ట్యూబ్ లైట్లు, సీఎఫ్ఎల్, ఎల్ఈడీ లైట్లలో ఏది బెటర్.. దేనికెంత విద్యుత్ ఖర్చు?
కిక్కిరిసిపోయిన అపార్ట్ మెంట్లు, పక్కనే పెద్ద పెద్ద భవనాలు.. ఇంట్లోని అన్ని గదుల్లోకి సరైన వెలుతురు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు వంట గది, డ్రాయింగ్, రీడింగ్ రూం సహా పలు చోట్ల, పలు పనులకు మంచి వెలుగు అవసరం. మరి మంచి వెలుగు కోసం ఎలాంటి బల్బులను వినియోగించాలి? ఏ పని చేయడానికి ఎంత వరకు వెలుగు ఉండాలి.. ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్లు, సీఎఫ్ఎల్, ఎల్ఈడీ లైట్లలో ఏది బెటర్.. దేని ద్వారా ఎంత వెలుతురు వస్తుంది, ఎంత విద్యుత్ ఖర్చవుతుందనే వివరాలు తెలుసుకుందాం..
ఫిలమెంట్ బల్బులు..
అతి తక్కువ ధరకు దొరికే ఈ బల్బులను ఇన్ కాండిసెంట్ బల్బులు అని అంటారు. విద్యుత్ సరఫరా అయినప్పుడు ఈ బల్బుల్లో ఉండే ఫిలమెంట్ విపరీతంగా వేడెక్కి వెలుతురును విడుదల చేస్తుంది. వీటి నుంచి వచ్చే కాంతి దాదాపుగా సూర్యరశ్మిని పోలి ఉంటుంది. కాబట్టి వీటి వెలుగులో చదువుకోవడం సహా అన్ని రకాల పనులూ చేసుకోవచ్చు. కళ్లకు పెద్దగా శ్రమ ఉండదు. వీటితో పర్యావరణ కాలుష్యం కూడా తలెత్తే అవకాశం లేదు. కానీ ఇన్ కాండిసెంట్ బల్బుల విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. విపరీతమైన ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. వీటి జీవితకాలం కూడా చాలా తక్కువ. కేవలం పరిస్థితులను బట్ట ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే ఈ బల్బులు పాడైపోతాయి. ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బల్బు దెబ్బతింటుంది, అందులోని ఫిలమెంటు తెగిపోతుంది. కేవలం రూ.15 నుంచి రూ.20కే లభించడం వల్ల ఈ బల్బులు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వినియోగంలో ఉన్నాయి. వీటిల్లో 100 వాట్లు, 60 వాట్ల బల్బులు ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి. ఒక యూనిట్ విద్యుత్ తో 100 వాట్ల బల్బును 10 గంటల పాటు, 60 వాట్ల బల్బును 16 గంటల పాటు మాత్రమే వినియోగించవచ్చు.
ట్యూబ్ లైట్లతో ఎక్కువ కాంతి
ఇన్ కాండిసెంట్ బల్బుల తర్వాత వచ్చి.. ఇప్పటికీ భారీగా వినియోగంలో ఉన్నవి ట్యూబ్ లైట్లు. వీటిల్లో నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల పొడవుతో రెండు రకాలు ఉన్నాయి. తక్కువ విద్యుత్ తో ఎక్కువ వెలుగు ఇవ్వడం, ఎక్కువ కాలం మన్నిక ఉండడం వీటి ప్రత్యేకత. వీటి జీవిత కాలం మూడు నుంచి నాలుగేళ్లు. ట్యూబ్ లైట్లలో టీ12, టీ8, టీ5 అని మూడు రకాలు ఉన్నాయి. ట్యూబ్ లైట్ సెట్ రెండు భాగాలతో ఉంటుంది. ఒకటి ఫిక్సర్ (ట్యూబ్ లైట్ ను, దానికి ఉన్న పిన్స్ ను అమర్చే పట్టీ, విద్యుత్ సరఫరాను నియంత్రించే బల్లాస్ట్ (చోక్), కేబుళ్లు కలిపి)కాగా.. మరొకటి బల్బు.
టీ12 ట్యూబ్ లైట్లు: మన ఇళ్లలో ఇటీవలి వరకూ వినియోగించిన సాధారణ రకం ట్యూబ్ లైట్లు ఇవి. ఒకటిన్నర అంగుళాల వ్యాసంతో ఉండే వీటి విద్యుత్ వినియోగ సామర్థ్యం 40 వాట్లు. అంటే 24 గంటల పాటు దీనిని వినియోగిస్తే అయ్యే విద్యుత్ వినియోగం ఒక యూనిట్ మాత్రమే. ఈ ట్యూబ్ లైట్ సెట్ లో ఫిక్సర్, బల్బు కలిపి రూ.150 నుంచి రూ.200 వరకు లభిస్తాయి.
టీ8 ట్యూబ్ లైట్లు: ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న సన్నని ట్యూబ్ లైట్లు ఇవి. కేవలం ఒక అంగుళం వ్యాసంతో ఉండే టీ8 ట్యూబ్ లైట్ల విద్యుత్ వినియోగ సామర్థ్యం 36 వాట్లు. దీనిని 24 గంటల పాటు వినియోగిస్తే ఖర్చయ్యే విద్యుత్ 0.8 యూనిట్ మాత్రమే. ఈ ట్యూబ్ లైట్ సెట్ లో ఫిక్సర్, బల్బు కలిపి రూ.180 నుంచి రూ.250 వరకు లభిస్తాయి.
టీ5 ట్యూబ్ లైట్లు: కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్యూబ్ లైట్లు ఇవి. టీ12, టీ8 ట్యూబ్ లైట్లకు ఒకే రకమైన ఫిక్సర్ ఉండగా.. టీ5 ట్యూబ్ లైట్లకు మాత్రం మరింత సన్నని ఫిక్సర్ ఉంటుంది. ఎందుకంటే దీని వ్యాసం కేవలం 0.62 అంగుళాలు మాత్రమే ఉంటుంది. 28 వాట్ల విద్యుత్ వినియోగ సామర్థ్యమున్న ఈ టీ5 ట్యూబ్ లైట్ ను 24 గంటల పాటు వినియోగిస్తే ఖర్చయ్యే విద్యుత్ 0.6 యూనిట్లు మాత్రమే. టీ5 ట్యూబ్ లైట్లు ఫిక్సర్ లతో కలిపి లభిస్తుంటాయి. మంచి కంపెనీలకు చెందిన టీ5 ట్యూబ్ లైట్ ఫిక్సర్ సెట్ ధర మార్కెట్లో రూ.300 నుంచి రూ.450 వరకు ఉంది.
అవసరానికి తగినట్లుగా.. సీఎఫ్ఎల్
ఇన్ కాండిసెంట్ బల్బుల తీవ్ర విద్యుత్ వినియోగం, ట్యూబ్ లైట్లలోనూ ఒక స్థాయికన్నా తక్కువ విద్యుత్ వినియోగించుకునే రకాలు అందుబాటులో లేని సమయంలో.. సీఎఫ్ఎల్ బల్బులు తెరపైకి వచ్చాయి. సీఎఫ్ఎల్ పూర్తి పేరు ‘కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్’. ఇవి కూడా ట్యూబ్ లైట్లు పనిచేసే టెక్నాలజీతోనే పనిచేస్తాయి. సీఎఫ్ఎల్ ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడం, విస్తృత శ్రేణుల్లో అందుబాటులో ఉండడం, అప్పటికే వినియోగంలో ఉన్న ఇన్ కాండిసెంట్ బల్బులు పెట్టగలిగిన విద్యుత్ హోల్డర్లలోనే నేరుగా వినియోగించుకోగలగడంతో వీటికి మంచి ప్రాచుర్యం వచ్చింది. కేవలం ఐదు వాట్ల నుంచి 60 వాట్ల వరకు వివిధ సామర్థ్యంతో సీఎఫ్ఎల్ బల్బులు లభిస్తాయి. అందువల్ల తక్కువ వెలుతురు అవసరమైన చోట తక్కువ సామర్థ్యమున్న సీఎఫ్ఎల్ లను అమర్చవచ్చు. ఇక సీఎఫ్ఎల్ ల నుంచి అతి తక్కువగా ఉష్ణం వెలువడుతుంది.
- సీఎఫ్ఎల్ లు లీనియర్ (ట్యూబ్ లు పొడవుగా ఉండేవి), స్పైరల్ (ట్యూబ్ లు గుండ్రంగా చుట్టుకుని ఉండేవి) అని రెండు ఆకారాల్లో లభిస్తాయి. లీనియర్ సీఎఫ్ఎల్ ల కంటే స్పైరల్ రకానికి చెందినవి ఎక్కువ వెలుగును ఇస్తాయి.
- వార్మ్ వైట్, కూల్ వైట్ వెలుగునిచ్చే రెండు రకాల సీఎఫ్ఎల్ లు లభిస్తాయి. వీటిలో వార్మ్ వైట్ రకానివి ఎక్కువ వెలుగు ఇస్తాయి.
ఎల్ఈడీ బల్బులతో ఎన్నో ఉపయోగాలు
ఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్) లైట్లు పర్యావరణ హితమైనవి. ఇతర రకాల బల్బుల కంటే ఎంతో భద్రమైనవి. అతి తక్కువ విద్యుత్ ను వినియోగించుకుని, ఎక్కువ కాంతిని విడుదల చేస్తాయి. మంచి ఎల్ఈడీ బల్బులు ఏకంగా పదేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. అంతేకాదు చివరి వరకూ పూర్తి స్తాయిలో కాంతిని విడుదల చేస్తాయి. అదే ట్యూబ్ లైట్లు, సీఎఫ్ఎల్ ల నుంచి కాలం గడిచిన కొద్దీ వెలుగు తగ్గుతుంది. ఇక ఎల్ఈడీ ల ద్వారా ఉష్ణం విడుదల కాదు. అందువల్ల గది వేడెక్కే సమస్య ఉండదు.
ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి
- సాధారణ బల్బులు, సీఎఫ్ఎల్ లతో పోలిస్తే ఎల్ఈడీ బల్బుల జీవితకాలం చాలా ఎక్కువ. ఒకసారి కొనుగోలు చేస్తే ఏకంగా 10 నుంచి 25 ఏళ్ల పాటు పనిచేస్తాయి. కొన్ని కంపెనీలు ఎల్ఈడీ బల్బులపై పదేళ్ల రీప్లేస్ మెంట్ వారెంటీ కూడా ఇస్తుండడం గమనార్హం.
- వీటి విద్యుత్ వినియోగం అతి తక్కువ. ఒకే స్థాయి కాంతిని ఇచ్చే సాధారణ బల్బులకు 60 నుంచి 100 వాట్ల విద్యుత్ అవసరంకాగా.. సీఎఫ్ఎల్ లకు 10 నుంచి 25 వాట్లు, ఎల్ఈడీలకు రెండు నుంచి 15 వాట్ల వరకు మాత్రమే విద్యుత్ వినియోగం ఉంటుంది.
- ఎల్ఈడీ బల్బులలో ఎలాంటి ఫిలమెంటు ఉండదు, గాజు అవసరం లేదు. అందువల్ల కిందపడితే పాడయిపోయే అవకాశం తక్కువ.
- సాధారణ బల్బులు విపరీతమైన ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. సీఎఫ్ఎల్ బల్బుల నుంచీ ఓ మోస్తరుగా వేడి విడుదలవుతుంది. ఎల్ఈడీలతో ఈ సమస్య ఉండదు.
- మామూలుగా చూస్తే ఎల్ఈడీ బల్బుల ధరలు చాలా ఎక్కువే. కానీ ఎక్కువకాలం మన్నిక, విద్యుత్ ఆదాతో పోలిస్తే అవి ఎంతో చవక అనే చెప్పవచ్చు.
సమస్యలూ ఉన్నాయి..
- ఎల్ఈడీ బల్బుల ధరలు చాలా ఎక్కువ. మార్కెట్లోనూ ఎల్ఈడీ బల్బుల ధరల్లో ఉండే భారీ తేడా వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తుంది. ఒకే సామర్థ్యమున్న మంచి కంపెనీల ఎల్ఈడీ బల్బులతో పోలిస్తే.. సాధారణ కంపెనీల ఎల్ఈడీల ధరలు ఏకంగా సగమే ఉంటాయి. అయితే పనితీరులో పెద్దగా తేడా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
- ఎల్ఈడీ బల్బుల బీమ్ యాంగిల్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే గదిలో ఒకవైపు మాత్రమే ఎక్కువ వెలుగు ఫోకస్ అవుతుంది. పెద్ద గదుల్లో ఇది ఇబ్బందిగా ఉంటుంది.
ఈ నాలుగూ గమనించండి
ఇంట్లోకిగానీ, ఆఫీసులోకిగానీ, షాపులు, వాణిజ్య సముదాయాల్లోకి గానీ వెలుతురు కోసం లైట్లు కొనుగోలు చేసే ముందు నాలుగు అంశాలను కచ్చితంగా గమనించాలి. బల్బుల వాటేజ్ సామర్థ్యం, వెలువడే కాంతి (ల్యూమెన్ పవర్), వెలుగు పడే కోణం (బీమ్ యాంగిల్), వెలువడే కాంతి రంగు... వీటిని మన అవసరానికి తగినట్లుగా ఎంచుకోవాలి. ఇవేంటో చూద్దాం..
వాట్స్: బల్బులు వినియోగించుకునే విద్యుత్ ను వాట్లలో సూచిస్తారు. ఎంత తక్కువ వాట్ల బల్బు అయితే అంత తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది. ఉదాహరణకు 20 వాట్ల సీఎఫ్ఎల్ కంటే 15 వాట్ల సీఎఫ్ఎల్ కు తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. అయితే బల్బు నుంచి వెలువడే కాంతి తీవ్రతకు వాట్స్ కెపాసిటీకి సంబంధం లేదు. 100 వాట్ల ఇన్ కాండిసెంట్ బల్బు కంటే 40 వాట్ల ట్యూబ్ లైట్ ఎక్కువ వెలుతురు విడుదల చేస్తుందని గుర్తుంచుకోవాలి.
కాంతి తీవ్రత (ల్యూమెన్ పవర్): బల్బుగానీ మరైదేనా కాంతిని ఉత్పత్తి చేసే పరికరం నుంచి వెలువడే కాంతి తీవ్రత (వెలుగు)ను ల్యూమెన్లలో కొలుస్తారు. ఉదాహరణకు 100 వాట్ల ఇన్ కాండిసెంట్ బల్బు 1,600 ల్యూమెన్ల కాంతిని విడుదల చేస్తే... 25 వాట్ల సీఎఫ్ఎల్ బల్బు 1,400 ల్యూమెన్లు, 36 వాట్ల టీ8 ట్యూబ్ లైట్ 2,600 ల్యూమెన్ల కాంతిని విడుదల చేస్తాయి. అన్ని రకాల బల్బులు, లైట్లను పోల్చి చూసినప్పుడు.. సగటున ఒక్కో వాట్ కు ఎక్కువ ల్యూమెన్ల కాంతిని విడుదల చేసే బల్బును ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అయితే ఇందులో బల్బు నుంచి కాంతి ప్రసరించే కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గదిలో కొంత భాగం వైపే కాంతిని ఎక్కువ తీవ్రతతో ప్రసరిస్తే... ఎక్కువ ల్యూమెన్ పవర్ ఉన్నా, దానితో ప్రయోజనం తక్కువ అని గుర్తుంచుకోవాలి.
వెలుగు పడే కోణం (బీమ్ యాంగిల్): బల్బు నుంచి విడుదలయ్యే కాంతి ప్రసరించే కోణాన్ని బీమ్ యాంగిల్ అంటారు. ఉదాహరణకు సాధారణ బల్బు చుట్టూ కాంతిని వెదజల్లుతుంది. అదే సెర్చ్ లైట్లు, లేజర్ లైట్లు కేవలం ఒకవైపు మాత్రమే ఎక్కువ దూరం వరకు కాంతిని ప్రసరిస్తాయి. ఇక్కడ బల్బు బీమ్ యాంగిల్ ఎక్కువ, సెర్చ్ లైట్లు, లేజర్ల బీమ్ యాంగిల్ చాలా తక్కువ. సాధారణంగా ఇన్ కాండిసెంట్ బల్బులు, ట్యూబ్ లైట్లు దాదాపుగా 360 డిగ్రీలు బీమ్ యాంగిల్ తో ఉంటాయి. వాటిని పెట్టిన చోట నుంచి అన్ని వైపులా కాంతిని సమానంగా వెదజల్లుతాయి. ఇక సీఎఫ్ఎల్ బల్బులు కూడా చుట్టూ కాంతిని ప్రసరించినా.. దాని పక్క వైపులా ఎక్కువగా, ఎదురువైపున కొంత తక్కువగా కాంతి పరుచుకుంటుంది. అంతేకాదు బల్బు నుంచి కొంత దూరం వెళ్లగానే కాంతి తీవ్రత తగ్గుతుంది. అదే ఎల్ఈడీ లైట్లకు మాత్రం ప్రత్యేకంగా బీమ్ యాంగిల్ ఉంటుంది. సాధారణంగా 120 డిగ్రీల యాంగిల్ వరకూ ఎల్ఈడీలు లభిస్తుంటాయి. అయితే మన అవసరాన్ని బట్టి ఎక్కువ, తక్కువ బీమ్ యాంగిల్ ఉన్న లైట్లను ఎంచుకోవచ్చు. జ్యువెలరీ, వస్త్రాల దుకాణాలు, కొన్ని రకాల కార్యాలయాలు, క్లబ్బులు వంటి వాటిలో ప్రత్యేకంగా కాంతిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చోట్ల తక్కువ బీమ్ యాంగిల్ ఉన్న లైట్లు బాగా పనిచేస్తాయి. సాధారణ ఇళ్లు, కార్యాలయాలకు ఎక్కువ బీమ్ యాంగిల్ ఉండాలి.
కాంతి రంగు: లైట్ల నుంచి వెలువడే కాంతి రంగు మన పనులు, అవసరాలను బాగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల మన అవసరానికి తగిన కాంతిని విడుదల చేసే లైట్లను ఎంచుకోవడం మంచిది. బల్బులు, లైట్లు విడుదల చేసే కాంతి రంగును కెల్విన్ లలో కొలుస్తారు. సాధారణంగా పగటిపూట ఉండే వెలుతురు 6000K గా ఉంటుంది. అన్ని రకాల పనులు చేసుకోవడానికి ఈ రంగు వెలుగు అనువుగా ఉంటుంది. ఇదే వాణిజ్య సముదాయాల్లోనైతే సహజ తెలుపు రంగు 5000K, లేత తెలుపు 4000K (కూల్ వైట్), లేత పసుపు 3000K (వార్మ్ వైట్) రంగులను కూడా వినియోగిస్తుంటారు. సాధారణ ఇన్ కాండిసెంట్ బల్బులు 3000K కాంతిని.. సీఎఫ్ఎల్, ట్యూబ్ లైట్లు 4000K, 5000K కాంతిని విడుదల చేస్తాయి. ఎల్ఈడీల్లో అన్ని రకాల కాంతిని విడుదల చేసే రకాలు అందుబాటులో ఉన్నాయి.
ఏ రకమైన బల్బు ఎంత విద్యుత్ వినియోగించుకుని, ఎంత కాంతిని ఇస్తుందో చూద్దాం..
ఏయే వాట్ల సామర్థ్యం గల ఇన్ కాండిసెంట్, సీఎఫ్ఎల్, ట్యూబ్ లైట్లు, ఎల్ఈడీ బల్బులతో ఎంత కాంతి వెలువడుతుందో ఈ టేబుల్ ను చూసి తెలుసుకోవచ్చు. అయితే ఇవి స్టాండర్డ్ పరికరాలను, స్థిర పరిస్థితుల్లో తీసుకుని అంచనా వేసినవి. వివిధ బ్రాండ్లు, బల్బులు వినియోగిస్తున్న సమయం, ఉష్ణోగ్రత వంటి అంశాల ఆధారంగా కొద్దిగా మార్పులు ఉంటాయి.
ఇన్ కాండిసెంట్ (వాట్లు) | సీఎఫ్ఎల్ (వాట్లు) | ట్యూబ్ లైట్లు (వాట్లు) | ఎల్ఈడీ (వాట్లు) | వెలువడే కాంతి (ల్యూమెన్లలో) |
15-30 | 5-8 | 3-4 | 150-300 | |
40 | 8-12 | 5-6 | 400-500 | |
60 | 13-18 | 7-8 | 650-900 | |
75-100 | 18-22 | 14 (టీ5- 2ఫీట్స్) | 9-13 | 1100-1750 |
100 | 23-30 | 22 (టీ8- 2ఫీట్స్) | 16-20 | 1800-2000 |
150 | 30-40 | 40 (టీ12 రకం) | 21-25 | 2000-2400 |
200 | 40-55 | 36 (టీ8), 28 (టీ5) | 26-28 | 2400-2800 |
300 | 60-85 | 36 (టీ8 స్పెషల్) | 30-35 | 3000-3250 |
ఏ రకమైన పనికి ఎంత వెలుగు అవసరం..
సాధారణంగా గదిలో టీవీ చూస్తూ కూర్చున్నప్పటికి.. పుస్తకం చదువుతున్నప్పుడు, కంప్యూటర్ పై పనిచేస్తున్నప్పుడు ఎక్కువ వెలుగు అవసరం. మరి ఏ పనికి ఎంత వెలుగు ఉంటే బాగుంటుందనే దానిపై నిపుణులు పరిశోధన చేసి.. ప్రతి చదరపు మీటరు ప్రదేశానికి ఎంత వెలుగు అవసరమనే అంచనాలు రూపొందించారు. అయితే గదిలోకి బయటి నుంచి వచ్చే వెలుగుతోపాటు పగలు, రాత్రి సమయాల ఆధారంగా ఈ అంచనా లెక్కలు మారుతాయి. పగటి పూట కిటికీ తెరిచి ఉంచినప్పుడు తక్కువ సామర్థ్యమున్న బల్బు సరిపోతుంది. అదే రాత్రిపూట బయటి వెలుగు ఉండదు కాబట్టి ఎక్కువ వెలుగిచ్చే బల్బు అవసరం.
ఏయే చోట ఎంత వెలుతురు అవసరం (ఒక్కో చదరపు మీటరుకు చొప్పున)
- చుట్టూ చీకటిగా ఉండే బహిరంగ ప్రదేశాలకు.. 20 నుంచి 50 ల్యూమెన్లు
- వరండాలు, బాత్రూమ్ ల వంటి ప్రదేశాలకు.. 50-100 ల్యూమెన్లు
- కళ్లకు పెద్దగా శ్రమ ఉండని పని ప్రదేశాలకు.. 100-150 ల్యూమెన్లు
- ఇళ్లు, హాల్ లు, చదివే, రాసే పని ఉండని కార్యాలయాలకు.. 150 ల్యూమెన్లు
- సాధారణ ఆఫీసులు, శిక్షణా కేంద్రాలు, తరగతి గదులకు.. 200-250 ల్యూమెన్లు
- చదువుకోవడం, రాయడం, కంప్యూటర్లపై పనిచేయడం, లైబ్రరీలు, రాసే పని ఉండే ఆఫీసులు, వంటగది వంటి ప్రదేశాలకు.. 400-500 ల్యూమెన్లు
1. ఉదాహరణకు 10 x 10 అడుగుల గదిలో (సుమారు పది చదరపు మీటర్లు) సాధారణ ఆఫీసు పని చేస్తున్నారనుకుంటే..
పైన వేసిన అంచనా ప్రకారం ప్రతి చదరపు మీటరుకు 250 ల్యూమెన్ల చొప్పున పది చదరపు మీటర్లకు 2500 ల్యూమెన్ల కాంతి అవసరం. ఈ లెక్కన ఒక ట్యూబ్ లైట్ గానీ, రెండు 20 వాట్ల సీఎఫ్ఎల్ లుగానీ, రెండు 60 వాట్ల ఇన్ కాండిసెంట్ బల్బులుగానీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
2. మరో ఉదాహరణగా 10 x 16 అడుగులు (సుమారు 15 చదరపు మీటర్లు) ఉన్న వరండాలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారంటే..
పైన వేసిన అంచనా ప్రకారం ప్రతి చదరపు మీటరుకు 50 ల్యూమెన్ల చొప్పున 15 చదరపు మీటర్లకు 750 ల్యూమెన్ల వెలుగు సరిపోతుంది. ఈ లెక్కన 40 వాట్ల ఇన్ కాండిసెంట్ బల్బుగానీ, 15 వాట్ల సీఎఫ్ఎల్ గానీ సరిపోతుంది.
3. అదే మూడు చదరపు మీటర్లు ఉండే బాత్రూమ్ లో 150 నుంచి 200 ల్యూమెన్ల కాంతి సరిపోతుంది. అంటే 5 వాట్ల సీఎఫ్ఎల్ ఏర్పాటు చేస్తే చాలు.
ఏ రకమైన బల్బు బెటర్.. లోపాలు, ప్రయోజనాలు
- సీఎఫ్ఎల్ ల నుంచి వచ్చే వెలుగు బల్బు ఉన్న స్థానం నుంచి కొద్ది దూరం వరకే ప్రభావవంతంగా ఉంటుంది. ఆ తర్వాత కొంత వెలుతురు తక్కువగా ఉంటుంది. బల్బుకు అడ్డంగా ఉన్నవైపు వెలుగు ఎక్కువగా ఉంటుంది.
- ఎల్ఈడీ బల్బులతో అయితే ప్రత్యేకంగా కొంత కోణం వరకు మాత్రమే వెలుగు ప్రసరిస్తుంది. ముఖ్యంగా వాటికి ఎదురుగా ఉన్నవైపు వెలుతురు కేంద్రీకృతం అవుతుంది. ఎక్కువ కోణంలో వెలుగునిచ్చేవి ఉన్నా.. పూర్తిగా గది నిండా వెలుగు ప్రసరించదు.
- ట్యూబ్ లైట్ తో అయితే వెలుగు గదిలో అన్ని భాగాల్లో సమంగా ప్రసరిస్తుంది. అన్ని వైపులా సమంగా వెలుగు ఉంటుంది. ట్యూబ్ లైట్ నాలుగు అడుగుల పొడవు ఉండడం, దాని పొడవునా కాంతి ఉత్పత్తి కావడమే దీనికి కారణం. ఈ వెలుతురు చదువుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. పెద్ద గదులు, డ్రాయింగ్ రూమ్, రీడింగ్ రూమ్ లకు ట్యూబ్ లైట్ వినియోగించడం మంచిది.
- గదులు పెద్దగా ఉన్న చోట రెండు మూడు సీఎఫ్ఎల్ లు వినియోగించినా పెద్దగా ఫలితం ఉండదు. దానికన్నా టీ5 ట్యూబ్ లైట్ వినియోగిస్తే మంచి వెలుగుతోపాటు విద్యుత్ ఆదా అవుతుంది.
- పూజగదులు, బాత్ రూమ్ లు, చిన్న కిచెన్ లు, బాల్కనీ, ఇంటి పక్కన ఉండే వరండాలు వంటి చోట్ల సీఎఫ్ఎల్ బల్బులు వినియోగించడం మంచిది. ఎందుకంటే ట్యూబ్ లైట్లలో అత్యంత సమర్థవంతమైనది కూడా 28 వాట్ల సామర్థ్యంతో ఉంటుంది. అదే చోట కేవలం 5 లేదా 10 వాట్ల సీఎఫ్ఎల్ బల్బు సరిపోతుంది. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది.
- ఎల్ఈడీ బల్బులు కొనేటప్పుడు ఐపీ (IP) రేటింగ్ చూడాలి. ఎక్కువ ఐపీ రేటింగ్ ఉన్న బల్బులు దుమ్ము, నీటిని తట్టుకుని ఎక్కువ కాలం మన్నుతాయి. ఐపీ రేటింగ్ లో IP అనే అక్షరాల తర్వాత రెండు అంకెలు ఉంటాయి. మొదటి అంకె దుమ్ము, ధూళి వంటి వాటి నుంచి రక్షణను, రెండో అంకె నీరు వంటి ద్రవ పదార్థాల నుంచి రక్షణను సూచిస్తాయి. ఉదాహరణకు IP55 రేటింగ్ ఉన్న ఎల్ఈడీ కంటే IP67 రేటింగ్ ఉన్న బల్బు మంచిది.