వీర్యం తారుమారు.. ప్రైవేటు ఆసుపత్రికి రూ.1.5 కోట్ల జరిమానా!

  • 2009 నాటి కేసులో తాజాగా తీర్పు వెలువరించిన ఎన్‌సీడీఆర్‌సీ
  • మహిళకు భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఇచ్చిన ఆసుపత్రి
  • కవలలకు జన్మనిచ్చిన మహిళ, డీఎన్ఏ పరీక్షలో బిడ్డకు తండ్రి భర్త కాదని వెల్లడి
  • తీవ్ర మనోవేదనకు గురై న్యాయపోరాటం ప్రారంభించిన దంపతులు
  • బాధిత జంటకు రూ.1.5 కోట్లు చెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించిన ఎన్‌సీడీఆర్‌సీ
కృత్రిమ గర్భధారణ చికిత్స కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఇచ్చిన ఆసుపత్రికి భారీ షాక్ తగిలింది. బాధిత దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతానభాగ్యం పొందేందుకు సదరు ఆసుపత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవలలు జన్మించారు. ఆ తరువాత శిశువులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా వారి తండ్రి మరొకరని తేలింది. దీంతో, ఆసుపత్రి వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటం ప్రారంభించారు. తమకు సదరు ఆసుపత్రి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

దీనిపై కొన్నేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరగ్గా తాజాగా వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.


More Telugu News