చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు: మంత్రి కేటీఆర్

  • ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలు 
  • తెలంగాణ ప్రజలు మంచి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని వెల్లడి
  • పనిలేని ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారని విమర్శలు
తెలంగాణలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల నేపథ్యంలో విమర్శనాస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో, తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 

ప్రజలు మంచి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని పేర్కొన్నారు. నీళ్లు-నిధులు-నియామకాల స్ఫూర్తితో పనిచేసిన బీఆర్ఎస్ ప్రజల నమ్మకాన్ని చూరగొందని, గత 9 ఏళ్ల కాలంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని తెలిపారు. 

కానీ, పనిలేని ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఏనాడూ రుజువులు చూపించలేకపోయారని అన్నారు. విపక్షాలలో హేతుబద్ధత లోపించిందని విమర్శించారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసుకుని, చిల్లర ఏరుకోవద్దని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిల్లర రాజకీయాలకు పాల్పడే నేతలను ప్రజలు దూరం పెడతారన్న సంగతి తమకు తెలుసని అన్నారు. 

ఈసారి కూడా ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తమకు 90 నుంచి 100 స్థానాలు లభించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణలో అధికారంలోకి వస్తామని షర్మిల, కేఏ పాల్ వంటివారు కూడా చెబుతున్నారని, అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉంటే అది కాంగ్రెస్ నేతల ఇష్టమని వ్యంగ్యం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో సందడి చేయడం తప్ప తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని కేటీఆర్ కొట్టిపారేశారు. 

దేశంలో తెలంగాణ కంటే మంచి మోడల్ ఎక్కడుందో బీజేపీ, కాంగ్రెస్ నేతలు చూపించాలని... ఆ రెండు జాతీయ పార్టీలు 75 ఏళ్లలో చేయని పనిని తాము తొమ్మిదేళ్లలోనే చేసి చూపిస్తున్నామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు.


More Telugu News