పెద్దయ్యాక హఠాత్తుగా చిన్ననాటి వంటకాలు తినాలనిపించడం చాలా మందికి అనుభవమే. దశాబ్దాలుగా రుచి చూడని పాత చిరుతిండి అయినా, అమ్మ చేతి సాంబారు అన్నం, పెరుగు అన్నం అయినా సరే... మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అయితే, ఇది కేవలం శారీరక ఆకలి కాదని, దీని వెనుక బలమైన మానసిక, భావోద్వేగ కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటిపై బెంగ, ఒకప్పటి ఆప్యాయతలే ఈ కోరికలకు మూలమని వారు చెబుతున్నారు.

చిన్నతనంలో మనం తినే ఆహారానికి, అప్పటి అనుభవాలకు, వ్యక్తులకు మెదడు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ వాసన లేదా రుచి చాలా సంవత్సరాల తర్వాత తగిలినా, మెదడులోని ఆ జ్ఞాపకాలు ప్రేరేపితమై ఆ ఆహారంపై కోరికను పుట్టిస్తాయి. ముఖ్యంగా, వాసన, రుచి అనేవి మన జ్ఞాపకాలు, భావోద్వేగాలతో దగ్గరి సంబంధం కలిగి ఉండటంతో... ఆహారం మనలో నాస్టాల్జియాను (పాత జ్ఞాపకాల పట్ల మక్కువ) బలంగా రేకెత్తిస్తుంది.

బాల్యంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై ఆధారపడి ఉంటాం. వారు ప్రేమతో చేసి పెట్టే భోజనం మనకు భద్రత, భరోసా, సాంత్వన వంటి భావనలను కలిగిస్తుంది. పెద్దయ్యాక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు, మనసు ఆ సాంత్వన కోసం మళ్లీ అవే పాత రుచుల వైపు మొగ్గు చూపుతుంది. నాస్టాల్జిక్ ఆహారాలు మనలో సామాజిక బంధం అనే భావనను బలోపేతం చేసి, మూడ్‌ను మెరుగుపరుస్తాయని 'కాగ్నిషన్ అండ్ ఎమోషన్' జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన కూడా వెల్లడించింది.

ఈ ప్రక్రియలో వాసన చాలా శక్తిమంతమైన పాత్ర పోషిస్తుంది. అమ్మ వండే సాంబారు వాసన లేదా పండగలకు చేసే పిండివంటల సువాసన మనల్ని ఆలోచించేలోపే చిన్ననాటి వాతావరణంలోకి తీసుకెళ్తుంది. సొంత ఊరు, కుటుంబానికి దూరంగా ఉంటున్న వారికి కొన్ని ప్రత్యేక వంటకాలు ఆత్మీయత, అనుబంధం లోటును భర్తీ చేస్తాయి.

అప్పుడప్పుడు ఇలా చిన్ననాటి రుచులను ఆస్వాదించడం భావోద్వేగ ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ కోరికలు తరచుగా వస్తున్నా, ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నా లేదా అదుపు చేసుకోలేని విధంగా మారినా నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ కోరికల వెనుక ఉన్న మానసిక మూలాలను అర్థం చేసుకుంటే, వాటికి గుడ్డిగా స్పందించకుండా... మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.