ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధంలో రష్యా విదేశీ పౌరులను కూడా వాడుకుంటోందని, ఈ జాబితాలో భారతీయులు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్‌జీఏ) ఆయన ప్రసంగిస్తూ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా తమ సైన్యంలోకి భారత్ సహా మొత్తం 47 దేశాల పౌరులను నియమించుకుని, వారిని యుద్ధ రంగంలోకి దించుతోందని ఆరోపించారు.

ఈ జాబితాలో ఘనా, నేపాల్, తజికిస్థాన్, భారత్, యెమెన్, కెన్యా, జింబాబ్వే, క్యూబా, బెలారస్, సుడాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల పేర్లను జెలెన్‌స్కీ ప్రస్తావించారు. మోసపూరిత మార్గాల్లో, జిమ్మిక్కులు చేసి ఈ దేశాల పౌరులను రష్యా తమ దేశానికి రప్పించుకుంటోందని, ఆ తర్వాత వారిని బలవంతంగా సైనిక సేవలోకి దించుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా చేస్తున్న ఈ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.

"ఈ 47 దేశాల ప్రతినిధులతో నేను నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. రష్యా మీ ప్రజలతో ఏం చేస్తోందో మీకు తెలుసు. వారు మీ పౌరులు. వారిని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మరో యుద్ధ క్షేత్రంలోకి నెట్టవద్దు. ఈ యుద్ధంలోకి పుతిన్ మిమ్మల్ని లాగకుండా చూసుకోండి" అని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో ఉత్తర కొరియాతో రష్యా సైనిక సహకారంపైనా జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ సైన్యం ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకుందని, వారిని దక్షిణ కొరియాకు అప్పగించామని తెలిపారు. 

మరోవైపు, ఉక్రెయిన్ తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకుంటోందని, ఇందులో భాగంగా ఫిన్‌లాండ్‌తో డ్రోన్‌ల ఒప్పందం, ఆస్ట్రేలియాతో భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. యుద్ధాన్ని కొనసాగించే రష్యా సామర్థ్యాన్ని పరిమితం చేసేందుకు అంతర్జాతీయ సమాజం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ప్రసంగం ద్వారా కోరారు.