అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హ‌ర్మూజ్ జలసంధిలో సాధారణ రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అంతేగాక నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఖతార్ ద్వారా అమెరికాకు ఒక నిర్దిష్ఠ‌ ప్రణాళికను పంపినట్లు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, చమురు ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులకు అంగీకరిస్తే.. ఏడు రోజుల్లో హ‌ర్మూజ్ జలసంధిని తెరిచి, లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాల్లో ఘర్షణలను నిలిపివేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీని తర్వాత అణు కార్యక్రమంపై విస్తృత చర్చలకు సిద్ధమని పేర్కొంది.

అయితే, ఇరాన్ తన డిమాండ్లను నెరవేరుస్తుందనే నమ్మకం లేదని ట్రంప్ భావిస్తున్నట్లు 'వాల్ స్ట్రీట్' జర్నల్ కథనం పేర్కొంది. ఇరాన్‌ను అణుబాంబును సొంతం చేసుకోనివ్వనని శపథం చేసిన ఆయన, ఎన్నికల తర్వాత దాడులే సరైన మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హ‌ర్మూజ్ జలసంధిని 'ట్రంప్ స్ట్రెయిట్' అని లేబుల్ చేసిన చిత్రాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పంచుకోవడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఈ వివాదం మొదలైంది. జూన్‌లో ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య 14 పాయింట్ల ఒప్పందం కుదిరినా అది విఫలమైంది. ఈ ఒప్పందం ముగిసిపోయిందని జులైలో ట్రంప్ ప్రకటించగా, అమెరికా తన హామీలను ఉల్లంఘించిందని టెహ్రాన్ ఆరోపించింది. ప్రస్తుతం మధ్యవర్తులతో సానుకూల చర్చలు జరుపుతున్నామని వైట్‌హౌస్ చెబుతున్నప్పటికీ, ఒత్తిడికి లొంగి తమ సార్వభౌమ హక్కులను వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.