బాబ్రీ కూల్చివేత తీర్పు నేపథ్యంలో... స్పెషల్ కోర్టుకు నలుగురు బీజేపీ నేతల డుమ్మా!

  • బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు స్పెషల్ కోర్టు తీర్పు 
  • వృద్ధాప్యం కారణంగా అద్వానీ, జోషిలకు మినహాయింపు
  • కరోనా సోకినందున ఉమా భారతి, కల్యాణ్ సింగ్ గైర్హాజరు
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించనుండగా, కేసులో నిందితులుగా ఉన్న నలుగురు బీజేపీ సీనియర్ నేతలూ కోర్టుకు గైర్హాజరు కానున్నారు. ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర, ఆపై 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, దాని తరువాత జరిగిన మత ఘర్షణలు, దేశవ్యాప్తంగా 3 వేల మంది ప్రాణాలను బలిగొనగా, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మాజీ మంత్రులు ఉమా భారతి, కల్యాణ్ సింగ్ నిందితులుగా ఉన్నారు. వీరంతా నేడు కోర్టుకు హాజరు కావాల్సి వుంది. అయితే, 92 సంవత్సరాల అద్వానీ, 86 ఏళ్ల జోషిలకు, వారి వృద్ధాప్యం దృష్ట్యా, కోర్టుకు రానవసరం లేదని ఇప్పటికే న్యాయమూర్తి తెలిపారు. ఇక ఉమాభారతికి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. మరో సీనియర్ నేత కల్యాణ్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నారు.


More Telugu News