బాక్సింగ్ డే టెస్టులో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం.. అరంగేట్ర ఆట‌గాడితో కోహ్లీ వాగ్వాదం.. వీడియో వైర‌ల్‌!

  • మెల్‌బోర్న్ వేదిక‌గా ఆసీస్‌, భార‌త్ నాలుగో టెస్టు
  • అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన కొన్‌స్టాస్
  • దూకుడుగా ఆడుతున్న యువ ఆట‌గాడిని ఢీకొట్టిన కోహ్లీ
  • దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం
  • ఆ త‌ర్వాత కూడా అదే దూకుడుతో అర్ధ శ‌త‌కం బాదిన కొన్‌స్టాస్
మెల్‌బోర్న్ వేదికగా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మొద‌ట టాస్ గెలిచిన ఆతిథ్య జ‌ట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ ద్వారా 19 ఏళ్ల‌ యువ ఆట‌గాడు సామ్ కొన్‌స్టాస్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన కొన్‌స్టాస్ భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. ఆరంభం నుంచి భారీ షాట్లు ఆడాడు. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డి టీ20 త‌ర‌హా బ్యాటింగ్ చేశాడు. ప్రధానంగా భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కొన్‌స్టాస్ ఆడిన స్కూప్‌, రివ‌ర్స్‌ షాట్లు అల‌రించాయి. 

అయితే, దూకుడుగా ఆడుతున్న కొన్‌స్టాస్, భార‌త స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ మ‌ధ్య చిన్న‌పాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న అరంగేట్ర ప్లేయ‌ర్‌ను ఓవ‌ర్ ముగిసిన త‌ర్వాత బాల్ తీసుకునే క్ర‌మంలో కోహ్లీ ఢీకొట్టాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీంతో ఇతర ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకున్నారు. 

అయితే, ఈ చర్య ఆస్ట్రేలియన్ ఓపెనర్ మైండ్‌సెట్‌ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఆ త‌ర్వాత కూడా అతను అదే దూకుడుతో బ్యాటింగ్ చేస్తూ తన తొలి అర్ధ సెంచరీని సాధించాడు. కేవ‌లం 52 బంతుల్లోనే కొన్‌స్టాస్ హాఫ్ సెంచ‌రీ బాదాడు. చివ‌రికి 65 బంతుల్లో 60 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. 

ఇక మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ భోజ‌న విరామానికి ఒక వికెట్ న‌ష్టానికి 112 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో ల‌బుషేన్ (38), ఖవాజా (12) ఉన్నారు.  




More Telugu News