ప్రపంచ క్రీడా చరిత్రలో మంగళవారం రాత్రి ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికైంది. వయసు ఉడిగిపోతోందని, రిటైర్మెంట్ దగ్గరపడిందని విమర్శించే వారికి తమ ఆటతోనే సమాధానమిచ్చారు ఇద్దరు గ్లోబల్ లెజెండ్స్. ఒకరు టెన్నిస్ కోర్టులో 5 గంటల పాటు వీరోచితంగా పోరాడితే.. మరొకరు ఫుట్‌బాల్ మైదానంలో ఓటమి అంచుల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో గెలిపించారు. 39 ఏళ్ల ప్రాయంలో నొవాక్ జొకోవిచ్, లియోనెల్ మెస్సీలు సృష్టించిన ఈ కంబ్యాక్ అద్భుతాలు క్రీడాభిమానులను ముగ్ధులను చేస్తున్నాయి.

వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘ క్వార్టర్ ఫైనల్
లండన్‌లోని సెంటర్ కోర్టులో 39 ఏళ్ల నొవాక్ జొకోవిచ్, తనకంటే 14 ఏళ్లు చిన్నవాడైన వరల్డ్ నంబర్ 4 ఆటగాడు ఫెలిక్స్ ఆగర్-అలియాసిమేతో తలపడ్డాడు. వింబుల్డన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 5 గంటల 15 నిమిషాల పాటు జొకోవిచ్ పోరాడాడు. నడుము నొప్పి వేధిస్తున్నా, మ్యాచ్ మధ్యలో చికిత్స తీసుకుంటూనే.. ఐదో సెట్ టై బ్రేకర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో 7-6(10), 3-6, 6-3, 6-7(4), 7-6(10-4) తేడాతో జొకోవిచ్ సంచలన విజయం సాధించాడు. ఈ గెలుపుతో వింబుల్డన్ చరిత్రలోనే అత్యంత వృద్ధ సెమీఫైనలిస్ట్‌గా జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. "ఇలాంటి క్షణాల కోసమే నేను ఇంకా టెన్నిస్ ఆడుతున్నాను" అని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ భావోద్వేగానికి గురయ్యాడు.

అట్లాంటాలో మెస్సీ ‘గ్రేట్ ఎస్కేప్’
లండన్‌లో జొకోవిచ్ చరిత్ర సృష్టిస్తున్న సమయానికి కొన్ని గంటల ముందే.. అటు అమెరికాలోని అట్లాంటాలో ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఈజిప్ట్‌తో జరిగిన ఈ కీలక పోరులో అర్జెంటీనా 2-0తో వెనుకబడి, ఓటమి అంచుల్లో నిలిచింది. పైగా మ్యాచ్ మధ్యలో మెస్సీ ఒక పెనాల్టీ కిక్‌ను కూడా మిస్ చేశాడు. అయితే 75వ నిమిషం తర్వాత మెస్సీ మ్యాజిక్ మొదలైంది. ఒక అద్భుతమైన పాస్ ద్వారా క్రిస్టియన్ రొమేరో హెడర్ గోల్ చేయడానికి మెస్సీ అసిస్ట్ అందించాడు. ఆ తర్వాత 4 నిమిషాలకే మెస్సీ స్వయంగా గోల్ కొట్టి స్కోరును 2-2తో సమం చేశారు. చివరి నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ మరో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 3-2తో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో 75వ నిమిషం వరకు రెండు గోల్స్ వెనుకబడి ఉండి, నిర్ణీత సమయంలోనే మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. ఈ టోర్నమెంట్‌లో 8 గోల్స్ చేసిన మెస్సీ.. ఎంబాప్పే, హాలాండ్‌లను వెనక్కి నెట్టి గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నారు. శారీరక నొప్పులను సైతం భరిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో చూపించిన పట్టుదల.. విజేతలకు వయసుతో నిమిత్తం లేదని మరోసారి నిరూపించింది.