రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రష్యా సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల అధికారి, పుతిన్ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతతో తన మాతృదేశానికే వెన్నుపోటు పొడిచారు. ఉక్రెయిన్ నిఘా వర్గాలకు రహస్యంగా సైనిక సమాచారం అందించి, సుమారు 300 మందికి పైగా రష్యన్ సైనికుల మరణానికి కారణమయ్యారు. అనంతరం యుద్ధరంగం నుంచి చాకచక్యంగా తప్పించుకుని, ప్రస్తుతం ఉక్రెయిన్ పక్షాన రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది.

వివరాల్లోకి వెళితే, లెఫ్టినెంట్ లెవ్ స్టూప్నికోవ్ రష్యా సైన్యంలో చీఫ్ సిగ్నల్స్ ఆఫీసర్‌గా సేవలందించేవారు. డాన్‌బాస్ ప్రాంతంలోని కీలకమైన వుహ్‌లేదర్‌ను స్వాధీనం చేసుకోవాల్సిన బెటాలియన్‌లో ఆయన పనిచేసేవారు. ఈ హోదాలో ఆయనకు సైనికుల కదలికలు, యుద్ధ వ్యూహాలు, డ్రోన్ల ఫీడ్స్, నిఘా కెమెరాల సమాచారం వంటి కీలక వివరాలన్నీ తెలిసేవి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా వ్యతిరేకించిన స్టూప్నికోవ్, ఆ సమాచారాన్ని రహస్యంగా ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు చేరవేశారు.

ఒకరోజు ఉదయం కడుపునొప్పిగా ఉందని నటిస్తూ తన సహచర సైనికుల నుంచి ఆయన దూరంగా వెళ్లారు. కొద్దిసేపటికే ఆయన పంపిన కోఆర్డినేట్ల ఆధారంగా ఉక్రెయిన్ క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడిలో కల్నల్ గుసెయిన్ ముసయేవ్‌తో సహా 68 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది గాయపడ్డారు. దాడి అనంతరం ఉక్రెయిన్ ప్రతినిధి నుంచి "పేలుళ్లు జరిగాయా? ఫోటో పంపు" అని సందేశం రాగా, "ఇక్కడ కేవలం మాంసం ముద్దలు మాత్రమే మిగిలాయి" అని ఆయన బదులిచ్చారు.

తల్లి సహాయంతో పలాయనం

పుతిన్ పాలనను వ్యతిరేకించే స్టూప్నికోవ్ తల్లి టటియానా యాంట్సెన్, తన కుమారుడు ఉక్రెయిన్‌కు సహకరించేలా మార్గం సుగమం చేశారు. ఆమె ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలున్న దిమిత్రో కార్పెంకో అనే వ్యక్తిని సంప్రదించారు. అతని సహకారంతో స్టూప్నికోవ్ తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. 2024 జూలైలో ఒక రాత్రి వేళ తన యూనిట్ నుంచి తప్పించుకున్న స్టూప్నికోవ్, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ స్థావరాల వైపు పయనించారు. "పీనట్ షాప్" అనే పాస్‌కోడ్ చెప్పి ఉక్రెయిన్ సైనికుల అదుపులోకి వెళ్లారు.

దేశద్రోహం కాదు.. రాజ్యాంగ పరిరక్షణే

ప్రస్తుతం ఆయన రష్యన్ వాలంటీర్ కార్ప్స్ (RVC) అనే విభాగంలో కమ్యూనికేషన్స్ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న రష్యన్లతోనే ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. తాను దేశద్రోహానికి పాల్పడలేదని, పుతిన్ పాలన రష్యా స్వేచ్ఛ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని స్టూప్నికోవ్ పేర్కొన్నాడు. "నేను స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, రాజ్యాంగ బద్ధమైన క్రమాన్ని కాపాడతానని ప్రమాణం చేశాను. కానీ పుతిన్ వాటన్నింటినీ నాశనం చేశారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని తన చర్యను సమర్థించుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో భార్య ఆయనను విడిచిపెట్టగా, ఆయన తల్లి, సోదరి కూడా రష్యాను విడిచి పారిపోవాల్సి వచ్చింది.