బుట్ట‌లో త‌ర‌లిన 3 నెల‌ల బాలుడు!.. తెలంగాణ వ‌ర‌ద‌ల్లో బాహుబ‌లి సీన్‌!

  • పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నిలో క‌నిపించిన అరుదైన దృశ్యం
  • తెలంగాణ‌లో వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలు
  • వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న జ‌నాన్ని త‌ర‌లించే ఏర్పాట్లు ముమ్మ‌రం
  • 3 నెల‌ల బాలుడు, అత‌డి కుటుంబాన్ని సుర‌క్షితంగా త‌ర‌లించిన రెస్క్యూ బృందాలు
టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం.. మ‌హిళ చేతిలో పొత్తిళ్ల‌తో చుట్ట‌బ‌డిన బాలుడు అలా నీటిపై ఉన్న దృశ్యంతో మొద‌లవుతుంది.. ఈ సీన్ ప్రేక్షకుల హృద‌యాల‌కు హ‌త్తుకుపోయింది. తాజాగా అలాంటి సీనే తెలంగాణ‌లో కురుస్తున్న ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల నేప‌థ్యంలో పోటెత్తిన వ‌ర‌ద‌ల్లో క‌నిపించింది. బాహుబ‌లి దృశ్యం రీల్ సీన్ అయితే తెలంగాణ ఘ‌ట‌న రియ‌ల్ సీన్‌. 

తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌లితంగా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. వాగులు, వంక‌లు పోటెత్తాయి. వెరసి లోత‌ట్టు ప్రాంతాలు వ‌ర‌ద‌లో మునిగాయి. అందులో భాగంగా రాష్ట్రంలోని పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నిలోని చాలా ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఆ వ‌ర‌ద‌ల్లో ఓ మూడు నెల‌ల బాలుడు, అత‌డి కుటుంబం చిక్కుకుపోయింది. దీనిపై స‌మాచారం అందుకున్న గ‌జ ఈత‌గాళ్లు ఆ బాలుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా 3 నెల‌ల వ‌య‌సున్న ఆ బాలుడిని ఓ బుట్ట‌లో పొత్తిళ్ల‌లో చుట్టి ప‌డుకోబెట్టి... ఆ బుట్ట‌ను రెస్క్యూ టీం స‌భ్యుడు త‌న నెత్తిన పెట్టుకుని గొంతు వ‌ర‌కు ఉన్న నీటిలో చిన్నగా క‌దులుతూ సాగాడు. నెల‌ల త‌ల్లి అయిన ఆ బాలుడి త‌ల్లిని ఆమె భ‌ర్త పొదివి ప‌ట్టుకుని నీటిని దాటించాడు. ఈ క్ర‌మంలో రెస్క్యూ టీంకు చెందిన మ‌రో స‌భ్యుడు బాలుడు ఉన్న బుట్ట‌ను అందుకుని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ మొత్తం దృశ్యాన్ని ఎన్డీటీవీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ ఉమా సుధీర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


More Telugu News