మూల కణాలు మళ్లీ బతికిస్తాయా...?

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు వారి జీవితంలో ఎంతగానో సంతోషించిన సందర్భం ఒకటుంది. 2012 జూలై 20న శ్రావణ శుక్రవారం రోజున ఆ దంపతులకు ఆడబిడ్డ (ఆమె పేరు సితార) జన్మించింది. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందనుకుని మిక్కిలి సంతుష్టులయ్యారు.

అంతేకాదు, ఆ చిన్నారి క్షేమాన్ని కాంక్షిస్తూ మూల కణాలను కార్డ్ లైఫ్ సంస్థలో భద్రపరిచి తోటి సెలబ్రిటీలకు, మరెందరికో ఆదర్శంగా నిలిచారు. తమ బాబు గౌతమ్ మూల కణాలను భద్రపరచలేకపోయామన్న దిగులు ఈ విషయంలో వారిని ముందు నుంచీ జాగ్రత్త పడేలా చేసింది. ఇంతకీ ఈ మూలకణాల బ్యాంకింగ్ ఏమిటి...? ఎందుకు...? ఏమైనా ఉపయోగం ఉందా...? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. 

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు (అంబిలికల్). పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు (స్టెమ్ సెల్స్) పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణ చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం, రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం తొమ్మిది మాసాల్లో ఎన్నో కణాలుగా, కణజాలంగా, అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడమన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డు తాడు, గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. 

representation image

మూల కణాలు ఎక్కడి నుంచి

కణాలను సృష్టించే సామర్థ్యాన్ని బట్టి మూల కణాలను భిన్న రకాలుగా వర్గీకరించారు. అవి టోటిపోటెంట్, ప్లూరిపోటెంట్, మల్టీపోటెంట్ సెల్. వీర్యకరణం అండంతో ఫలదీకరణ చెందినప్పుడు ఏర్పడే కణాన్నే టోటిపోటెంట్ సెల్ అంటారు. ఈ కణం ఎలాంటి కణాలనైనా సృష్టించగలదు. బ్రెయిన్, లివర్, బ్లడ్, హార్ట్ సెల్స్ ఇలా అన్ని రకాల కణాలను తయారు చేయగలదు. పిండంగా అభివృద్ధి చెందే క్రమంలో మరిన్ని టోటీపోటెంట్ సెల్స్ ఉత్పత్తవుతాయి. ఇలా నాలుగు రోజుల పాటు కణ విభజన జరుగుతుంది. అప్పుడు ఆ కణాలను ప్లూరి పోటెంట్ సెల్స్ గా పేర్కొంటారు. 

ఎంబ్రియోనిక్ (పిండం) స్టెమ్ సెల్స్ ను ప్లూరిపోటెంట్ సెల్స్ గా కూడా చెబుతారు. ఇవి అన్ని రకాల కణజాల నిర్మాణానికి కారణమవుతాయి. నాలుగు రోజుల కణవిభజన ప్రక్రియ తర్వాత పిండం రెండు రకాల పొరలుగా ఏర్పడుతుంది. బయటి పొర ప్లాసెంటా అయితే లోపలి పొర మాస్. లోపలి పొరలో కణజాలంతో శిశువు నిర్మాణం జరుగుతుంది. లోపల ఉండే కణాలే ఎలాంటి కణజాలంగా అయినా మారతాయి. దాంతో అవయవాల నిర్మాణం జరుగుతుంది. ఇందుకు బయటనున్న లేయర్ కూడా చాలా కీలకం.    

ఈ ప్లూరిపోటెంట్ సెల్స్ మరిన్ని కణాలుగా విభజన చెందుతాయి. అందులో మల్టీపోటెంట్ సెల్స్ కూడా ఒక రకం. మల్టీ పోటెంట్ సెల్స్ అన్ని రకాల కణాలను సృష్టించలేవు. ఉదాహరణకు ప్లూరిపోటెంట్ సెల్స్ రక్తకణాలు, చర్మకణాలు, నాడీ కణాలను సృష్టిస్తే వాటిని భిన్న రకాల కణాలుగా మల్టీపోటెంట్ సెల్స్ అభివృద్ధి చేస్తాయి. రక్త కణాల్లోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్స్ ను మల్టీపోటెంట్ సెల్స్ అభివృద్ధి చేసేవే. అడల్ట్ (వయోజనులు) స్టెమ్ సెల్స్ అనేవి యోజనుల శరీరంలోని చాలా రకాల కణజాలంలో ఉంటాయి. వీటిని మల్టీ పోటెంట్ స్టెమ్ సెల్స్ గా చెబుతారు.  

ఎముక మజ్జలో, వెంట్రుక మొదళ్లలో, పిల్లల పాల పళ్లల్లో, కొవ్వులో, రక్తంలో, చర్మంలో, కండరాల్లో ఇలా ప్రతీ భాగంలోనూ మూల కణాలు ఉంటాయి. వీటన్నింటిలోకి పిండం, బొడ్డు తాడు, బొడ్డు తాడు రక్తంలో లభించే మూల కణాలు విశిష్టమైనవి. ఇక పాల పళ్లల్లోంచి సేకరించినవి, ఎముక మజ్జ నుంచి సేకరించిన మూల కణాలు కూడా కొన్ని రకాల చికిత్సల్లో ఉపయోగపడతాయని నిరూపితమైంది.

చికిత్సా విధానాలు

దెబ్బతిన్న శరీర భాగాలను మూల కణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాల ఆవిర్భావంతో ఆ శరీర భాగం నూతన జీవాన్ని సంతరించుకుంటుంది. ఉదాహరణకు శరీరంలో ఓ భాగంలో కణాలు దెబ్బతిన్నాయనుకుందాం. అప్పుడు మూల కణాలను ఇంట్రా వీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకూ వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ చక్కగా జరిగేలా చేస్తాయి. దీంతో అనారోగ్యం నయమవుతుంది.  

శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకూ జరిగిన వైద్య పరిశోధనల ద్వారా గుర్తించారు. అలాగే, ఎయిడ్స్, అల్జీమర్స్, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్ సన్స్ వ్యాధి, మెదడు, వెన్నెముక గాయాలు, స్ట్రోక్, గర్భాశయ సమస్యలకు మూల కణాలతో చికిత్స చేయగా... సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స అందించేందుకు వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.   

కేన్సర్ చికిత్సల్లో (ల్యూకేమియా, లింఫోమా) బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) అన్నది చాలా ఏళ్ల క్రితం నుంచి అమల్లో ఉంది. 1988లో తొలి స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స జరిగింది. సాధారణంగా శరీరంలో ఏదైనా భాగానికి కేన్సర్ ఏర్పడితే ఆ భాగాన్ని తొలగించడం ద్వారా నయం చేయవచ్చు. అదే రక్త కేన్సర్ అయితే, ఏ భాగాన్నీ తొలగించలేరు కదా. అందుకే శరీరంలో రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముకమజ్జ లేదా దాన్నుంచి సేకరించిన మూల కణాలతో చికిత్స చేస్తారు. ఎముకల మధ్యలో ఉండే కణజాలాన్ని ఎముకమజ్జగా పేర్కొంటారు. దీన్ని లేదా మూల కణాలను దాతల నుంచి సేకరించి నరాల ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. 

representation image

బ్లడ్ కేన్సర్ పేషెంట్లకు కీమో థెరపీ ద్వారా దెబ్బతిన్న కణాలను తొలగిస్తారు. ఎందుకంటే ఇవి మిగిలిన కణాలను కూడా దెబ్బతీయకుండా ఉండేందుకు అలా చేస్తారు. దీంతో సాధారణ రక్త కణాల వృద్ధికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఇది ఫలితం ఇవ్వకపోతే మూల కణాల మార్పిడి ప్రక్రియ నిర్వహిస్తారు. ఎముకమజ్జ లేదా ఎముక మజ్జ నుంచి సేకరించిన మూల కణాలు, రక్తం, బొడ్డుతాడు నుంచి సేకరించిన మూల కణాల (వీటిలో ఏదో ఒక రకం) ను రోగి రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఎక్కిస్తారు. దీంతో కొత్త రక్తం, కొత్త కణాల వృద్ధితో వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 45వేల యూనిట్ల బొడ్డు తాడు రక్తాన్ని ట్రాన్స్ ప్లాంట్ కోసం వినియోగించారు. బొడ్డుతాడు రక్తం నుంచి సేకరించిన కణాలను హెమటో పాయిటిక్ స్టెమ్ సెల్స్ అంటారు.

ఇటీవలి కాలంలో బొడ్డుతాడు, పిండం, ఇతర ప్రాంతాల్లో లభించే మూల కణాల ద్వారానూ చికిత్సలు చేయడంపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. బొడ్డు తాడు రక్తం నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ద్వారా రక్తం, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసేందుకు రూపొంచిన ఐదు ఉత్పత్తులకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ ఆమోదం తెలిపింది. 

పార్కిన్ సన్స్ వ్యాధిలో డోపమైన్ అనే నాడీ ప్రసారానికి అవసరమైన రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాల నిర్వీర్యం జరుగుతుంటుంది. పిండస్థ మూల కణాలను పార్కిన్ సన్స్ వ్యాధి ఉన్న వ్యక్తి రక్తంలోకి ప్రవేశపెట్టగా... ఇవి డోపమైన్ విడుదల చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో పార్కిన్ సన్స్ వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. అలాగే, తలసీమియా వ్యాధితో బాధపడేవారికి జీవించి ఉన్నంత కాలం రక్తమార్పిడి అవసరం. ఇది చాలా బాధ, ఖర్చుతో కూడుకున్న పని. కానీ, ఇలాంటి వారికి మూల కణాల మార్పిడి ద్వారా వ్యాధిని నయం చేసే అవకాశం ఉండడం నిజంగా మరో జన్మే. 

మూల కణాలతో నయం చేయగలిగే వ్యాధుల సంఖ్య 

తలసీమియా, అక్యూట్, మైలోజీనస్ లుకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, క్రానిక్ మైలోజీనస్ లుకేమియా, హిస్టియోసైటిక్ నియోప్లాస్మ్, ఇతర మైలో ప్రొలిఫరేటివ్ నియోప్లాస్మ్, మైలోడిస్ ప్లాస్టిక్ సిండ్రోమ్, మల్టిపుల్ మైలోమా, ప్లాస్మా సెల్ లుకేమియా, స్టిస్టమిక్ మాస్టోసైటోసిస్, వాల్డెన్ స్టార్మ్స్ మాక్రో గ్లోబులేనీమియా, హాడ్ కిన్ లింఫోమా, నాన్ హాడ్ కిన్ లింఫోమా, లాంగర్ హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్, న్యూరోబ్లాస్టోమా, రెటినో బ్లాస్టోమా, అప్లాస్టిక్ అనీమియా, చెడియక్ హిగాషి సిండ్రోమ్, కంజెన్షియల్ డైసెరిత్రోపాయిటిక్ అనీమియా, డైమండ్ బ్లాక్ ఫాన్ సిండ్రోమ్, డైజార్జ్ సిండ్రోమ్, ఎవ్నాస్ సిండ్రోమ్, ఫాంకోని అనీమియా, గ్లాంజ్ మన్స్ త్రోంబో బాస్తెనీమియా, గంతర్స్, హెరిడెటిరీ బీఎం ఫెయిల్యూర్ సిండ్రోమ్స్, హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్, లూకోసైట్ అడెసన్ డిఫీషియన్సీ, పారోక్సీస్మాల్ నాక్టూర్నల్ హెమోగ్లోబినూరియా, ప్యూర్ రెడ్ సెల్ అప్లాసియా, సికిల్ సెల్ అనీమియా, క్రానిక్ గ్రాన్యులోమేటస్ డిసీజ్, కామన్ వేరియబుల్ ఇమ్యునోడెఫీషియన్సీ, కార్టిలేజ్ హెయిర్ హైప్లోప్లాసియా, రెటిక్యులర్ డిస్ జెనెసిస్, సెవర్ కంబైన్డ్ ఇమ్యూన్ డెఫీషియన్సీ, విస్కాట్ అల్డీరిచ్ సిండ్రోమ్, అడ్రెనో ల్యూకో డిస్ట్రోఫీ, గౌచర్స్ డిసీజ్, హర్లర్ సిండ్రోమ్, హంటర్స్ సిండ్రోమ్, క్రాబే డిసీజ్, మెటా క్రోమాటిక్ ల్యూకో డిస్ట్రోఫీ, ఆస్టియో పెట్రోసిస్, వోల్ మాన్ డిసీజ్ తదితర వ్యాధులకు అభివృద్ధి చెందిన దేశాల్లో మూల కణాలతో కిత్సలు చేస్తున్నారు.

ప్రయోగాల దశలో ఉన్నవి...

స్ట్రోక్ (పక్షవాతం), ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీలో మెదడులోని ఓ భాగంలో కణాలు చనిపోతాయి. నాడీ కణాలను కోల్పోవడంతో అవి నియంత్రించే భాగాల్లో పక్షవాతం వస్తుంది. స్కాట్లాండ్ లో 2013లో స్ట్రోక్ వచ్చిన వారి మెదడులోకి స్టెమ్ సెల్స్ ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు కనిపించాయి.  అలాగే 2004లో లండన్ లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు ఊడిపోయిన పన్ను స్థానంలో కొత్త దాన్ని పున:సృష్టి చేయవచ్చని ఎలుకలపై నిర్వహించిన పరిశోధన ద్వారా కనుగొన్నారు. రోగి నుంచి మూల కణాలను సేకరించి ల్యాబ్ లో పంటి మొగ్గను సృష్టిస్తారు. దీన్ని తీసుకెళ్లి పంటి కుదుళ్లలో ప్రవేశపెడతారు. దాంతో మూడు వారాల్లో అది అక్కడ పెరిగి పెద్దదవుతుంది. ఇలా ప్రతీ సమస్యకూ మూల కణాలతో చికిత్స చేసే విధానాలు, ఫలితాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

representation image

ఈ కిందనున్న వ్యాధులకు కూడా ప్రయోగాత్మకంగా మూల కణాలతో చికిత్స చేసి చూడగా... ప్రోత్సాహక ఫలితాలు కనిపించాయి. అయితే, ఇంకా సరైన ప్రామాణిక చికిత్సా పద్ధతి అమల్లోకి రాలేదు. ఆటిజం, బ్రెయిన్ ట్యూమర్, కార్టిలేజ్ రిపెయిర్, క్లెఫ్ట్ ప్యాలట్ రిపెయిర్, సెరెబ్రల్ పాల్సీ, క్రాన్స్ డిసీజ్, క్రిటికల్ లింబ్ ఇస్చేమియా, డయాబెటిస్ టైప్ 1, ఎపి డెర్మలోసిస్ బుల్లోసా, ఎవింగ్ సర్కోమా, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, హైపోక్సిక్ ఇస్చేమిక్ ఎన్ సెఫలోపతి. హియరింగ్ లాస్, హెచ్ఐవీ, ఇస్చేమిక్ స్ట్రోక్, లూపస్, మల్టిపుల్ స్కెలరోసిస్, మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, ఓవేరియన్ కేన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెన్నెముక గాయాలు, స్కెర్లోడ్రెమా, టెస్టిక్యులర్ ట్యూమర్, అల్జీమర్స్ డిసీజ్, అమినోట్రోఫిక్ లేటరల్ స్కెలరోసిస్, కంజెన్షియల్ హైడ్రోసెఫలస్, హంటింగ్టన్ డిసీజ్, లివర్ సిర్రోసిస్, పార్కిన్ సన్స్ డిసీజ్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీ లకు భవిష్యత్తులో మూల కణాలతో చికిత్సలు అందుబాటులోకి రానున్నాయని ఆశిస్తున్నారు.

మన దేశంలో స్టెమ్ సెల్ బ్యాంకులు

ప్రసవం జరిగిన ఆరు గంటల్లోపే బొడ్డు తాడు, అందులోని రక్తాన్ని ల్యాబ్ కు తరలించాల్సి ఉంటుంది. అంతకన్నా సమయం మించితే కణాల్లో యాక్టివిటీ తగ్గిపోతుంది. సేకరించిన మూల కణాలను బ్యాంకుల్లో మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ద్రవ నైట్రోజన్ ఆక్సైడ్ వాయువు తో ఉన్న ట్యాంకులలో భద్రపరుస్తారు. వీటికి కాల వ్యవధి లేదు. ఈ ఉష్ణోగ్రతలో ఉంచినంత కాలం సజీవంగా ఉంటాయి.  

సంస్థలు... చార్జీలు:  సాధారణంగా 21 ఏళ్ల కాలానికి మూల కణాలను భద్రపరిచినందుకు 50వేల రూపాయల నుంచి 90 వేల రూపాయల వరకు దేశంలోని స్టెమ్ సెల్ బ్యాంకులు చార్జీ వసూలు చేస్తున్నాయి. జీవిత కాలానికి 90 వేల నుంచి 1.20 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నాయి. పైగా సేకరణ సమయంలో ప్రాసెసింగ్ పేరుతో 5వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు రాబడుతున్నాయి. ట్రాన్స్ సెల్ బయలాజికల్స్ 21 ఏళ్లకు 75వేలు, బొడ్డుతాడు నిల్వకు 90వేలు వసూలు చేస్తోంది. ఇవి ఏక మొత్తం చార్జీలు. ఇలా చెల్లించలేని వారు ఏటా వార్షిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉన్నాయి. ఒక కిలో బరువున్న అవయవాన్ని బాగు చేయాలంటే పది లక్షల మూల కణాలు అవసరం. పది లక్షల మూల కణాలను సిద్ధం చేసి ఇచ్చినందుకు రెండు నుంచి మూడు వేల రూపాయలు తీసుకుంటోంది.

లైఫ్ సెల్ సంస్థ తన కస్టమర్లకు ఓ గ్యారంటీ ఇస్తోంది. తమ బ్యాంకులో మూల కణాలు భద్రపరచుకున్నవారికి అవసరమైన సందర్భాల్లో వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే 14 రోజుల్లోపు పబ్లిక్ బ్యాంకు నుంచి అందించే ఏర్పాటు చేస్తుంది. ఇది కూడా చేయలేని పరిస్థితి ఎదురైతే పరిహారంగా రూ.20 లక్షలను చెల్లిస్తానని హామీ ఇస్తోంది. ఇదే విధమైన హామీని బేబీసెల్ కూడా అందిస్తోంది. కొన్ని బ్యాంకులు మూల కణాలతో చికిత్స అవసరం ఏర్పడితే 20 లక్షలు ఇస్తామంటూ ఆకర్షిస్తున్నాయి. స్టెమ్ సైట్ ఇండియా సంస్థ పబ్లిక్, ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకు సేవలను అందిస్తోంది. ఇంకా క్రయోవివా ఇండియా, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ సర్వీసెస్, క్రై సేవ్, లైఫ్ సెల్, కార్డ్ కేర్ సహా పదుల సంఖ్యలో బ్యాంకులు పోటా పోటీగా మూల కణాలను భద్రపరిచే సేవలు అందిస్తున్నాయి.

రెండో సంతానం మూల కణాలు అక్కరకొస్తాయి

మొదటి బిడ్డ బొడ్డుతాడు మూల కణాలను సేకరించలేకపోయినా రెండో బిడ్డ నుంచి సేకరించిన కణాలను ఇద్దరికీ వాడుకునే సౌలభ్యం ఉంది. వాస్తవానికి ఈ మూల కణాలు వారికే కాదు వారి కటుంబ సభ్యులు, ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అందుకోసం ముందుగా హ్యుమన్ యాంటీ లూకోసైట్ యాంటీజెన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 60 శాతం సరిపోతున్నట్టు తేలితే అప్పుడు వారూ వీటిని వాడుకోవచ్చు.

దానమివ్వండి... అవసరమైనప్పుడు పొందండి

ఒకవేళ బొడ్డు తాడు మూల కణాలను దాచుకోవడం ఇష్టం లేకపోతే వృధాగా పోనివ్వకండి. జీవన్ బ్లడ్ బ్యాంక్ వంటి పబ్లిక్ డోనర్ బ్యాంకులకు దానం చేయవచ్చు. దీంతో రెండు రకాల ప్రయోజనాలు  ఉన్నాయి. ఇతరులకు ఉపయోగపడడంతోపాటు అవసరమైనప్పుడు వాటినే కొంత ఫీజు చెల్లించి తిరిగి పొందవచ్చు. దానం చేసిన వారే తిరిగి మూల కణాలను కోరుకుంటే 30వేల రూపాయలను జీవన్ బ్లడ్ బ్యాంకు వసూలు చేస్తోంది. రూ.5లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఉచితంగానే అందిస్తోంది. మూల కణాలు అవసరపడిన ప్రతీ సందర్భంలోనూ నగదు చెల్లించాల్సి రావచ్చు. అంతేకానీ, మూల కణాలు దాచినందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ఒకవేళ పబ్లిక్ డోనర్ బ్యాంకులకు మూల కణాలు దానం చేయాలని అనుకుంటే ముందుగానే వారికి సమాచారం అందించాల్సి ఉంటుంది.

representation image

బొడ్డు తాడును భద్ర పరచుకోలేదని బాధపడుతున్నారా..?

మేము కూడా మా బిడ్డల బొడ్డుతాడు, రక్తాన్ని దాచుకుని ఉంటే బాగుండేది అని అనుకునేవారికి మరో అవకాశం ఉంది. వారి పిల్లల వయసు పదేళ్లలోపు ఉంటే పాల పళ్లలో (అంటే పుట్టిన తర్వాత వచ్చే పళ్లు ఇవి సాధారణంగా పదేళ్ల వయసు వరకు ఉంటాయి) ఉండే మీసెన్ ఖైమల్ మూల కణాలు కూడా వైద్య చికిత్సలో ఉపయోగపడతాయి. ఇవే కణాలు బొడ్డుతాడు కణజాలంలోనూ ఉంటాయి.

మన దేశంలో స్టెమేడ్ వంటి సంస్థలు డెంటల్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిని సంప్రదించినప్పుడు వైద్యుడి సాయంతో ఆరోగ్యవంతమైన ఓ పాల దంతాన్ని సేకరించి అందులోని మూల కణాలను సేకరిస్తారు. వివిధ రకాల పరీక్షల తర్వాత భద్రపరుస్తారు. పాల పళ్లలోని మూల కణాలను కూడా భద్రపరచుకోవడం ఇష్టం లేకుంటే వాటిని సైతం దానం చేయవచ్చు.

మన దగ్గర అందుబాటులో ఉన్న చికిత్సలు

నిజానికి స్టెమ్ సెల్ థెరపీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. మన దేశంలో మూల కణాల మార్పిడి చికిత్సలు చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. కేన్సర్, తలసీమియా వ్యాధుల్లోనే మూల కణాలతో ఇక్కడి వైద్యులు ప్రామాణిక చికిత్సా విధానాలను పాటిస్తున్నారు. అపోలో వైద్యులు కరోనరీ ఆర్టరీ వ్యాధికి నిర్వహించే పలు రకాల చికిత్సల్లో ఒకటైన ట్రాన్స్ మయోకార్డియల్ రీవాస్క్యులరైజేషన్ లో బోన్ మ్యారో మూల కణాలను వినియోగించి చూస్తున్నారు. ఇక కొన్ని రకాల ఆస్పత్రుల్లో రోగుల బలమైన అభ్యర్థనల మేరకు టైప్ 2 డయాబెటిస్ కు కూడా చికిత్స చేస్తున్నారు. ఇందుకు రూ.2 లక్షలకు పైగా వస్తూలు చేస్తున్నారు. కానీ ఫలితాల విషయంలో ఎలాంటి ధ్రువీకరణ లేదు. 

భవిష్యత్తులో మూల కణాలపై పరిశోధనల ఫలితాల ద్వారా మరిన్ని వ్యాధులకు ప్రామాణిక చికిత్సా విధానాలు తప్పకుండా వస్తాయని పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అప్పుడు బొడ్డుతాడు లేదా పిండం మూల కణాలు ఎంతో అవసరం ఏర్పడవచ్చు. ముందు చూపుతో మూల కణాలను భద్రపరచుకోవడం ఒక విధంగా చూస్తే మంచి నిర్ణయమే అవుతుంది. అయితే, అందుకు ఖర్చును భారంగా భావించే వారు కనీసం పబ్లిక్ డోనర్ బ్యాంకులకు దానం చేయడం ద్వారా అయినా ఓ అవకాశాన్ని పదిలంగా ఉంచుకున్నట్టు అవుతుంది. ఇక ఏ అవకాశం లేని వారికి కొన్ని రకాల చికిత్సలకు ఎముకమజ్జ నుంచి సేకరించే మూల కణాలు అక్కరకు వస్తాయి. 

ఆరోపణలు

వైద్యులకు లంచాలు ఇస్తూ అక్రమ పద్ధతుత్లో స్టెమ్ సెల్ బ్యాంకులు తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఒక పేషెంట్ ను రిఫర్ చేస్తే 20వేల రూపాయల ప్రతిఫలాన్ని వైద్యులకు బ్యాంకులు ముట్టజెబుతున్నాయి. బ్లడ్ కేన్సర్, తలసీమియా, సికిల్ సెల్, మెటబాలిక్ డిజార్డర్లను మినహాయిస్తే మూల కణాలతో ఇతర వ్యాధులకు చికిత్సలు అనేవి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. రక్త సంబంధిత అనారోగ్యాలకే మూల కణాలను వినియోగించేందుకు ఎఫ్ డీఏ ఆమోదం ఉన్నది.

జెనెటిక్ వ్యాధులను నయం చేసేందుకు చికిత్సలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ఎవరి నుంచి అయితే సేకరించామో వారిలో అదే విధమైన జెనెటిక్స్ ఉంటాయి కనుక. బ్యాంకుల నుంచి మూల కణాలను తిరిగి అందించే ముందు సరైన విధంగా పరీక్షలు నిర్వహించడం లేదు. ఇలా వైద్య రంగానికి చెందిన నిపుణుల నుంచి స్టెమ్ సెల్ బ్యాంకుల విషయంలో ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా బ్యాంకుల్లో మూల కణాలను నిర్దేశిత ప్రమాణాల మేరకు నిల్వ చేస్తున్నారా? అన్నదానిపై తగిన తనిఖీలు, పర్యవేక్షణ కూడా లేదన్న సందేహాలు సైతం వినిపిస్తున్నాయి.


More Articles