వ్యాక్సిన్ పై రాజకీయాలా?: ఫైజర్ చీఫ్ సంచలన విమర్శలు

  • సురక్షితమని తేలినా అనుమతి లభించడం లేదు
  • పనితీరుపై ఎటువంటి సందేహాలూ లేవు
  • ఐఎఫ్పీఎంఏను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆల్బర్ట్ బౌర్లా
ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్న కరోనా మహమ్మారిని తరిమేసే వ్యాక్సిన్ కోసం ప్రజలంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్న వేళ, వ్యాక్సిన్ పనితీరుపై రాజకీయాలు జరుగుతున్నాయని, వీటి కారణంగానే ప్రజల్లో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయని ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బౌర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత వేగంగా వ్యాక్సిన్ బయటకు రావడం, దాని వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఎటువంటి అనుమానాలూ వద్దని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

బ్రిటన్ లో ఫైజర్ వ్యాక్సిన్ ను సామూహికంగా వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మిగతా అన్ని వ్యాక్సిన్లనూ పరిశీలించినట్టే ఈ వ్యాక్సిన్ ను కూడా పరిశీలించామని ఆయన స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ పరిశోధనలో, ఆపై ట్రయల్స్ లో తాము ఎక్కడా రాజీ పడలేదని ఐఎఫ్పీఎంఏ (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ మాన్యుఫాక్చరర్స్ అండ్ అసోసియేషన్స్) సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తమ వ్యాక్సిన్ అధునాతన సాంకేతికత ఆధారంగా తయారైనదని, తమ ఇతర వ్యాక్సిన్ ల లాగానే ఈ వ్యాక్సిన్ పనితీరుపై సమగ్రంగా పరీక్షించడం జరిగిందని అన్నారు.

వ్యాక్సిన్ ను అత్యున్నత నాణ్యతా ప్రమాణాల మధ్య స్క్రూటినీ చేశామని, అంతే స్థాయి ప్రమాణాలు నమోదు చేశాయని ఆల్బర్ట్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు టీకాల పనితీరు పట్ల సందేహాస్పదంగా ఉంటారనీ, అయితే, వారంతా తప్పుడు నిర్ణయంతో ఉన్నారని మాత్రం చెప్పగలనని ఆయన అన్నారు. కాగా, తమ వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు అనుమతించాలని ఇప్పటికే ఫైజర్, ఇండియా సహా పలు దేశాల్లోని ఔషధ నియంత్రణా సంస్థలను అనుమతి కోరిన సంగతి విదితమే.


More Telugu News