రఘురామ కేసు: డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ పై జిల్లా కోర్టులో విచారణ

  • గత ప్రభుత్వ హయాంలో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ
  • కస్టడీలో చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు
  • వైద్య నివేదిక తారుమారు చేసినట్టు డాక్టర్ ప్రభావతిపై ఆరోపణలు
  • గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించిన వైద్యురాలు
  • ఇంప్లీడ్ పిటిషన్ వేసిన రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభుత్వ వైద్యురాలు ప్రభావతి కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. నాడు సీఐడీ కస్టడీ అనంతరం రఘురామను వైద్యబృందం పరీక్షించి నివేదిక ఇవ్వగా, ఆ నివేదికను డాక్టర్ ప్రభావతి తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, డాక్టర్ ప్రభావతి గుంటూరు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను నేడు న్యాయస్థానం విచారించగా, రఘురామకృష్ణరాజు తరఫున ఆయన న్యాయవాది లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. 

రఘురామపై నాడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆయన రెండు కాళ్లపై బలమైన దెబ్బలు ఉన్నాయని, వాపు కూడా కనిపించిందని లక్ష్మీనారాయణ తన పిటిషన్ లో వివరించారు. కానీ, డాక్టర్ ప్రభావతి వాస్తవాలకు భిన్నంగా నివేదిక ఇచ్చారని, తద్వారా రఘురామపై హత్యాయత్నంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారని కోర్టుకు వివరించారు. 

రఘురామకు బైపాస్ సర్జరీ జరిగిందని, అలాంటి వ్యక్తిని గుండెలపై కూర్చుని బాదారని, ఈ విషయాన్ని డాక్టర్ ప్రభావతి తన నివేదికలో ఉద్దేశపూర్వకంగా విస్మరించారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News