మధ్యప్రదేశ్ జైల్లో సీరియల్ కిల్లర్ ను చూసి హడలిపోతున్న ఇతర ఖైదీలు

  • ఇటీవల మధ్యప్రదేశ్ లో వరుస హత్యలు
  • నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను చంపేపిన ధుర్వే
  • తలలు పగులగొట్టి దారుణ హత్య
  • ప్రస్తుతం సాగర్ జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్
ఇటీవల మధ్యప్రదేశ్ లోని సాగర్ ప్రాంతంలో శివప్రసాద్ ధుర్వే అనే టీనేజి కుర్రాడు వరుస హత్యలతో సంచలనం సృష్టించాడు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని, దారుణ రీతిలో తలలు పగులగొట్టి చంపాడు. ఎలాంటి కారణం లేకుండా ఐదుగురిని కడతేర్చిన ఆ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం అతడు సాగర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. 

ఆ ఉన్మాది జైల్లో ఉన్నాడని సాగర్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటుండగా, జైల్లో ఇతర ఖైదీలు మాత్రం హడలిపోతున్నారు. అతడితో కలిసి ఒకే బ్యారక్ లో నిద్రించాలంటే వణికిపోతున్నారు. తాము నిద్రిపోతున్న సమయంలో అతడు తమను చంపేస్తే అన్న ఆలోచనతో వారు నిద్ర కూడా పోవడంలేదట. ఎన్నో హత్యలు, ఇతర ఘాతుకాలు చేసి జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్థులు కూడా ధుర్వే చరిత్ర విని భయాందోళనలకు లోనయ్యారు. 

దాంతో జైలు అధికారులు శివప్రసాద్ ధుర్వేను ఓ సింగిల్ సెల్ లోకి తరలించారు. ఆ సెల్ కు అనుబంధంగా ఓ టాయిలెట్ ఉంటుంది. ఆ గదిలో ఫ్యాన్ ఉండదు. అతడికి ఆహారం కూడా సెల్ లోకే అందిస్తారు. ఆహారం తిన్న వెంటనే ప్లేట్లు తిరిగి తీసేసుకుంటారు. కాగా, అతడిని సింగిల్ సెల్ లోకి తరలించిన తర్వాతే సాగర్ జైల్లోని ఇతర ఖైదీలు ప్రశాంతంగా ఉన్నారట.


More Telugu News