ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ వేదికపై మద్దతు పెరుగుతోంది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న 81వ సర్వసభ్య సభ (UNGA) సమావేశాల్లో పలు దేశాలు భారత్‌ వాదనకు అండగా నిలిచాయి. పోర్చుగల్, మారిషస్ దేశాలు నేరుగా భారత్‌కు మద్దతు ప్రకటించగా, మార్షల్ ఐలాండ్స్ జీ4 కూటమికి జై కొట్టింది. భద్రతా మండలిని ప్రస్తుత రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా విస్తరించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

సమావేశాల సందర్భంగా పోర్చుగల్ ప్రధాని లూయిస్ మోంటెనెగ్రో మాట్లాడుతూ, భద్రతా మండలిలో ప్రాతినిధ్యం పెరగాలని, ఆఫ్రికా, బ్రెజిల్, భారత్‌లకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్ అత్యంత స్పష్టమైన మద్దతును ప్రకటించారు. "ప్రపంచ వ్యవహారాల్లో భారత్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రకు అనుగుణంగా, శాశ్వత సభ్యత్వం కోసం ఆ దేశ అభ్యర్థిత్వాన్ని మేం సమర్థిస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. జీ4, ఎల్69 గ్రూపుల వాదనలకు కూడా తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లతో కూడిన జీ4 కూటమికి కూడా మద్దతు లభించింది. మార్షల్ ఐలాండ్స్ అధ్యక్షురాలు హిల్డా హీన్ మాట్లాడుతూ, "భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, దాని జీ4 భాగస్వాములకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని ప్రకటించారు. దీని ద్వారా ఆమె పరోక్షంగా భారత్‌కు మద్దతు పలికినట్టయింది.

ఈ సమావేశాల్లో ఆఫ్రికా దేశాల నుంచి సంస్కరణల కోసం అత్యంత బలమైన గళం వినిపించింది. సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాదా బయో మాట్లాడుతూ, "భద్రతా మండలి ఇప్పటికీ 1945 నాటి ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది. 160 కోట్లకు పైగా జనాభా ఉన్న ఆఫ్రికాకు ఇప్పటికీ శాశ్వత స్థానం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామ మాట్లాడుతూ, "భద్రతా మండలి సంస్కరణ అనేది ఆఫ్రికాకు చేసే మేలు కాదు.. ఐరాస విశ్వసనీయత, మనుగడకు ఇది అత్యవసరం" అని అన్నారు.

అయితే, భద్రతా మండలి సంస్కరణలు జరగాలన్న దానిపై విస్తృత ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, ఏ దేశాలకు అవకాశం ఇవ్వాలి, ప్రాంతీయ కేటాయింపులు, ముఖ్యంగా వీటో అధికారంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా శాశ్వత సభ్యులుగా ఉన్న ఈ మండలి కూర్పును మార్చాలంటే, సర్వసభ్య సభలో మూడింట రెండొంతుల సభ్యుల ఆమోదంతో పాటు, ఐదు శాశ్వత సభ్య దేశాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్లే సంస్కరణల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.