పాకిస్థాన్‌లో కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కరాచీలో వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌, ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసీం మునీర్‌ కొత్త ప్రావిన్సుల అవసరంపై మాట్లాడినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యల తర్వాత కేంద్ర హోంమంత్రి మొహ్సిన్‌ నఖ్వీ కూడా రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ఎంక్యూఎం-పీ నేతలు సైతం కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు మద్దతు తెలిపారు.

పాకిస్థాన్‌లో ప్రస్తుతం నాలుగు ప్రధాన ప్రావిన్సులు ఉన్నాయి. వీటిని విభజించి 12 వరకు పరిపాలనా యూనిట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు పాక్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారిక మ్యాప్‌, సమగ్ర ముసాయిదా లేదా ప్రావిన్సుల విభజనకు స్పష్టమైన ప్రమాణాలు వెల్లడికాలేదు. ఎంక్యూఎం-పీ మాత్రం జనాభా ప్రాతిపదికన ప్రావిన్సులను విభజిస్తే పాలన మెరుగుపడుతుందని చాలాకాలంగా వాదిస్తోంది.

ఈ ప్రతిపాదనపై రాజకీయ చర్చ మొదలవుతున్న సమయంలోనే పాకిస్థాన్‌లో సైనిక వ్యవస్థకు పెరిగిన అధికారాలపై కూడా చర్చ జరుగుతోంది. 2025లో తీసుకొచ్చిన 27వ రాజ్యాంగ సవరణతో ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై ఏకీకృత కమాండ్‌ వ్యవస్థ ఏర్పడింది. అదే సవరణలో ఆయనకు ఐదేళ్ల పదవీకాలం, జీవితకాల హోదా వంటి అంశాలు చేర్చారు.

2026 ఆగస్టులో పాకిస్థాన్‌ పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త రక్షణ చట్టాలు ఈ కమాండ్‌ వ్యవస్థకు మరింత చట్టబద్ధ రూపం ఇచ్చాయి. దీంతో దేశంలో సైనిక వ్యవస్థ పాత్ర, పౌర పాలనపై దాని ప్రభావంపై విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

కొత్త ప్రావిన్సుల ప్రతిపాదన కూడా ఇదే రాజకీయ నేపథ్యంలో చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అసీం మునీర్‌ వ్యాఖ్యల ఆధారంగా వెంటనే కొత్త ప్రావిన్సుల ఏర్పాటు ఖరారైందని చెప్పేందుకు ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక నిర్ణయం వెలువడలేదు. పైగా మొహ్సిన్‌ నఖ్వీ కొత్త ప్రావిన్సుల ఏర్పాటు ఖరారైందని చెప్పినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారమైన ఓ వీడియోను పాక్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ సంస్థ నకిలీ ఆడియోతో రూపొందించినదిగా గుర్తించింది.