ఈ-చలాన్ స‌ర్వ‌ర్ డౌన్‌.. పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్‌కు అంత‌రాయం

  • ఒకేసారి భారీ సంఖ్య‌లో వాహ‌న‌దారుల క్యూలు
  • ఫ‌లితంగా సైట్ డౌన్ అయిన‌ట్టు స‌మాచారం
  • ఈ నెలాఖ‌రు వ‌ర‌కు గ‌డువుంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్న పోలీసులు
వాహ‌నాల‌పై ఉన్న ‌చలాన్ల ప‌రిష్కారం నిమిత్తం పోలీసు శాఖ ఇచ్చిన రిబేట్ కు వాహ‌నదారుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క‌సారిగా ల‌క్ష‌లాది మంది పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్‌కు సిద్ధ‌మ‌వ‌డంతో ఈ-‌చలాన్ వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. దీంతో పెండింగ్ ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ప్రస్తుతం ఈ-‌చలాన్ వెబ్ సైట్ డౌన్ అయ్యింద‌ని వినియోగ‌దారులు వాపోతున్నారు.

టూ వీల‌ర్‌ల‌కు 75 శాతం, కార్ల‌కు 50 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 30 శాతం, తోపుడు బండ్ల‌కు 80 శాతం మేర రాయితీ ప్ర‌క‌టించిన పోలీసులు.. పెండింగ్ ‌చలాన్ల‌ను క్లియ‌ర్ చేసుకోవాలంటూ వాహ‌న‌దారుల‌కు మంచి ఆఫ‌ర్ ఇచ్చారు. మార్చి 1(మంగ‌ళ‌వారం) నుంచి మార్చి 31 వ‌ర‌కు ఈ వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌క‌టించారు. అయితే వాహ‌న‌దారులు తొలిరోజైన మంగ‌ళ‌వార‌మే ఒక్క‌సారిగా ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు మొగ్గు చూపారు. 

పోలీసుల అంచ‌నా ప్ర‌కారం రోజుకు ల‌క్ష నుంచి 3 ల‌క్ష‌ల మంది వాహ‌న‌దారులు త‌మ ‌చలాన్ల క్లియ‌రెన్స్ కోసం వ‌స్తార‌ని భావించారు. ఆ మేర‌కు ఆ ఒత్తిడిని త‌ట్టుకుని నిల‌బ‌డేలా స‌ర్వ‌ర్‌ను కూడా అప్ డేట్ చేశారు. అయితే తొలి రోజే 3 ల‌క్ష‌ల‌కు పైగా వాహ‌న‌దారులు ఒకేసారి ఈ-‌చలాన్ వెబ్ సైట్‌ను ఆశ్ర‌యించ‌డంతో సైట్ డౌన్ అయిపోయింది. అయితే ఈ నెలాఖ‌రు వ‌ర‌కు గ‌డువు ఉంద‌ని, వాహ‌నదారులు ఎలాంటి ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పోలీసులు చెబుతున్నారు.


More Telugu News