రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350కి కొత్త లుక్‌ వచ్చింది. పండగ సీజన్‌ ముందు కంపెనీ కొత్త సిగ్నేచర్‌ వైట్‌ కలర్‌ను తీసుకొచ్చింది. దీంతో క్లాసిక్‌ 350 మరింత ప్రీమియం లుక్‌లో కనిపించనుంది. ఈ కొత్త వేరియంట్‌ ధర రూ.2.24 లక్షలు. అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్‌.

క్లాసిక్‌ 350లో కొత్త సిగ్నేచర్‌ వైట్‌ వేరియంట్‌ టాప్‌ మోడల్‌గా నిలిచింది. ఇందులో వైట్‌ కలర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌, సైడ్‌ ప్యానెల్స్‌ ఉన్నాయి. బ్లాక్‌ మడ్‌గార్డులు, హెడ్‌ల్యాంప్‌ హౌసింగ్‌, ఫ్రేమ్‌తో కాంట్రాస్ట్‌ లుక్‌ ఇచ్చారు. పిన్‌స్ట్రైపింగ్‌, క్రోమ్‌ టచ్‌, బ్రౌన్‌ సీట్‌ దీనికి మరింత రిట్రో లుక్‌ను ఇస్తాయి.

ధరలు ఇలా..
రెడిచ్‌ రెడ్‌ ధర రూ.1.87 లక్షలు. మద్రాస్‌ రెడ్‌ రూ.1.94 లక్షలు. మెడాలియన్‌ బ్రాంజ్‌ రూ.1.99 లక్షలు. కమాండో సాండ్‌, గోర్ఖా గ్రీన్‌ ధరలు రూ.2.10 లక్షలు. గన్‌ గ్రే, స్టీల్త్‌ బ్లాక్‌ రూ.2.19 లక్షలు. ఎమరాల్డ్‌, కొత్త సిగ్నేచర్‌ వైట్‌ ధర రూ.2.24 లక్షలు.

ఇంజిన్‌లో మార్పులు లేవు
కొత్త కలర్‌ మినహా బైక్‌లో ఎలాంటి మెకానికల్‌ మార్పులు చేయలేదు. ఇందులో 349 సీసీ జే-సిరీస్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 20.2 బీహెచ్‌పీ పవర్‌, 27 ఎన్ఎం టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో ఇంజిన్‌ను జత చేశారు.

తక్కువ వేగంలో మంచి టార్క్‌ అందేలా ఈ ఇంజిన్‌ను రూపొందించారు. దీంతో నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు కూడా ఇది సరిపోతుంది. ఇటీవలే క్లాసిక్‌ 350లో గోర్ఖా గ్రీన్‌ కలర్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఇప్పుడు సిగ్నేచర్‌ వైట్‌తో కలర్‌ ఆప్షన్లు మరింత పెరిగాయి.