ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న ప్రముఖ అమెరికన్ టెక్ సంస్థ 'ఆంథ్రోపిక్' ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. తమ 'క్లాడ్' ఏఐ మోడల్‌కు నైతిక విలువలు, మానవతా దృక్పథంపై శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రముఖ హిందూ స్వామీజీ సహాయాన్ని కోరింది. న్యూయార్క్‌లోని వేదాంత సొసైటీ అధిపతిగా ఉన్న స్వామి సర్వప్రియానందను తమ శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి, కీలక అంశాలపై చర్చించింది.

ఈ ఏడాది జూన్‌లో డల్లాస్‌లోని 'యూనిటీ ఆఫ్ డల్లాస్' కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్వామి సర్వప్రియానంద ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇటీవల 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసిన ఆంథ్రోపిక్, ఆ తర్వాత ప్రయాణ, వసతి ఏర్పాట్లు చేసి తమ కార్యాలయానికి పిలిపించిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన వేదాంతవేత్తలు, కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణులు కూడా పాల్గొన్నారని వివరించారు.

ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం వల్ల తలెత్తే ప్రమాదాలు, నైతికపరమైన సవాళ్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు స్వామీజీ పేర్కొన్నారు. సంస్థకు చెందిన అత్యాధునిక ఏఐ ప్రగతిని కూడా తమకు చూపించారని, అయితే నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (NDA) కారణంగా పూర్తి వివరాలు వెల్లడించలేనని స్పష్టం చేశారు.

ఏఐ అభివృద్ధిలో తీవ్రమైన పోటీ నెలకొందని, అందుకే బలమైన భద్రతా ప్రమాణాలు అత్యవసరమని ఆంథ్రోపిక్ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు, ఏఐపై అతిగా ఆధారపడటం, ఉద్యోగ నష్టాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం వంటి సామాజిక ప్రభావాలపై స్వామి సర్వప్రియానంద తన ఆందోళన వ్యక్తం చేశారు. వేదాంత మార్గంలో జ్ఞానం, ధ్యానం, భక్తి, సేవ ద్వారా ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండటమే ఇలాంటి సవాళ్లకు సమాధానమని ఆయన సూచించారు.

కేవలం హిందూమతమే కాకుండా, ఇతర మతాలు, తత్వవేత్తల నుంచి కూడా ఏఐ నైతికతపై ఆంథ్రోపిక్ సలహాలు తీసుకుంటున్నట్లు గతంలోనూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.