చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. నిన్న‌ వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో దిగిన జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి అరుదైన స్వాగతం పలికారు. ఈ పర్యటన ప్రారంభమవుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పదేళ్ల తర్వాత యూఎస్ రాజధాని వాషింగ్టన్‌లో ఆయన అధికారిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి విమానం దిగగా, ట్రంప్ దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడంతో పాటు మిలటరీ బ్యాండ్ ప్రదర్శన, విమానాల ఫ్లైఓవర్ కూడా నిర్వహించారు. ఒక దేశాధినేతకు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలకడం చాలా అరుదైన విషయంగా దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

జిన్‌పింగ్ పర్యటన ప్రారంభం కాగానే, యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని నవంబర్ 10 నుంచి జనవరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని సుంకాలను తగ్గించడంతో పాటు, కొత్తగా ఎలాంటి వాణిజ్య ఆంక్షలు విధించకుండా విరామం ఇచ్చారు.

శుక్రవారం వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వైట్‌హౌస్‌లో అధికారిక కార్యక్రమాలు, స్టేట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కీలక ఖనిజాలు, తైవాన్, ఇరాన్ సంక్షోభం వంటి అంశాలు వీరి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. 

జిన్‌పింగ్ వెంట చైనా సీనియర్ అధికారులు కాయ్ కీ, విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భారీ ఒప్పందాలు ఖరారవుతాయని అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగించేందుకు ఈ భేటీ దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.