టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తూ, యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయోకు చెందిన ఓ ప్రత్యేక ఎడిషన్ ధర ఏకంగా రూ. 20 లక్షలు దాటింది. విలాసవంతమైన కస్టమ్ గాడ్జెట్‌లను తయారు చేసే కేవియర్ (Caviar) అనే సంస్థ ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను రూపొందించింది. 'లిక్విడ్ మెటల్' పేరుతో విడుదల చేసిన ఈ ఐఫోన్, దాని అసాధారణమైన ధర, ప్రత్యేకమైన డిజైన్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏమిటీ 'లిక్విడ్ మెటల్' ప్రత్యేకత?
కేవియర్ సంస్థ ఈ కస్టమ్ ఐఫోన్ తయారీలో సాధారణ మెటీరియల్స్‌కు బదులుగా అత్యంత ఖరీదైన 925 స్టెర్లింగ్ సిల్వర్‌ను ఉపయోగించింది. దీని బాడీని అద్దంలా మెరిసేలా పాలిష్ చేసి, కదులుతున్న లోహాన్ని స్తంభింపజేసినట్లుగా (metal frozen in motion) ఉండే ఒక శిల్పకళా నైపుణ్యాన్ని జోడించింది. 

ఫోల్డబుల్ ఫోన్ అంటేనే రూపాంతరం చెందడం అనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా, ఈ డిజైన్‌ను ద్రవరూపంలోని లోహపు గీతలతో తీర్చిదిద్దినట్లు కేవియర్ వివరించింది. ఈ ప్రత్యేక డిజైన్, వాడిన మెటీరియల్ కారణంగానే దీని ధర ఆకాశాన్ని అంటుతోంది.

ధరలు, లభ్యత వివరాలు
ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ల ధరలు వేరియంట్‌ను బట్టి మారుతున్నాయి. బేస్ 256GB వేరియంట్ ధర సుమారు 18,840 డాల‌ర్లు (దాదాపు రూ. 18 లక్షలు) ఉండగా.. టాప్ ఎండ్ 2TB వేరియంట్ ధర 21,340 డాల‌ర్లు (రూ. 20 లక్షలకు పైగా) పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 యూనిట్లను మాత్రమే తయారు చేయడం దీని ప్రత్యేకతను, డిమాండ్‌ను మరింత పెంచుతోంది. కేవలం ఫోన్ మాత్రమే కాదు, దాని ప్యాకేజింగ్ కూడా అత్యంత విలాసవంతంగా ఉంది. ఈ ఫోన్‌ను ఒక ప్రత్యేకమైన కేవియర్ బాక్స్‌లో అందిస్తుండగా, బంగారు తాళం చెవితో ఈ బాక్స్‌ను తెరవాల్సి ఉంటుంది.

అసలు ఐఫోన్ డ్యుయో ధర ఎంతంటే?
వాస్తవానికి, యాపిల్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ డ్యుయోను ఇటీవలే మార్కెట్లోకి తెచ్చింది. దీని బేస్ 256GB మోడల్ ధర భారత మార్కెట్లో సుమారు రూ. 2,99,900గా ఉంది. పాస్‌పోర్ట్ తరహా డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌ను తెరిచినప్పుడు 7.6-అంగుళాల పెద్ద స్క్రీన్, మూసివేసినప్పుడు 5.4-అంగుళాల బయటి డిస్‌ప్లేతో పనిచేస్తుంది. 

ఇప్పటికే అత్యంత ఖరీదైన ఈ ఫోన్‌ను, కేవియర్ సంస్థ మరింత విలాసవంతంగా మార్చి కొద్దిమంది కుబేరుల కోసం ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ అసాధారణ ధర, పరిమిత సంఖ్యలో లభ్యత కారణంగా టెక్ ప్రియులు, అరుదైన వస్తువులను సేకరించే వారి మధ్య దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.