విమానంలో సీట్లోనే ప్రయాణికుడి మలమూత్ర విసర్జన

  • ముంబై-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో జూన్ 24న వెలుగు చూసిన ఘటన
  • ప్రయాణికుడికి సిబ్బంది వార్నింగ్, ఇతరులకు దూరంగా కూర్చోబెట్టిన వైనం
  • విమానం ల్యాండ్ అవగానే నిందితుడి అరెస్ట్
ఎయిర్‌ఇండియా విమానంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడు సీట్లోనే మలమూత్ర విసర్జన చేశాడు. ఫ్లైట్ ఏఐసీ 866 విమానంలో జూన్ 24న ఈ ఘటన జరిగింది. 17ఎఫ్‌ సీటులోని రామ్ సింగ్ అనే ప్రయాణికుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తొమ్మిదో వరుసలోని సీట్లలో మలమూత్ర విసర్జన చేయడమే కాకుండా అక్కడ ఉమ్మి కూడా వేశాడు. అతడి తీరుతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. 

విషయం తెలిసిన వెంటనే విమానం క్రూ(సిబ్బంది) అతడిని హెచ్చరించి, ఇతర ప్రయాణికులకు దూరంగా కూర్చోబెట్టారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిపై అసభ్యకర ప్రవర్తన, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో ఇబ్బందులు సృష్టించిన నేరంపై కేసు నమోదు చేశారు. 

గతేడాది నవంబర్‌ 22న  న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పారిస్-న్యూఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలు కప్పుకున్న దుప్పటిపై మూత్ర విసర్జన చేసి కలకలం రేపాడు.


More Telugu News