ప్రాజెక్టుల వద్ద ఏపీ, తెలంగాణ పోటాపోటీ పోలీస్​ మోహరింపులు

  • పులిచింతల, సాగర్, జూరాల వద్ద సాయుధ బలగాల పహారా
  • సాగర్ లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ తెలంగాణకు ఏపీ విజ్ఞప్తి
  • అధికారులతో చర్చించేందుకు ఏపీ అధికారుల యోచన
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుదుత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వివాదం నెలకొంది. ప్రాజెక్టులు సగమైనా నిండకుండానే సాగర్ లో విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే కరెంట్ ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకుండా జలవిద్యుత్ ను తయారు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై తెలంగాణ అధికారులతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసులతో మోహరింపులు చేశాయి. పులిచింతల ప్రాజెక్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో వంద మంది పోలీసులను మోహరించారు. ఇటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పరిధిలోనూ పోలీసు మోహరింపులు జరిగాయి. సాగర్ ప్రాజెక్టు వద్ద అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ ప్రభుత్వాలు పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, జూరాల ప్రాజెక్టు వద్ద కూడా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.


More Telugu News