సిడ్నీ టెస్టు.. భోజ‌న విరామానికి ఆసీస్ స్కోరు 71/3.. భార‌త్‌కు బ్యాడ్ న్యూస్!

  • సిడ్నీ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ ఐదో టెస్టు
  • ఆస్ట్రేలియా ల‌క్ష్యం 162 ప‌రుగులు
  • ఆ జ‌ట్టు విజ‌యానికి ఇంకా 91 ర‌న్స్ కావాలి
  • వెన్నునొప్పి గాయంతో బెంచ్‌కే ప‌రిమిత‌మైన బుమ్రా
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు తొలి సెష‌న్ ముగిసింది. 162 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆతిథ్య జ‌ట్టు భోజ‌న విరామానికి 3 వికెట్లు కోల్పోయి 71 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా విజ‌యానికి ఇంకా 91 ర‌న్స్ కావాలి. టీమిండియా గెల‌వాలంటే మ‌రో 7 వికెట్లు తీయాలి. 

స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలో దాటిగానే ఆడింది. మొద‌టి మూడు ఓవ‌ర్ల‌లోనే ఆ జ‌ట్టు 35 పరుగులు చేసింది. దాటిగా ఆడే క్రమంలోనే సామ్‌ కొన్‌స్టాస్ (22).. ప్ర‌సిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో 39 ర‌న్స్ వ‌ద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత వెంట‌వెంట‌నే మార్న‌స్ ల‌బుషేన్ (06), స్టీవ్ స్మిత్ (04) ల‌ను కూడా ప్ర‌సిద్ధ్ కృష్ణ పెవిలియ‌న్ పంపించాడు. దీంతో ఆసీస్ 58 ర‌న్స్‌కే కీల‌క‌మైన 3 వికెట్లు పారేసుకుంది. ప్ర‌స్తుతం క్రీజులో ఉస్మాన్ ఖ‌వాజా (19), ట్రావిస్ హెడ్ (05) ఉన్నారు. 

భార‌త్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపిస్తున్న కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా గాయం కార‌ణంగా బౌలింగ్ చేయ‌డం లేదు. అత‌ను బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. దీంతో ప్ర‌స్తుతం టీమిండియా బౌలింగ్ భార‌మంతా సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ, నితీశ్ రెడ్డిపై ఉంది. కాగా, వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న బుమ్రా బ్యాటింగ్ కు దిగిన విష‌యం తెలిసిందే.    


More Telugu News