టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ ఓ ఉత్పత్తి ధరను గణనీయంగా తగ్గించింది. గతంలో అధిక ధర కారణంగా తీవ్ర విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్న తన ‘పాలిషింగ్ క్లాత్’ (క్లీనింగ్ క్లాత్)లో కొత్త, చవకైన వెర్షన్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. భారత మార్కెట్లో గతంలో దీని ధర రూ.1,780 ఉండగా, ఇప్పుడు కొత్త వెర్షన్‌ను రూ.1,098కే అందుబాటులోకి తెచ్చింది. దీంతో దాదాపు ₹682 మేర ధర తగ్గింది.

కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియోలతో పాటు ఆగస్టు 25న ఎలాంటి ప్రత్యేక ప్రకటన లేకుండా యాపిల్ తన ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ కొత్త క్లాత్‌ను అమ్మకానికి ఉంచింది. యాపిల్ ఉత్పత్తుల స్క్రీన్లను ఎలాంటి గీతలు పడకుండా సురక్షితంగా, సమర్థవంతంగా శుభ్రం చేయడానికి ఈ మృదువైన క్లాత్ ఉపయోగపడుతుందని కంపెనీ తన వివరణలో పేర్కొంది. ముఖ్యంగా సున్నితమైన నానో-టెక్చర్ గ్లాస్ డిస్‌ప్లేలకు కూడా ఇది సురక్షితమని తెలిపింది.

అయితే, పాత వెర్షన్‌తో పోలిస్తే కొత్త క్లాత్‌లో చేసిన మార్పులపై యాపిల్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ప్రాథమికంగా పరిశీలించిన కొందరు యూజర్లు, పాత క్లాత్ కన్నా ఇది మరింత మృదువుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. కంపెనీ తన వెబ్‌సైట్‌లో పాత ఉత్పత్తి కోడ్‌ను తొలగించి, కొత్త కోడ్ (MLH74AM/A)తో దీనిని జాబితా చేసింది.

2021లో తొలిసారిగా 19 డాలర్ల (భారత్‌లో సుమారు రూ.1,780) ధరకు విడుదలైనప్పుడు, ఒక చిన్న క్లాత్‌కు ఇంత ధర అవసరమా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు దాని ధరను 9 డాలర్లకు తగ్గించడం గమనార్హం. సాధారణంగా ఉత్పత్తుల ధరలను పెంచే యాపిల్, ఇలా తగ్గించడం అరుదైన విషయమని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బ్రాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వని వారికి మార్కెట్‌లో చాలా తక్కువ ధరకే మైక్రోఫైబర్ క్లాత్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, యాపిల్ బ్రాండ్‌ను ఇష్టపడేవారికి ఈ కొత్త, చవకైన క్లాత్ ఆకర్షణీయంగా మారింది.