అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్ చేపడుతున్న శత్రుపూరిత కార్యకలాపాలను ఖండిస్తూ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా మొత్తం 29 దేశాలు సోమవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. బ్రిటన్‌లోని 'రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్' వైమానిక స్థావరంపై గత నెలలో జరిగిన ఉగ్రదాడి యత్నం వెనుక ఇరాన్ హస్తం ఉందన్న బ్రిటన్ ఆరోపణలకు ఈ దేశాలు పూర్తి మద్దతు తెలిపాయి.

ఈ కుట్ర వెనుక ఇరాన్‌కు చెందిన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' ప్రమేయం ఉందని బ్రిటన్ నిర్ధారించింది. రహస్య నెట్‌వర్క్‌లు, ప్రాక్సీల ద్వారా విదేశీ గడ్డపై దాడులకు పాల్పడేందుకు ఐఆర్‌జీసీ నిరంతరం ప్రయత్నిస్తోందని ఈ ఘటన నిరూపిస్తోందని సదరు దేశాలు ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్ ప్రేరేపిత కుట్రలు, దాడులు, సైబర్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. తమ దేశ పౌరులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశాయి. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా దేశాలు ప్రతినబూనాయి.

గత సెప్టెంబర్ 27న ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్ వైపు మూడు వాహనాల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఐదుగురు బ్రిటిష్ పౌరులను అరెస్ట్ చేసినట్లు బ్రిటన్ కౌంటర్ టెర్రరిజం పోలీసులు వెల్లడించారు. పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, దర్యాప్తులో నేరం నిరూపితమయ్యే వరకు వారిని దోషులుగా పరిగణించలేమని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఇరాన్ సాయుధ దళాల్లో ఐఆర్‌జీసీ అంతర్భాగం కాగా, అమెరికా దీనిని 2019లోనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.