పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించడంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గవర్నర్‌ హౌస్‌ మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, పలు నగరాల్లో పోలీసులు కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎమర్జెన్సీతో రాజకీయ ప్రకంపనలు
జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నేతృత్వంలోని ప్రావిన్షియల్‌ ప్రభుత్వాన్ని పక్కనపెడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. దీంతో ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఇస్లామాబాద్‌కు పీటీఐ తలపెట్టిన ర్యాలీకి కూడా భద్రతా చర్యలతో ఆటంకం ఏర్పడింది.

గవర్నర్‌ హౌస్‌లో మంటలు
గవర్నర్‌ హౌస్‌ మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కాల్పులు, షెల్లింగ్‌ జరుపుతున్నట్లు మరో వీడియోలో కనిపిస్తోంది. అయితే గవర్నర్‌ హౌస్‌కు మంటలు ఎలా అంటుకున్నాయి? ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

పీటీఐ నేతల అరెస్టులు
ప్రభుత్వ అణచివేత చర్యల్లో భాగంగా స్వాబీలో పీటీఐ కార్యకర్తలు 59 మందిని, ఖైబర్‌ జిల్లాలో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి సోహైల్‌ అఫ్రిది, పీటీఐ ప్రావిన్షియల్‌ అధ్యక్షుడు జునైద్‌ అక్బర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. మరో మాజీ ముఖ్యమంత్రి అలీ అమీన్‌ ఖాన్‌ గండాపూర్‌ తనను డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌లోని నివాసంలో గృహనిర్బంధం చేశారని వెల్లడించారు.

రోడ్లపై భద్రతా బలగాలు
ప్రావిన్స్‌లోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై భద్రతా బలగాలను మోహరించారు. స్వాబీలో మొబైల్‌ ఫోన్‌, పీటీసీఎల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రావిన్షియల్‌ పాలనపై పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రజాస్వామ్యంపై దాడి: ప్రతిపక్షం
గవర్నర్‌ పాలన విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించాయి. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలతో పాటు ప్రజాక్షేత్రంలోనూ సవాలు చేస్తామని ప్రకటించాయి. ఎన్నికైన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకే కేంద్రం ఈ చర్యలకు దిగిందని పీటీఐ ఆరోపించింది. అరెస్టయిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.