అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రకటించనున్న ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తనకే దక్కాలని, అయితే నోబెల్ కమిటీ తనలాంటి వారికి ఆ బహుమతిని ఇచ్చే అవకాశం తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ రేపు (శుక్రవారం) విజేతను ప్రకటించనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గత ఏడాది నుంచి తాను ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు అర్హుడినని ట్రంప్ పలుమార్లు చెబుతూ వస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎనిమిది కీలక వివాదాల్లో జోక్యం చేసుకున్నానని, అందుకే ఈ బహుమతికి తాను అర్హుడినని ఆయన అన్నారు. 

"ఇప్పుడు ఆ సమయం వచ్చింది. గత ఏడాది వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నాకు బహూకరించారు. చరిత్రలో నా కన్నా ఎక్కువ అర్హులు ఎవరూ లేరని ఆమె చెప్పారు. ఇది పరోక్షంగా నాకు లభించిన గౌరవం" అని ట్రంప్ గుర్తుచేశారు.

కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాల అధినేతలు తన పేరును నామినేట్ చేశారని ట్రంప్ చెప్పినప్పటికీ, దానిని ధ్రువీకరించే మార్గం లేదు. మరోవైపు తాను పరిష్కరించానని చెప్పుకుంటున్న కొన్ని వివాదాల్లో ఆయన దౌత్యపరమైన పాత్రను ఆయా దేశాలు అంగీకరించడం లేదు. 

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కంబోడియా-థాయ్‌లాండ్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం ఇందుకు నిదర్శనం. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ట్రంప్ ఆ శాంతిని నెలకొల్పడంలో విఫలమయ్యారు.

అలాగే, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌తో ఏడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు అమెరికాలో గ్యాస్ ధరలు పెరగడానికి ఇది కారణమైంది. కాగా, ఈ ఏడాది బహుమతి రేసులో పోప్ లియో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, పాలస్తీనా భూభాగాల ప్రత్యేక ప్రతినిధి వంటి వారు ముందు వ‌రుస‌లో ఉన్నారు.