించాడు. "ఆ రోజుల్లో చాపెల్.. దాదా (సౌరవ్ గంగూలీ)తో ప్రవర్తించిన తీరు, జట్టుతో వ్యవహరించిన పద్ధతి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన, చెత్త దశ. ఆటగాళ్ల మధ్య గొడవలు సృష్టించి తను చక్రం తిప్పాలనుకున్నాడు. దాని ఫలితంగా ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్న సహచరులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు" అని భజ్జీ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విభజన వెనుక కుట్ర కోణం ఉండవచ్చని హర్భజన్ అనుమానం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వగల ఏకైక జట్టుగా భారత్ ఉందని, అలాంటి జట్టును బలహీనపరిస్తే మైదానంలో ఓటమి ఖాయమనే వ్యూహంతో చాపెల్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు.

చాపెల్ విధానాల వల్లే 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైందని హర్భజన్ పరోక్షంగా తెలిపాడు. ఆ టోర్నీలో బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడి, గ్రూప్ దశలోనే భారత్ ఇంటిదారి పట్టడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. సీనియర్ ఆటగాళ్లతో బహిరంగ విభేదాలు, వివాదాలతో నిండిన చాపెల్ కోచింగ్ శకం ఆ ప్రపంచకప్ వైఫల్యంతోనే ముగిసింది. హర్భజన్ తాజా వ్యాఖ్యలతో చాపెల్ కోచింగ్‌పై ఉన్న పాత వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.