హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రo స్పందించడం లేదు: కేటీఆర్‌

  • ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం
  • నర్సింగి వద్ద ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ ప్రారంభించిన మంత్రి
  • దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్ కు ఉందని వ్యాఖ్య
హైదరాబాద్‌ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలో మెహిదీపట్నంలో స్కైవాక్‌ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని అడిగామని కేటీఆర్ చెప్పారు. కొత్త లింక్‌ రోడ్లకు సహకరించాలని అడిగామని, జూబ్లీ బస్టాండ్‌ వరకు స్కైవాక్‌ కోసం భూములు కేటాయించాలని కోరామన్నారు. భూమికి బదులు భూమి ఇస్తామన్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేదని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నదాని తెలిపారు.

శనివారం హైదరాబాద్‌ నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్‌ చేంజ్‌ను  మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో ఇంటర్‌ చేంజ్‌ నిర్మించామని, ఓఆర్‌ఆర్‌పై ఇది 20వ ఇంటర్‌ చేంజ్‌ అన్నారు. త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందన్నారు.ఔటర్‌ రింగ్‌ రోడ్డు  హైదరాబాద్‌కు మణిహారంలా ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఆగస్టులో దాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు.


More Telugu News