ఏటీఎం కేంద్రాల్లో మోసాలు జరిగే తీరు... ఖాతాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ఏటీఏం కార్డు లేని వారు నేడు చాలా అరుదు. వాడకం విస్తృతంగా పెరిగిపోవడంతో మోసగాళ్లు ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో అజాగ్రత్తగా ఉంటే బ్యాంకు ఖాతాలో నగదు చోరుల చేతిలో పడినట్టే. కనుక తస్మాత్ జాగ్రత్త.
ఏటీఎం కేంద్రంలోకి అడుగుపెడుతున్న దగ్గర నుంచి తిరిగి బయటకు వచ్చే వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఏ రూపంలో నయినా మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా జరుగుతుందా..? అనే రీతిలో మోసానికి గురి కావచ్చు. అందుకే ఏటీఎం మోసాలపై అవగాహన పెంచుకుని అప్రమత్తతతో వ్యవహరించాలి.
ఇలా జరుగుతాయి...
ఏటీఎం మెషిన్ లో కార్డును ఇన్ సర్ట్ చేసే స్థలానికి కొంచెం పైన మోసగాళ్లు రహస్య కెమెరా అమర్చుతారు. కార్డులోని మేగ్నటిక్ స్ట్రిప్ ను రీడ్ చేసే పరికరాన్ని కూడా అక్కడ ఉంచుతారు. కార్డును ఇన్ సర్ట్ చేసి, పిన్ ఎంటర్ చేయడాన్ని ఈ కెమెరా రహస్యంగా చిత్రీకరిస్తుంది. కార్డు వివరాలు నేరగాళ్ల చేతికి చేరిపోతాయి. ఈ వివరాలతో వారు డూప్లికేట్ కార్డును ఇన్ సర్ట్ చేసి నగదును విత్ డ్రా చేసుకుంటారు.
మరో తీరులో కేటుగాళ్లు ఏటీఎం కేంద్రం వద్ద మాటు వేస్తారు. కార్డు స్లాట్ వద్ద గుర్తించలేని విధంగా ఇమిడిపోయే పరికరాన్ని అమరుస్తారు. ఒక్కసారి కార్డును ఇన్ సర్ట్ చేసి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత... కార్డు బయటకు రాకుండా అది అడ్డుకుంటుంది. ఒకటి రెండు నిమిషాలు ప్రయత్నించి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడే ఉంచిన పరికరాన్ని తొలగించి లోపలున్న కార్డును పొందడం ద్వారా నగదును కొల్లగొడతారు. సాధారణంగా ఇలాంటి మోసాలు బ్యాంకులు పనిచేయని వేళ్లలో జరుగుతాయి. ఎందుకంటే ఫిర్యాదు ఇవ్వడానికి వెంటనే బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉండరు. దాంతో నేరగాళ్లు తమ పని సులభంగా పూర్తి చేసుకుని వెళతారు.
అలాగే, ఏటీఎం యంత్రం నుంచి నగదు బయటకు వచ్చే మార్గంలో ఓ పరికరాన్ని అమరుస్తారు. దాంతో నగదు బయటకు రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఏటీఎం పనిచేయడం లేదని భావించి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడ ఆగిపోయిన నగదును మోసగాళ్లు తీసేసుకుంటారు.
కొన్ని ఏటీఎం మెషిన్లు నగదును బయటకు పంపేందుకు సమయం తీసుకుంటాయి. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత నగదు కౌంటింగ్ కూడా వెంటనే ప్రారంభం కాదు. చాలా నిదానంగా కొన్ని సెకన్ల తర్వాత మెషిన్ స్పందిస్తుంది. దీంతో ఏటీఎం మెషిన్లలో తిష్టవేసిన వ్యక్తి మెషిన్ సరిగా పని చేయడం లేదని మాయమాటలు చెబుతాడు. ఆ మాటలు నమ్మి క్యాన్సిల్ బటన్ నొక్కకుండా బయటకు వెళ్లామా... మెషిన్ నుంచి వచ్చే నగదు అతడి చేతిలో పడినట్టే.
ఒక ఉదాహరణ
చండీగఢ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రంలో ఓ మహిళ తన డెబిట్ కార్డును ఇన్ సర్ట్ చేసి పిన్ టైప్ చేసి కావాల్సిన నగదు మొత్తాన్ని ఎంటర్ చేసింది. తర్వాత ఓకే బటన్ ను ప్రెస్ చేయగా అది పని చేయలేదు. దాంతో నగదు బయటకు రాలేదు. అక్కడే ఉన్న ఓ యువకుడు జోక్యం చేసుకుని అకౌంట్ బ్యాలన్స్ బటన్ ను ఓకే చేశాడు. జోక్యం చేసుకోవద్దని అతడ్ని హెచ్చరించిన ఆమె మరోసారి తన కార్డును ఎంటర్ చేసి నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా మళ్లీ అదే పరిస్థితి. ఒకటికి నాలుగు సార్లు ఎంటర్ కీ నొక్కడంతో స్క్రీన్ నల్లగా మారిపోయింది. కొంత సేపు వేచి చూసినా అలానే ఉండడంతో ఆమె క్యాన్సిల్ బటన్ నొక్కగా... ఇన్ సర్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అన్న మెసేజ్ రావడంతో బయటకు వెళ్లిపోయింది.
దగ్గర్లోని ఎస్ బీఐ ఏటీఎం సెంటర్ కు వెళ్లి ఆమె రూ.2వేలు డ్రా చేసుకుంది. కానీ బ్యాలన్స్ చూస్తే మొత్తం 17వేలు విత్ డ్రా చేసినట్టు కనిపించింది. సెల్ ఫోన్ చూసుకుంటే రూ.15వేలు, రూ.2వేల మేర రెండు లావాదేవీలు జరిగినట్టు ఎస్ఎంఎస్ లు కనిపించాయి. ఇది ఎలా జరిగిందన్నది ఆమెకు అంతుబట్టలేదు. బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో వాళ్లు నమోదు చేసుకున్నారు. ఏటీఎం ఎర్రర్, నగదు ఆటోమేటిక్ గా ఖాతాకు జమ అవుతాయని బదులిచ్చారు. ఏడు రోజులు ఆగమన్నారు. కానీ నగదు రాలేదు. మళ్లీ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయగా... కార్డును బ్లాక్ చేసుకుని, మోసం జరిగినట్టు ఫిర్యాదు ఇవ్వమన్నారు. ఆ తర్వాత బ్యాంకు సైబర్ క్రైమ్ పర్యవేక్షక బృందం విచారణ చేపడుతుందని సెలవిచ్చారు. ఆమె సందేహంతో బ్యాంకుకు వెళ్లి విచారించింది.
కార్డు బ్లాక్ చేసుకోవద్దని బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చారు. ‘fraud occurred due to malfunctioning of pnb atm machine’ అని మెయిల్ పెట్టమన్నారు. ఆమె అలానే చేసింది. దీంతో పీఎన్ బీ ఐటీ విభాగం స్పందించింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జరిగింది నిజంగా మోసమేనని జవాబిచ్చింది. వీడియో ఫుటేజీల కోసం వెండర్ ను కోరినట్టు తెలిపింది. కానీ, తప్పిదం జరిగిన రోజున బ్యాంకు ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజీ అందుబాటులో లేదని తర్వాత మరో సమాధానం వచ్చింది.
దీంతో గత్యంతరం లేక ఆమె బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించింది. అప్పుడు బ్యాంకు దారికి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీ బ్యాంకు శాఖలో అందుబాటులో ఉందని దాన్ని పరిశీలించాలని కోరింది. ఆ తర్వాత తాము చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చింది. కానీ, ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మరోవైపు ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఏటీఎం మెషిన్ ను హ్యాంగ్ చేసి నగదును కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.
ఇదో నయా మోసం
2014లో కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం మెషిన్లలో డబ్బులు నింపే సీఎంఎస్ ఏజెన్సీ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడ్డారు. నాలుగు నెలల కాలంలో రూ.66.58 లక్షలను కొల్లగొట్టారు. ఏటీఎం యంత్రంలో కార్డును ఇన్ సర్ట్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత లోపల్నుంచి నగదు బయటకు వస్తుందని తెలుసు కదా. కానీ, వీరు నగదు బయటకు రాకుండా చేయి అడ్డు పెట్టారు. దీంతో అది వెనక్కి వెళ్లిపోయి తిరిగి ఖాతాలో జమైంది. అడ్డు పెట్టిన చేయి తీసిన వెంటనే అంతకుముందు నమోదు చేసిన లావాదేవీ తాలూకు నగదు మొత్తం బయటకు వచ్చే లోపాన్ని వారు తమ మోసానికి అవకాశంగా మార్చుకున్నారు. ఫలితంగా బ్యాంకు ఖాతాల్లో నగదు బ్యాలన్స్ నుంచి కొట్టేయకుండా, బ్యాంకు సొమ్మును కాజేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
జాగ్రత్తలతో భద్రం
స్క్రీన్ లాక్ లేదా హ్యాంగ్ అయిన సందర్భాల్లో వెంటనే సెక్యూరిటీ గార్డును పిలిచి సాయం కోరాలి. అనుమానితులున్నట్టు చెప్పాలి.
లావాదేవీ నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను అనుమతించవద్దు.
సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాలను వాడుకోవద్దు. రాత్రి సమయాల్లో, బ్యాంకులు పనిచేయని వేళ్లల్లో అత్యవసరమైతే తప్ప ఏటీఎంలను వాడవద్దు. జన సమ్మర్థ ప్రాంతాల్లోని ఏటీఎంలను వినియోగించడం భద్రత రీత్యా నయం.
కొంత మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా 500 రూపాయల చొప్పున ఏటీఎంలలో డ్రా చేస్తుంటారు. వీలయితే తరచూ లావాదేవీలను తగ్గించడం నయం.
కార్డు కోల్పోతే వెంటనే బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి బ్లాక్ చేయించుకోవాలి. కార్డు మెషిన్ లోపల ఇరుక్కుపోతే కస్టమర్ కేర్ నంబర్ కు అక్కడి నుంచే కాల్ చేయండి. తరచూ పిన్ నంబర్ కూడా మార్చుకోవాలి.
పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో మరో చేయిని అడ్డంగా పెట్టుకోవాలి. బ్యాంకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ మెసేజ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవడం నయం.
కార్డును ఇన్ సర్ట్ చేసే ముందు అక్కడ ఏదైనా అనవసరపు పరికరాలను అమర్చారా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి.
కార్డు స్లాట్ వద్ద అనుమానిత వస్తువు ఏదైనా కనిపిస్తే వెంటనే బ్యాంకు సిబ్బందికి తెలియజేయాలి.
ఏటీఎం కార్డు వెనుక సీవీవీ అని మూడు అంకెలు ఉంటాయి. దాన్ని గుర్తు పెట్టుకుని కార్డుపై చెరిపేయండి. కార్డు వెనుక భాగంలో సిగ్నేచర్ కాలమ్ వద్ద తప్పకుండా సంతకం చేయాలి.
బ్యాంకులదే బాధ్యత
ఏటీఎం మెషిన్ ను ఏర్పాటు చేసింది బ్యాంకే. కనుక మోసాలు, అక్రమాలు జరగకుండా నివారణ, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది. లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో వేరెవరూ లోపలికి చొరబడకుండా బ్యాంకులే తగిన ఏర్పాట్లు చేయాలి. ఇలా బ్యాంకులవైపు ఉన్న లోపాలకు కస్టమర్లు ఎందుకు నష్టపోవాలి. అందుకే ఏ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో తప్పిదం జరిగిందన్న దానితో సంబంధం లేకుండా కస్టమర్ తనకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు టోల్ ఫ్రీ, కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు స్పందించకుంటే వివిధ మార్గాల్లో (అంబుడ్స్ మెన్, వినియోగదారుల ఫోరం, న్యాయస్థానం) న్యాయ సహాయం పొందవచ్చు.