ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ మంత్రుల ధ్వజం

  • ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • నిమ్మగడ్డపై వైసీపీ నేతల గరంగరం
  • చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నాడని ఆరోపణలు
  • ఏకపక్ష నిర్ణయాలంటూ మంత్రుల ఆగ్రహం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైసీపీ మంత్రులు, పార్టీ అగ్రనేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, నిమ్మగడ్డ ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కులానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం వెనుక కుట్రకోణం ఉందని అన్నారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఆపాలన్న దుర్బుద్ధితో చంద్రబాబు వ్యవహరిస్తుంటే, ఆయన దర్శకత్వంలో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఆఖరికి కోర్టు సూచనలను కూడా పెడచెవినపెడుతున్నారని ఆరోపించారు.

స్థానిక ఎన్నికలకు ఇది సరైన సమయం కాదు: ధర్మాన ప్రసాదరావు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరును వైసీపీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు తప్పుబట్టారు. కరోనా పేరుతో గతంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ, ఇప్పుడవే పరిస్థితుల్లో ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులను ఉదాహరిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ నాడు ఎన్నికలు వాయిదా వేశారని ధర్మాన వివరించారు.

నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని, కరోనా సమయంలో ప్రజలు ఎలా ఉండాలో కేంద్రం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన ఎన్నికల సంఘం కేంద్రం ఆదేశాలను ఎలా అతిక్రమిస్తుందని ప్రశ్నించారు. ఓవైపు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టీకా పంపిణీ కోసం సిద్ధమవుతుంటే ఈ సమయంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించడం తమకు అర్థంకావడంలేదని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని కొన్ని దేశాల మళ్లీ లాక్ డౌన్ కు సిద్ధమవుతుంటే ఇక్కడ ఎన్నికలు జరపనుండడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

ప్రజారోగ్యాన్ని ఎన్నికల కమిషనర్ పణంగా పెట్టారు: అవంతి శ్రీనివాస్

వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. బాబు డైరెక్షన్ లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నిర్ణయం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని అవంతి విమర్శించారు.


More Telugu News