మారుతి సుజుకి భారత మార్కెట్లో కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త డిజైన్‌, మరిన్ని ప్రీమియం ఫీచర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థతో ఈ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. బ్రెజ్జా LXI, VXI, ZXI, ZXI+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. రూ.11,000 టోకెన్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

డిజైన్ పరంగా ముందు భాగంలో కొత్త గ్రిల్‌, రీడిజైన్ చేసిన బంపర్‌, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, డీఆర్‌ఎల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. కొత్త అలాయ్ వీల్స్‌తో పాటు వెనక భాగంలో టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను కూడా మార్చారు. క్యాబిన్‌లో బ్లాక్-బ్రౌన్ డ్యూయల్ టోన్ థీమ్‌ను కొనసాగిస్తూ 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అలెక్సా సపోర్ట్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్‌, ఆటో క్లైమేట్ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లను జోడించారు.

భద్రతకు కూడా కంపెనీ పెద్దపీట వేసింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్‌, ఏబీఎస్‌-ఈబీడీ, చైల్డ్ సీట్ మౌంట్స్‌, టీపీఎంఎస్‌, బ్లైండ్ స్పాట్ వార్నింగ్‌, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్‌, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త బ్రెజ్జాకు భారత్ ఎన్‌సీఏపీలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా లభించింది.

ఇంజిన్ పరంగా 1.5-లీటర్ పెట్రోల్‌, 1.0-లీటర్ టర్బో పెట్రోల్‌, సీఎన్‌జీ అనే మూడు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. పెట్రోల్ మోడళ్లకు 6-స్పీడ్ మాన్యువల్‌, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. సీఎన్‌జీ వేరియంట్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. ధరలు గత మోడల్‌తో పోలిస్తే కొద్దిగా పెరిగినా, అదనపు ఫీచర్లు, మెరుగైన భద్రత కారణంగా కొత్త బ్రెజ్జాపై మార్కెట్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.