టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా? అనే చర్చకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెరదించారు. వారిద్దరి ఎంపికకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండి, అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నంత కాలం జట్టులో కొనసాగుతారని హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా జట్టులో వారి స్థానంపై జరుగుతున్న చర్చకు ఈ వ్యాఖ్యలతో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

'స్పోర్ట్‌స్టార్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్హాస్ మాట్లాడుతూ.. "నా దృష్టిలో, ఎంపికకు ఫిట్‌నెస్, ప్రదర్శన మాత్రమే ప్రామాణికం కావాలి, వయసు కాదు. ఒక ఆటగాడు ఫిట్‌గా ఉండి, దేశం కోసం మ్యాచ్‌లు గెలిపిస్తూ, అద్భుతంగా ఆడుతుంటే, మనం దానిపైనే దృష్టి పెట్టాలి" అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో సీనియర్ ఆటగాళ్ల అభిమానులకు ఊరట లభించినట్లయింది.

మన్హాస్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ కోహ్లీ, రోహిత్ ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆడిన చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లలో 76.75 సగటుతో 307 పరుగులు సాధించాడు. ఇందులో గత నెల వెస్టిండీస్‌పై సాధించిన అజేయ 139 పరుగుల సెంచరీ కూడా ఉంది. 

అదే సమయంలో రోహిత్ శర్మ తన ఫామ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతను ఆడిన చివరి ఐదు వన్డేల్లో 77.80 సగటుతో 389 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో ఇంగ్లండ్‌పై చేసిన 138 పరుగులు కూడా ఇందులో భాగమే.

విరాట్, రోహిత్ వంటి సీనియర్ల అనుభవం యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని మన్హాస్ అభిప్రాయపడ్డారు. "శుభ్‌మన్ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు, భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవం ప్రపంచకప్‌లో అతనికి కలిసొస్తుంది. జట్టులో విరాట్, హార్దిక్, రోహిత్ వంటి వారు ఉండటం గిల్‌కు కచ్చితంగా ఒక ప్రయోజనం. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కెప్టెన్‌గా, మరొకరు ఫీల్డింగ్ యూనిట్‌కు నాయకత్వం వహించడం ద్వారా పనిభారాన్ని పంచుకోవచ్చు. గిల్ చాలా సమర్థుడు, సీనియర్లు అతనికి అండగా ఉండటం జట్టుకు మేలు చేస్తుంది" అని మన్హాస్ వివరించారు.