వైఫై స్లోగా ఉందా... స్పీడ్ పెంచుకోండిలా

కార్యాలయాల్లోనే కాదు, బహిరంగ ప్రదేశాల్లో... చివరికి ఇంట్లోనూ వైఫై వాడుక పెరిగిపోతోంది. గతంలో వైర్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా పీసీకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ వాడుకునేవారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో వైఫై రూటర్లతో ఒకే ఇంట్లో కంప్యూటర్ తో పాటు పలు స్మార్ట్ ఫోన్లలో వైర్ లెస్ విధానంలో నెట్ వాడకం పెరిగిపోయింది. అయితే, వైఫై కొన్ని సమయాల్లో స్లో అవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఎందుకిలా...? దీనికి పరిష్కారం ఏమిటి...?

ఇంట్లో ఎక్కడున్నా గానీ వైఫై ఆన్ చేసుకుని నెట్ వాడుకోవడంలో ఉన్న సౌకర్యమే వేరు కదా. కానీ, వైఫై స్లోగా ఉంటోందన్న సమస్య తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు ఎన్నోకారణాలు ఉండవచ్చు. వాటిని గుర్తించి సరిచేసుకుంటే స్లో సమస్యను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రూటర్ ఎక్కడున్నది..?

వైఫై రూటర్ ఇంట్లో ఎక్కడ పెట్టారన్నది కీలకమైన అంశమే. స్లో సమస్య వేధిస్తుంటే స్థలాన్ని మార్చి చూడండి. సాధారణంగా వైఫ్ రూటర్ ను విద్యుత్ సాకెట్ కు అనుసంధానించి అక్కడే ఓ షెల్ఫ్ లో పెట్టడం, టీవీ వెనుక పడేయడం చాలా మంది చేస్తుంటారు. లేదా కాంక్రీటు నేలపై ఉంచడమో చేస్తారు. దీనివల్ల సిగ్నల్స్ కొంత మేర వృధాగా పోతాయని నిపుణులు అంటున్నారు.

కాంక్రీటు, మెటల్ వస్తువులు వైఫై తరంగాలను అడ్డుకుంటాయట. అందుకని వైఫై రూటర్ ను గోడల పక్కన, మెటల్ వస్తువుల పక్కన ఉంచకూడదు. ఉదాహరణకు వైఫై రూటర్ ను కాంక్రీటు షెల్ఫ్ లో ఉంచారనుకోండి. పైన ఉన్న మరో కాంక్రీటు షెల్ఫ్ వైఫై తరంగాల వ్యాప్తికి అడ్డుగోడగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వైఫ్ రూటర్ కు అడ్డులేకుండా చూసుకోవాలి. కిటికీల పక్కన కూడా ఉంచకూడదు. వైఫై రూటర్ కు పక్కనగానీ, పైన గానీ కర్టెన్ లాంటివి కూడా అడ్డుగా ఉండకూడదు.

representation image

వైఫై రూటర్ సిగ్నల్స్ 360 డిగ్రీల కోణంలో ప్రసారం అవుతుంటాయి. అందుకే ఇంటి మధ్య భాగంలో ఎత్తయిన ప్రదేశంలో రూటర్ ను ఏర్పాటు చేసుకోవాలని నిపుణుల సలహా. దీనివల్ల స్పీడ్ పెరగడంతోపాటు కవరేజీ ఏరియా కూడా పెరుగుతుంది. రూటర్ యాంటెనా నుంచి సిగ్నల్స్ కొంచెం కిందకు ప్రసరించేలా ఉంటాయట. అందుకే ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఇల్లు చాలా పెద్దగా ఉందనుకోండి. ఇంటి మొత్తానికీ వైఫై రూటర్ సిగ్నల్ అందకపోతే అప్పుడు వైఫై తరంగాల విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వైఫై ఎక్స్ టెండర్స్ లేదా రిపీటర్స్ ఉపయోగపడతాయి. రూటర్ కు వీటిని అనుసంధానించడం ద్వారా తరంగాల వ్యాప్తి, విస్తరణ పెరుగుతుంది. లేదంటే వైఫై ఎక్కువగా వాడే గదిలో ఏర్పాటు చేసుకోవడం వల్ల స్లో అన్న సమస్య ఉండదు.  

యాంటెనా ఏ డైరెక్షన్ లో ఉంది..?

వైఫై రూటర్ కు రెండు యాంటెనాలు ఉంటాయి. ఒకదాన్ని నిలువునా (వెర్టికల్), ఒకదాన్ని హారిజాంటల్ (అడ్డంగా)గా ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిలువుగా ఉండే యాంటెన్నాలు తరంగాలను అడ్డంగా ప్రసారం చేస్తాయి. చాలా వరకు ల్యాప్ టాప్ ల్లో అంతర్గతంగా సిగ్నల్స్ అందుకునేందుకు అడ్డంగా ఉండే యాంటెన్నాలు ఉంటాయి. కనుక వెర్టికల్ యాంటెన్నా నుంచి వచ్చిన తరంగాలు ల్యాప్ టాప్ లను సులువుగా చేరతాయి. కానీ ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ లో (కూర్చున్నప్పుడు, పడకమంచంపై ఉన్నప్పుడు) పట్టుకుని ఉంటారు. కనుక వైఫై రూటర్ యాంటెన్నాలలో ఒకదాన్ని వెర్టికల్ గా, ఒకదాన్ని హారిజాంటల్ గా ఉంచుకుంటే సరి. కొత్తతరం వైఫై రూటర్లలో యాంటెన్నాలు అంతర్గతంగా ఉంటున్నాయి. వీటిలో ఎక్స్ టర్నల్ యాంటెన్నాలను సపోర్ట్ చేసేవి కూడా ఉన్నాయి. ఇలాంటి రూటర్ ఉన్నట్టయితే పొడవైన యాంటెన్నాను తెప్పించుకుని అనుసంధానించుకోవడం వల్ల వైఫై వేగం పెరుగుతుంది.

representation image

ఓవెన్లతో వైఫ్ కి ఆటంకాలు

వైఫై నెట్ వర్క్ కు మైక్రోవేవ్ ఓవెన్లతో సమస్యేనట. ముఖ్యంగా పాతతరం రూటర్లు వాడే వారికి ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే ఓవెన్ తరంగాల వ్యాప్తి 2.45 గిగాహెడ్జ్ లో ఉంటుంది. వైఫై తరంగాలు కూడా 2.41 నుంచి 2.47 గిగాహెడ్జ్ లో వ్యాప్తి చెందుతుంటాయి. దీంతో ఈ రెండింటికీ క్లాష్ అయ్యే అవకాశాలు ఉంటాయట. సాధారణంగా మేక్రోవేవ్ ఓవెన్ల తరంగాలు బయటకు రాకుండా వాటికి తగిన రక్షణ కవచం ఉంటుంది. ఈ కవచంలో లోపం ఉంటే తరంగాలు బయటకు వ్యాప్తి చెందుతాయి.

బ్లూటూత్ వల్ల సమస్య

బ్లూటూత్ కూడా వైఫై తరంగాలకు విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే బ్లూటూత్ కూడా 2.4 గిగాహెడ్జ్ స్థాయిలోనే పనిచేస్తుంది. దీంతో తరంగాల వ్యాప్తి సమయంలో క్లాష్ అవకుండా ఉండేందుకు బ్లూటూత్ పరికరాలను వైపై రూటర్ కు దూరంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వైఫై స్పీడు తగ్గిన సమయంలో ఒకవేళ బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే దాన్ని ఆఫ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆధునిక బ్లూటూత్ పరికరాల్లో ఇలా క్లాష్ అవకుండా ఏర్పాట్లు ఉంటున్నప్పటికీ ఆచరణలోకి వచ్చేసరికి కొన్ని సార్లు క్లాష్ అవడం అనే సమస్య ఎదురవుతోందట.

క్రిస్ మస్ లైట్ల దండ వెలుగుతోందా...?

ఇంట్లో పండుగ సమయాల్లో అలంకరణగా ఏర్పాటు చేసే ఎల్ ఈడీ లైట్ల దండ వల్ల కూడా సమస్య ఎదురవుతుందట. ఈ లైట్లు ప్రకాశిస్తున్న సమయంలో విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడి వైఫై బ్యాండ్ కు ఆటంకాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఈడీ బల్బులు (వాటిలో వాడే చిప్ లు) వల్ల కూడా ఇదే విధమైన సమస్య ఎదురు కావచ్చంటున్నారు.

representation image

అపార్ట్ మెంట్లలో సమస్య

పట్టణాలు, నగరాల్లో సాధారణంగా వైఫై వాడకం ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్లల్లో అందరూ వైఫై వాడుతుంటే వాటి తరంగాలు ఒకదానికొకటి అడ్డుపడే పరిస్థితి  ఏర్పడుతుంది. 2.4 గిగాహెడ్జ్ స్థాయిలో ఎక్కువగా వైఫై రూటర్ తరంగాల వ్యాప్తి ఉంటుంది. కొత్త రూటర్ల కంటే పాత రూటర్లతోనే ఈ సమస్య ఎదురవుతుంటుంది. అందుకే రూటర్ సెట్టింగ్స్ లో ఫ్రీక్వెన్సీ చానల్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత తరం రూటర్ల ఫ్రీక్వెన్సీ చానల్ 1 నుంచి 14 మధ్య ఉంటుంది. వీటిలో 1, 6, 11 చానళ్లు ఇతరవాటితో పోలిస్తే తక్కువ ట్రాఫిక్ తో ఉంటాయి. రూటర్ ఏ చానల్లో ఉందో పరీక్షించి దానికనుగుణంగా తక్కువ ట్రాఫిక్ ఉన్న చానల్ ను రూటర్ లో సెట్ చేసుకోవడం వల్ల  ఫలితం ఉంటుంది. దీనికితోడు రూటర్ల సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైఫైలోకి ఇతరులు చొరబడకుండా చూసుకోవాలి

దీనికి తోడు వైఫై రూటర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ తమ నెట్ వర్క్ లో అనుమానిత, ఇతర పరికరాలు ఏవైనా ప్రశేశించాయేమో చూసుకోవాలి. వైఫై నెట్ వర్క్ లోకి కొందరు తెలివిగా చొరబడి డేటా వాడుకుంటుంటారు. అందుకే తరచూ పాస్ వర్డ్ మార్చుకుంటూ ఉండాలి.

పీసీ లో డౌన్ లోడింగ్

కంప్యూటర్లో పెద్ద ఫైల్స్ డౌన్ లోడ్ అవుతున్న సమయంలోనూ వైఫై స్లోగా ఉంటుంది. అలాగే వైఫై నెట్ వర్క్ లో ఉన్న ఇతర పరికరాల్లో ఎందులోనయినా ఫైల్స్ డౌన్ లోడింగ్ చేస్తుంటే మిగిలిన పరికరాల్లో నెట్ వర్క్ స్లో అవుతుంది.

సమస్య నెట్ వర్క్ ప్రొవైడర్ దగ్గర ఉందా... లేక రూటర్ లోనా...?

ఒకవేళ నెట్ వర్క్ ప్రొవైడర్ వైపు నుంచి నెట్ స్పీడ్ విషయంలో సమస్య ఉందేమోనన్న సందేహం వచ్చిందనుకోండి. అప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తే సరి. ఇథర్ నెట్ (ఇంటర్నెట్ ను అందుకునే కేబుల్) కేబుల్ ను నేరుగా వైఫ్ రూటర్ కు, కంప్యూటర్ సీపీయూకు అనుసంధానించి చూడాలి. అప్పుడు కంప్యూటర్, వైఫై విధానంలో ఇంటర్నెట్ వేగం ఒకే విధంగా ఉంటే నెట్ వర్క్ ప్రొవైడర్ నుంచే సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య నివారణకు ప్లాన్ అప్ గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వైఫై రూటర్ ద్వారా నెట్ స్లోగా ఉంటే రూటర్ లోనే సమస్య ఉందని అర్థం చేసుకుని దాన్ని సరిచేసుకోవాలి.

అడాప్టర్లు తాజా వర్షనేనా...?

కంప్యూటర్, ల్యాప్ టాప్ లలో నెట్ వర్క్ అడాప్టర్లను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు నెట్ వర్క్ సెట్టింగ్స్ లోకి వెళితే అడాప్టర్ పేరు కనిపిస్తుంది. విండోస్ ఓఎస్ ఉన్న కంప్యూటర్లలో ఇది కంట్రోల్ ప్యానల్ లో కనిపిస్తుంది. అడాప్టర్ పేరు చూసిన తర్వాత తయారీదారు వెబ్ సైట్ లోకి వెళ్లి ఆ అడాప్టర్ లేటెస్ట్ వర్షనేనా కాదా అన్నది పరిశీలించాలి. లేటెస్ట్ కాకపోతే అక్కడున్న దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.  

రీబూటింగ్

వైఫై రూటర్ ను ప్రతిరోజూ రీబూట్ చేసుకోవాలని నిపుణుల సలహా. అంతేకాదు వైఫై అవసరం లేని నమయాల్లో మరీ ముఖ్యంగా రాత్రి నిద్రించడానికి ముందు వైఫై ను ఆఫ్ చేసుకోవాలి. దీనివల్ల వైఫై ఫాస్ట్ గా ఉండడమే కాదు రూటర్ మన్నికగా పనిచేస్తుంది. ఇక కొత్తగా రూటర్ ను తీసుకోవాలని అనుకుంటే డ్యుయల్ బ్యాండ్ ఉన్న రూటర్ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.


More Articles