కీలక మైలురాయిని చేరుకున్న తెలంగాణ.. ఐదు నెలల్లో కోటి టీకాల పంపిణీ

  • నిన్నటికి రాష్ట్రవ్యాప్తంగా 1,00,53,358 దోషుల పంపిణీ
  • అత్యధికంగా హైదరాబాద్‌లో 22,30,655 మందికి రెండు డోసులు
  • రాష్ట్రంలో ఇంకా 1.90 కోట్ల మంది లబ్ధిదారులు
  • వ్యాక్సినేషన్‌కు మరో నాలుగు నెలలు పట్టే అవకాశం
టీకాల పంపిణీలో తెలంగాణ కీలక మైలురాయికి చేరుకుంది. రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రారంభమైన ఐదు నెలల్లో కోటి టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరి 16న రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రారంభమైంది. ఈ  నెల 25 నాటికి మొత్తంగా 1,00,53,358 టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ మొత్తంలో 86,06,292 మంది తొలి డోసు వేయించుకోగా, 14,47,066 మంది రెండో డోసు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే టీకాల పంపిణీలో హైదరాబాద్ ముందుంది. నగరంలో 22,30,655 మంది రెండు డోసులు వేయించుకున్నారు.

హైదరాబాద్ తర్వాతి స్థానంలో రంగారెడ్డి ఉంది. ఇక్కడ 12,78,287 మంది టీకాలు వేయించుకోగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11,86,140 మందికి టీకాలు వేశారు. వరంగల్ అర్బన్‌లో 4,28,804 మందికి రెండు డోసులూ ఇచ్చారు. ఇతర జిల్లాల్లో ఎక్కడా రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 3 లక్షలు కూడా దాటలేదు.

ఇక అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 50,818 మందికి మాత్రమే టీకాలు వేశారు. రాష్ట్రంలో ఇంకా 1.90 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వీరందరికీ టీకాలు వేసేందుకు మరో నాలుగు నెలలకు పైనే సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.


More Telugu News