చనువుతోనే నితిన్ తో ఆ మాట అన్నా... దయచేసి నెగెటివ్ గా చూడొద్దు: దిల్ రాజు

  • అల్లు అర్జున్ కంటే ముందు కెరీర్ మొదలుపెట్టినా ఆ స్థాయికి చేరలేదని నితిన్‌తో అన్నానన్న దిల్ రాజు
  • శ్రేయోభిలాషిగా నితిన్ కు కొన్ని చెప్పానని వెల్లడి
  • నిర్మాతల కష్టాలను గుర్తుపెట్టుకోవాలని రివ్యూ రైటర్లకు విన్నపం
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా రివ్యూలు, నటుడు నితిన్‌ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము నిర్మించిన ‘తమ్ముడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మంచి, చెడు ఏమిటో చెప్పమని నితిన్ అడిగినప్పుడు, తాను ఒక శ్రేయోభిలాషిగా కొన్ని విషయాలు చెప్పినట్లు దిల్ రాజు గుర్తుచేసుకున్నారు. “నువ్వు అల్లు అర్జున్ కంటే ముందే కెరీర్ ప్రారంభించావు, కానీ ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావు అని నితిన్‌తో చెప్పాను. మా ఇద్దరి మధ్య ఉన్న చనువు, సంబంధం కారణంగానే ఆ మాట అన్నాను. దయచేసి దీన్ని నెగిటివ్‌గా చూడవద్దు” అని ఆయన స్పష్టం చేశారు.

ఇక, రివ్యూలు రాసేటప్పుడు హీరో, దర్శకుడితో పాటు ఎక్కువగా నష్టపోయే నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సినిమా ఫలితం తేడా వస్తే హీరో, దర్శకుడి కంటే నిర్మాతకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. “పైరసీ, నెగిటివ్ ప్రచారాలను ఎదుర్కోవాల్సిందే. అయితే, ఎవరైనా రివ్యూలు రాసే సమయంలో నిర్మాత పడే కష్టం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఈ విషయంపై నేను గట్టిగా మాట్లాడితే, దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు” అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.

నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 


More Telugu News