శాలరీ పే స్లిప్ లో ఏముంటాయి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటి?
ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతీ నెలా పే స్లిప్ ఇవ్వడం చూస్తుంటాం. అందులో వేతనం, భత్యాలు, మినహాయింపులు, కోతలు... ఇలా ఎన్నో వివరాలు ఉంటాయి. అందులో ఉండే అన్ని కాలమ్ ల గురించి అందరికీ సరైన అవగాహన ఉండక పోవచ్చు. పే స్లిప్ వల్ల ఉపయోగాలేంటో కూడా తెలియకపోవచ్చు. వాటి గురించి ఒక్కసారి చూద్దాం.
ప్రతీ నెలా నిర్ణీత తేదీన ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వేతనాన్ని జమ చేసిన తర్వాత కంపెనీ ఫైనాన్స్ లేదా హెచ్ ఆర్ (మానవ వనరులు) విభాగం ఉద్యోగులకు పే స్లిప్ జారీ చేస్తుంది.
గ్రాస్ పే... బేసిక్ పే
ఎటువంటి మినహాయింపులు తీసేయకుండా ఉద్యోగికి లభించే మొత్తం వేతనమే గ్రాస్ పే. ఇందులో బేసిక్ శాలరీ (మూలవేతనం) అనేది గ్రాస్ శాలరీలో 35 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. అన్ని రకాల భత్యాలు ఈ మూల వేతనాన్ని బట్టే నిర్ణయిస్తారు. తోటి ఉద్యోగికి ఎక్కువ హైక్ అయింది, నాకెందుకు తక్కువ హైక్ వచ్చిందన్న సందేహం కలిగితే బేసిక్ శాలరీలో తేడా ఉందేమో పరిశీలించుకోవాలి. మూలవేతనం 100 శాతం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది.
హౌస్ రెంట్ అలవెన్స్ (ఇంటి అద్దె భత్యం)
ఉద్యోగి నివాస వ్యయాన్ని భరించేందుకు వీలుగా ఇచ్చే భత్యం (హెచ్ ఆర్ఏ). ఇది మూల వేతనంలో 40 నుంచి 50 శాతంగా ఉంటుంది. అందులోనూ మెట్రో, సాధారణ సిటీకి మధ్య తేడా ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ కు ఆదాయపన్ను పరంగా మినహాయింపులు ఉన్నాయి. ఇది ఎలా అంటే... వార్షిక మూల వేతనంలో 40 శాతం మేర (మెట్రోల్లో అయితే 50శాతం) హెచ్ ఆర్ఏగా చూపించి పన్ను మినహాయింపు పొందవచ్చు. లేదా వాస్తవంగా చెల్లిస్తున్న అద్దెలో 10 శాతం బేసిక్ శాలరీని మినహాయించగా వచ్చే మొత్తం మీద పన్ను మినహాయింపు పొందవచ్చు. లేదా పేస్లిప్ లో ఉన్న హెచ్ఆర్ఏ మొత్తం... వీటిలో ఏది తక్కువ అయితే దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా వార్షికంగానే లెక్కించాలి.
హెచ్ఆర్ఏపై పన్నుమినహాయింపుల్లో సందేహాలు
సొంత ఇళ్లల్లో ఉంటే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు ఉండదు. అలాగే, సొంత ఇల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి కార్యాలయం దగ్గరలో అద్దె ఇంట్లో నివాసముంటే హెచ్ఆర్ఏపై పన్నుమినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో సొంత ఇల్లుపై గృహరుణం రూపంలో వడ్డీ చెల్లిస్తుంటే దానిపైనా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఏడాదికి లక్ష రూపాయలు దాటి అద్దె చెల్లిస్తున్నట్టయితే ఇంటి యజమాని పాన్ నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, అద్దె నెలకు మూడు వేల రూపాయలకు మించి చెల్లిస్తుంటే దానికి సంబంధించి యజమాని నుంచి రసీదు తీసుకుని కంపెనీలోని ఐటీ విభాగానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే టీడీఎస్ మినహాయించరు.
కన్వేయన్స్ అలవెన్స్
ఇంటి నుంచి కార్యాలయం వరకు వెళ్లి రావడానికి వీలుగా అయ్యే వ్యయాన్ని సర్దుబాటు చేసేందుకు ఇచ్చే భత్యం ఇది. నెలకు రూ.1600 లేదా పే స్లిప్ లో ఉన్న కన్వేయన్స్ అలవెన్స్ మొత్తాల్లో ఏది తక్కువైతే దానిపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
ఎల్ టీసీ
కుటుంబ సభ్యులతో కలసి సెలవుపై పర్యటనకు వెళ్లేందుకు వీలుగా ఇచ్చే భత్యం. ప్రయాణ చార్జీలకే ఈ భత్యం వర్తిస్తుంది. అలాగే పన్ను మినహాయింపు కూడా ప్రయాణ చార్జీలపైనే పొందడానికి అవకాశం ఉంటుంది. నాలుగు సంవత్సరాల కాలంలో రెండు సార్లు పర్యటన మీదే మినహాయింపులు లభిస్తాయి.
మెడికల్ అలవెన్స్
వైద్య ఖర్చులను భరించేందుకు వీలుగా ఇచ్చే భత్యం. ఏడాదికి రూ.15వేల వరకు మినహాయింపు లభిస్తుంది.
పెర్ఫామెన్స్ బోనస్ అండ్ స్పెషల్ అలవెన్స్
ఉద్యోగి పనితీరుకు ప్రోత్సాహకంగా అందించే అలవెన్స్. నూరు శాతం దీనిపై పన్ను పడుతుంది.
కోతలు.... ప్రావిడెంట్ ఫండ్
భవిష్య నిధి రూపంలో ఉద్యోగి మూల వేతనంపై 12 శాతాన్ని మినహాయించి ప్రజా భవిష్యనిధి సంస్థకు బదలాయిస్తారు. యాజమాన్యం కూడా ఇంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. 15వేలు దాటి మూల వేతనం ఉన్న వారికి కూడా 15వేల రూపాయలపైనే 12 శాతాన్ని ఈపీఎఫ్ కోసం మినహాయిస్తారు. పన్ను మినహాయింపు పూర్తిగా లభిస్తుంది.
వృత్తి పన్ను
తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లోనే వృత్తి పన్ను అమల్లో ఉంది. పన్ను వర్తించే ఆదాయం ఆధారంగా ఈ పన్ను వసూలు చేస్తారు.
టీడీఎస్
వార్షిక వేతనంలో మినహాయింపులు పోగా ఇంకా పన్ను వర్తించే ఆదాయంలో ఉంటే ఆదాయపన్ను శ్లాబు ప్రకారం టీడీఎస్ కోసేసి ఐటీ శాఖకు జమ చేస్తారు. టీడీఎస్ నుంచి బయటపడాలంటే ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా పే స్లిప్ లో కంపెనీ పేరు, చిరునామా, ఉద్యోగి పేరు, కోడ్ నంబర్, పనిచేసే విభాగం, హోదా, ఈపీఎఫ్ నంబర్, మొబైల్ ఇతర అలవెన్స్ లు, ఈఎస్ఐ (ఉద్యోగి వేతనం 15వేలలోపు ఉంటే) తదితర వివరాలు కూడా ఉంటాయి.
పే స్లిప్ తో అవసరం ఏంటి...?
కొంత మంది పే స్లిప్ ఎందుకులే అని తీసుకోరు. కానీ పే స్లిప్ తో భవిష్యత్తులో అవసరం ఉంటుంది. కంపెనీ మారి వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరాలంటే అక్కడి సంస్థ పే స్లిప్ కోరవచ్చు. వేరే కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో వేతనం కోరుకుంటే ప్రస్తుతం అందుకుంటున్న వేతనానికి ఆధారంగా పే స్లిప్ అడిగే అవకాశాలున్నాయి. కొన్ని కంపెనీలకు వేతన ఖాతా స్టేట్ మెంట్ చూపించినా సరిపోతుంది. అయితే, వేతనం సహా వివిధ రకాల ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే అందుకు పే స్లిప్ ఒక్కటే అవకాశం.
ఒకవేళ ప్రస్తుతం చేస్తున్న కంపెనీ ప్లే స్లిప్ ఇవ్వకపోతే దాన్ని అడిగి తీసుకునే చట్టపరమైన హక్కు ఉంది. అందుకే వేతన ధ్రువీకరణ (శాలరీ సర్టిఫికెట్) పత్రం అడిగి తీసుకోండి. ఇంక్రిమెంట్ కలిసినప్పుడల్లా దీన్ని అడిగి తీసుకుని జాగ్రత్త పరచండి. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఎక్కువ మొత్తానికి బీమా పాలసీ తీసుకునే సమయంలోనూ పే స్లిప్ అడుగుతాయి. అలాగే రుణం కోసం, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా పే స్లిప్ అవసరం ఏర్పడుతుంది.