ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. కేవలం చాటింగ్, కాలింగ్‌కే పరిమితం కాకుండా మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్లను తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త టూల్స్ ద్వారా యూజర్లు కంటెంట్ సృష్టించడం, చాటింగ్‌లో సహాయం పొందడం, ఫొటోలను సులభంగా ఎడిట్ చేయడం వంటి పనులు చేసుకోవచ్చు. దీంతో వాట్సాప్ స్వరూపమే పూర్తిగా మారిపోనుంది.

ఇమేజ్‌లు, స్టిక్కర్ల తయారీ: ఈ కొత్త ఫీచర్లలో అత్యంత ఆసక్తికరమైనది ఇమేజ్ జనరేషన్. యూజర్లు తమకు ఎలాంటి బొమ్మ కావాలో టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తే చాలు, మెటా ఏఐ దానికి తగిన చిత్రాన్ని సృష్టించి ఇస్తుంది. అంతేగాక మన మూడ్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన స్టిక్కర్లను కూడా తయారు చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్చర్లను కూడా ఏఐ సహాయంతో రూపొందించుకునే అవకాశం ఉంది.

చాటింగ్‌లోనే ఏఐ సహాయం: ఇకపై వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్స్‌లో ఏదైనా సమాచారం కావాలంటే, సింపుల్‌గా ‘@Meta AI’ అని ట్యాగ్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు దగ్గర్లోని మంచి రెస్టారెంట్లు ఏవి? లేదా ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఏఐ వెంటనే సమాచారం అందిస్తుంది. అంతేకాదు గ్రూప్‌లో మనం చూడని సుదీర్ఘ సంభాషణలను సైతం ఏఐ క్షణాల్లో చదివి, దాని సారాంశాన్ని అందిస్తుంది. దీంతో యూజర్లు కీలక విషయాలను త్వరగా తెలుసుకోవచ్చు.

ఫొటో టూల్స్, ప్రైవసీ: ఈ అప్‌డేట్‌లో ఫొటోల కోసం కూడా ప్రత్యేక టూల్స్ ఉన్నాయి. ఏదైనా ఫొటోను అప్‌లోడ్ చేసి, అందులోని ప్రదేశం లేదా వస్తువు గురించి సమాచారం అడిగితే ఏఐ గుర్తిస్తుంది. అలాగే, ఫొటోలోని అనవసరమైన వస్తువులను తొలగించాలనుకుంటే, టెక్స్ట్ కమాండ్ ద్వారా సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. యూజర్ల ప్రైవసీకి కూడా మెటా ప్రాధాన్యత ఇచ్చింది. ఏఐతో చేసే సంభాషణలు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ‘ప్రైవేట్ చాట్ మోడ్’ను అందిస్తోంది. బ్రౌజర్‌లోని ప్రైవేట్ మోడ్ తరహాలో, ఈ చాట్స్ ఎక్కడా సేవ్ కావు.

వాట్సాప్ మొబైల్ యాప్, వెబ్ వెర్షన్, మాక్‌ఓఎస్ క్లయింట్‌లలో ఈ ఏఐ ఫీచర్లు పనిచేస్తాయి. సెర్చ్ బార్‌లో వెతకడం ద్వారా లేదా చాట్స్‌లో ట్యాగ్ చేయడం ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏఐతో చేసే చాట్స్, ఫైల్స్‌కు కూడా ఎప్పటిలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే, కొన్ని ఫీచర్లు ప్రాంతాన్ని బట్టి దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.