మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ సుప్రీంను ఆశ్రయించిన నిర్భయ దోషి

  • క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ గుప్తా
  • ఉరి అమలును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న దోషులు
  • ఇప్పటివరకు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోని పవన్ గుప్తా
నిర్భయ దోషుల ఉరి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లతో నిర్భయ దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుండడమే అందుకు కారణం. తాజా డెత్ వారెంట్ ప్రకారం నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3న ఉరితీయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో, నిర్భయ దోషుల్లో అందరికంటే చిన్నవాడైన పాతికేళ్ల పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు, ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ పై స్టే విధించాలంటూ అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మరో పిటిషన్ దాఖలు చేశాడు.

కాగా, నిర్భయ దోషుల్లో ముఖేశ్ కుమార్, అక్షయ్ కుమార్, వినయ్ శర్మ ఇప్పటికే పలు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటివరకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోనిది పవన్ గుప్తా ఒక్కడే. అయితే ఉరి సమయం దగ్గరపడుతుండడంతో పవన్ గుప్తా సుప్రీంను ఆశ్రయించాడు. గుప్తా పిటిషన్ కారణంగా మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి అమలు సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.


More Telugu News