భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి క్రీడారంగంపై ప్రభావం చూపాయి. భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ వెటరన్ల (50 ఏళ్లకు పైబడిన వారు) జట్టుకు అనుమతి లభించలేదు. భారత్‌లో పర్యటించి టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది.

గత ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టే విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నా, పీసీబీ అనుమతి ఇవ్వలేదని పాకిస్థాన్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ (పీవీసీఏ) అధిపతి ఫవాద్ ఇజాజ్ తెలిపారు. టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్వాహకులకు తెలియజేశామని, తమ స్థానంలో మరో జట్టును ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించామని వివరించారు.

తమ జట్టుకు వీసాలు, ఉన్నత స్థాయి భద్రత కల్పిస్తామని ఆతిథ్య దేశమైన భారత్ హామీ ఇచ్చిందని, ఆ తర్వాతే తాము పీసీబీ, విదేశాంగ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖల అనుమతి కోరామని ఫవాద్ ఇజాజ్ పేర్కొన్నారు. అయితే, పీసీబీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. భారత్‌లో ఆడేందుకు అనుమతి లేదని స్పష్టం చేసినట్లు ఫవాద్ ఇజాజ్ వెల్లడించారు.

ఇటీవల పాకిస్థాన్ హాకీ జట్టు కూడా ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌కు రావడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా లేకపోవడంతో కేవలం బహుళ దేశాల టోర్నీలలో, తటస్థ వేదికలపై మాత్రమే ఇరు జట్లు క్రికెట్ ఆడుతున్నాయి.