భారత క్రికెట్ చరిత్రలో ఘోర పరాభవం చవిచూసినా క్రీడాస్ఫూర్తిని వీడని కోహ్లీ

  • టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి
  • దశాబ్దాల రికార్డుకు నిన్నటితో తెర
  • పాక్ ఆటగాళ్లను హత్తుకున్న కోహ్లీ
  • స్నేహపూర్వకంగా మెలిగిన ఇరుజట్ల ఆటగాళ్లు
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓడిపోవడం అభిమానులకు తీరని వేదన మిగిల్చింది. దేశ చరిత్ర పరంగా చూసినా, రికార్డుల పరంగా చూసినా ఇది టీమిండియాకు అత్యంత చెత్త ఓటమి అని చెప్పాలి. అనేక దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న రికార్డు నిన్నటితో నిన్నటితో తెరమరుగైంది. తాము సాధించిన స్కోరును కాపాడుకోవడంలో టీమిండియా బృందం కనీసం ప్రత్యర్థి జట్టులో ఒక వికెట్ కూడా తీయలేకపోవడం సగటు అభిమానికి ఆశాభంగం కలిగించింది. అభిమానులకే కాదు, టీమిండియా ఆటగాళ్లకు కూడా ఈ ఓటమి మిండుగుపడనిదే.

కానీ, మ్యాచ్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు విజయతీరాలకు చేరిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర భారత ఆటగాళ్లు ప్రదర్శించిన స్ఫూర్తికి హ్యేట్సాఫ్ చెప్పాలి. చిచ్చరపిడుగులా ఆడి భారత్ కు విజయాన్ని దూరం చేసిన పాక్ ఓపెనర్ రిజ్వాన్ ను కోహ్లీ ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్న తీరు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు, పాక్ ఆటగాళ్లతో ఎంతో సానుకూల దృక్పథంతో మాట్లాడి వారి గెలుపును మనస్ఫూర్తిగా అభినందించడం వీడియోల్లో కనిపించింది.

టీమిండియా మెంటార్ ధోనీ కూడా పాక్ ఆటగాళ్లతో కలివిడిగా ముచ్చటిస్తూ స్ఫూర్తిని చాటాడు. అపార అనుభవశాలి అయిన ధోనీ మాట్లాడుతుండగా పాక్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా వినడం వారిలో అతనిపై గౌరవభావాన్ని వెల్లడించింది. ఇతర భారత ఆటగాళ్లు సైతం తమ దాయాది జట్టు సభ్యులతో స్నేహపూర్వకంగా చేయి కలిపి తమ ఓటమిని, ప్రత్యర్థి జట్టు గెలుపును మనస్ఫూర్తిగా అంగీకరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి.


More Telugu News