ఫిఫా వరల్డ్‌ కప్‌లో చరిత్ర సృష్టించిన జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది. ట్రోఫీ గెలవకపోయినా అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని నార్వే మరోసారి నిరూపించింది. వేలాది మంది ఒకేచోట చేరి ఆటగాళ్లను అభినందించడంతో రాజధాని ఓస్లో పండుగ వాతావరణాన్ని తలపించింది.

90 వేల మంది సందడి
ఫిఫా వరల్డ్‌ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన నార్వే జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను అభినందించేందుకు దాదాపు 90 వేల మంది అభిమానులు రాయల్‌ ప్యాలెస్‌ బయటకు చేరుకున్నారు. మయామిలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌తో అదనపు సమయంలో 2-1 తేడాతో ఓడినా, నార్వే జట్టు ప్రదర్శనకు అభిమానులు అనూహ్యంగా స్పందించారు. ఫిఫా వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఆ దేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

‘వైకింగ్‌ రో’తో సంబరాలు
వేదికపైకి వచ్చిన ఆటగాళ్లకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, అభిమానులు కలిసి ‘వైకింగ్‌ రో’ సంబరాల్లో పాల్గొన్నారు. టోర్నీ అంతా అభిమానులను అలరించిన ఈ ప్రత్యేక వేడుక మరోసారి అక్కడి వాతావరణాన్ని ఉత్సాహంతో నింపింది. అనంతరం రాజ కుటుంబ సభ్యులతో కలిసి ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేశారు.

బస్సు పరేడ్‌తో సందడి
రాయల్‌ ప్యాలెస్‌ కార్యక్రమం తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఓస్లో ప్రధాన వీధుల్లో బస్సు పరేడ్‌ నిర్వహించారు. కార్ల్‌ జోహాన్స్‌ గేట్‌, రాధుస్‌ప్లాసెన్‌ ప్రాంతాల్లో కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జట్టుకు అభినందనలు తెలిపారు. అర్ధరాత్రి వరకు నగరంలో సంబరాలు కొనసాగాయి.

అభిమానుల ప్రేమ మరువలేం
ఇలాంటి స్వాగతాన్ని ఎవరూ ఊహించలేదని నార్వే కెప్టెన్‌ మార్టిన్‌ ఓడెగార్డ్‌ అన్నారు. అమెరికాలోనే కాదు, స్వదేశంలో కూడా అభిమానుల నుంచి ఊహించని మద్దతు లభించిందని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం తమకూ ఆశ్చర్యం కలిగించిందని కోచ్‌ స్టాలే సోల్బాకెన్‌ తెలిపారు. అయితే జట్టు స్టార్‌ స్ట్రైకర్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ ఇటలీకి వెళ్లాల్సి ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.