ప్రముఖ వాహన దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ, లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా రాబోయే రెండేళ్లలో బ్రిటన్‌లో సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.

అమెరికా విధించిన టారిఫ్‌లు, పెరుగుతున్న వాహన తయారీ వ్యయం, అంతర్జాతీయంగా తగ్గుతున్న అమ్మకాలు వంటి కారణాల రీత్యా కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు చైనా నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అవుతున్న భారీ ఖర్చులు, అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం జేఎల్ఆర్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ ఏడాది జూన్ చివరి నాటికి కంపెనీ ఆదాయం దాదాపు 10 శాతం మేర క్షీణించడమే ఇందుకు నిదర్శనం.

ఉద్యోగాల కోతకు సంబంధించిన సమాచారాన్ని యాజమాన్యం ఇప్పటికే అంతర్గతంగా సిబ్బందికి చేరవేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా మేనేజ్‌మెంట్ బృందాలు, నెలవారీ వేతన సిబ్బందిపై పడనుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో జేఎల్ఆర్ సుమారు 34,000 మందికి ఉపాధి కల్పిస్తోంది.