బ్రిటన్‌లో 'ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్' (ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన తీవ్ర సాంకేతిక సమస్య కారణంగా విమానయాన రంగం స్తంభించిపోయింది. ఈ సమస్య వల్ల దేశవ్యాప్తంగా నిన్న‌ 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. 'ఫ్లైట్‌రాడార్24' వెబ్‌సైట్ ప్రకారం..  వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి రన్‌వేలపై విమానాల్లో, ఎయిర్‌పోర్ట్ టెర్మినళ్లలో చిక్కుకుపోయారు.

బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎన్ఏటీఎస్‌) సాయంత్రానికి ఫ్లైట్ ప్రాసెసింగ్ సిస్టమ్‌లోని సమస్యను పరిష్కరించినట్లు ప్రకటించింది. అయితే, అప్పటికే పేరుకుపోయిన విమానాల కారణంగా దేశంలోని 15 విమానాశ్రయాల్లో ఆలస్యం కొనసాగింది. లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయిన విమానాలు తిరిగి బయలుదేరినప్పటికీ, గందరగోళం కారణంగా ఆ రాత్రికి విమానాల రాకను పూర్తిగా నిలిపివేశారు.

ఈ సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్యాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో ఐర్లాండ్ వెళ్లాల్సిన రయన్‌ఎయిర్ విమానంలో జోసీ డొనోఘ్యూ అనే ప్రయాణికురాలు మూడు గంటల పాటు చిక్కుకుపోయారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేశారు. "ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటపడటం అల్కట్రాజ్ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లుంది. అక్కడ పరిస్థితిని వర్ణించడానికి మాటలు రావడం లేదు. అదో పీడకల" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హీత్రూలో బాల్టిమోర్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రయాణికులు నాలుగు గంటల తర్వాత విమానం నుంచి కిందకు దిగాల్సి వచ్చింది. ఆలస్యం సమయంలో ఫ్లైట్ సిబ్బంది వారికి ఆహారం అందించారు. అయితే, ఆ తర్వాత బ్యాగేజ్ క్లెయిమ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. తమకు ఎవరూ సహాయం చేయలేరని, బ్యాగేజ్ కోసం క్లెయిమ్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.

ఈ ఘటన కారణంగా 100కి పైగా విమానాలను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగిందని బ్రిటిష్ ఎయిర్‌వేస్ తెలిపింది. తమ విమానాల్లో ప్రయాణించాల్సిన 65,000 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని, 50కి పైగా విమానాలను రద్దు చేశామని రయన్‌ఎయిర్ ప్రకటించింది. 

"ఈ సమస్య ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇది పూర్తిగా మా నియంత్రణలో లేని ఘటన. దీనివల్ల మా ప్రయాణికులు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు" అని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి తెలిపారు. లండన్‌లోని స్టాన్‌స్టెడ్, సిటీ ఎయిర్‌పోర్ట్‌లతో పాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, స్కాట్లాండ్ విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. ఈ సమస్య ప్రభావం యూరప్‌లోని ఇతర విమానాలపై కూడా పడిందని ఈజీజెట్ పేర్కొంది.