పాకిస్థాన్‌లో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. విపరీతంగా పెరిగిన యుటిలిటీ బిల్లులు, ద్రవ్యోల్బణం, ప్రైవేట్ సేవల ఖర్చులు వారి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వేతన జీవుల పొదుపు వేగంగా కరిగిపోతుండగా, వారి ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.

ఇటీవల 'డాన్' పత్రిక నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్న జీతభత్యాలు పొందే ఉద్యోగుల్లో దాదాపు 65 శాతం మంది, గతేడాదితో పోలిస్తే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా లేదా కొంతవరకు దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆదాయంలో 10 శాతానికి పైగా పొదుపు లేదా పెట్టుబడి పెట్టే కుటుంబాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2021లో ఇది 36 శాతంగా ఉండగా, 2026 నాటికి కేవలం 12.5 శాతానికి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిత్యావసర ఖర్చుల కోసం కుటుంబాలు తమ పొదుపు మొత్తాలను వాడేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అధికారిక గణాంకాల ప్రకారం.. 2024-25లో పాకిస్థాన్‌లో సగటు నెలవారీ కుటుంబ ఆదాయం రూ. 82,179గా ఉంటే, వినియోగ ఖర్చులు రూ. 79,150గా ఉన్నాయి. అంటే, అత్యవసరాలకు, భవిష్యత్ అవసరాలకు నెలకు కేవలం రూ. 3,000 మాత్రమే మిగులుతోంది. 

ముఖ్యంగా కరెంట్, గ్యాస్, నీటి బిల్లులు ఆదాయంలో సింహభాగాన్ని మింగేస్తున్నాయి. ఆహారం, రవాణా ఖర్చులు కూడా పెరగడంతో ఇతర ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది. విశ్లేషకుల ప్రకారం పాకిస్థాన్‌లోని మధ్యతరగతి వర్గం ఒకరకమైన ఊబిలో చిక్కుకుంది. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేంత తక్కువ ఆదాయం వారికి లేదు, అదే సమయంలో ధనికుల్లా పెరిగిన ఖర్చులను భరించేంత స్థోమత కూడా లేదు. ప్రభుత్వ సేవలు సరిగా లేకపోవడంతో మెరుగైన విద్య, వైద్యం కోసం ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది వారిపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది.

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా విద్యుత్ టారిఫ్‌లను మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

దేశ స్థూల ఆర్థిక సూచికలు కొంత మెరుగుపడినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విఫలమయ్యాయని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.