మూత్ర పిండాల్లో రాళ్లు ఎందుకు వస్తాయి.. ఎలా బయటపడొచ్చు?

ఆధునికతతో మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మూత్ర పిండాల్లో రాళ్లు, కిడ్నీ కేన్సర్ వంటివైతే చాప కింద నీరులా తెలియకుండానే విస్తరిస్తున్నాయి. పెద్ద వయస్సు వారే కాదు.. ఇటీవలి కాలంలో 30 - 35 ఏళ్ల వయసున్న వారిలోనూ ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. మూత్ర పిండాలు దెబ్బతినడంతో ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపైనా పడి.. కాలేయ సమస్యలు, గుండె జబ్బులు, మూత్రాశయ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కమ్ముకుంటున్నాయి. చివరికి వృద్ధాప్యం వచ్చే సరికి శరీరంలో సత్తువ పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. మరి శరీరంలో కిడ్నీల ప్రాధాన్యత ఏమిటి, వాటి పనితీరు ఎలా ఉంటుంది? కిడ్నీల్లో రాళ్లు ఎందుకు, ఎలా ఏర్పడతాయి? కిడ్నీ జబ్బులు, సమస్యల నుంచి ఎలా బయటపడొచ్చనే అంశాలను వివరంగా తెలుసుకుందాం..

మన పిడికిలి పరిమాణంలో..representational image

మన శరీరం వెనుక భాగంలో నడుము ప్రాంతంలో వెన్నెముకకు ఇరువైపులా మూత్ర పిండాలు ఉంటాయి. ఎవరి పిడికిలి ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో వారి కిడ్నీలు ఉంటాయి. వీటిలో నెఫ్రాన్లు అని పిలిచే అతి చిన్న ఫిల్టర్లు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. ఒక్కో నెఫ్రాన్ లో గ్లోమెరులస్, ట్యూబ్యుల్ అనే రెండు భాగాలు ఉంటాయి. కిడ్నీల్లోని నెఫ్రాన్ల ద్వారా రక్తం సరఫరా అయినప్పుడు.. తొలుత గ్లోమెరులస్ రక్తంలోని విషపదార్థాలను, పలు రకాల రసాయనాలు, ద్రవ పదార్థాలను జల్లెడ పడుతుంది. తర్వాత వీటిని ట్యూబ్యుల్ మరోసారి జల్లెడ పట్టి శరీరానికి అవసరమైన మినరల్స్ ను సంగ్రహించి.. తిరిగి రక్తంలోకి పంపుతుంది. ఇక వ్యర్థాలు మూత్రం రూపంలో యుటెరరీ నాళాల ద్వారా ప్రవహించి మూత్రాశయం (బ్లాడర్)లో నిల్వ అవుతాయి. తర్వాత మూత్ర నాళం ద్వారా విసర్జింపబడుతుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరం విషపూరితమై.. చివరికి మరణం కూడా సంభవిస్తుంది.

కిడ్నీలు చేసే పని ఏమిటి?

  • శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను జల్లెడ పట్టి విసర్జించడం మూత్ర పిండాల ప్రధాన విధి. 
  • ఎర్ర రక్త కణాల తయారీకి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడే హార్మోన్లను, రక్తపోటును నియంత్రించే హార్మోన్లను కిడ్నీలు తయారు చేస్తాయి.
  • కిడ్నీలు రోజూ 110 నుంచి 145 లీటర్ల రక్తాన్ని జల్లెడ పట్టి... నీరు, వ్యర్థాలతో కూడిన లీటరు నుంచి రెండు లీటర్ల మూత్రాన్ని బయటకు విసర్జిస్తాయి. (మనుషుల్లో మొత్తంగా ఉండే రక్తం 4.5 లీటర్ల నుంచి 5 లీటర్లే. అయితే రక్తం శరీర కణాలకు ఆక్సిజన్ ను అందించి, వ్యర్థాలను తీసువచ్చే పనిని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో శరీరం మొత్తం రోజుకు 20 - 30 సార్లు తిరుగుతుంది.)

సమస్యలకు కారణాలేమిటి?

  • విపరీత ఆహార అలవాట్లు, జీవన శైలి, జన్యు వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటివి కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి.
  • కిడ్నీ సమస్యలు ముదిరితే చివరికి అవి పూర్తిగా పనిచేయకుండా పోతాయి. 
  • విటమిన్ సి, కాల్షియం సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. 
  • రెండు కిడ్నీలు కూడా బాగా దెబ్బతింటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవడం లేదా జీవితాంతం డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరి.
  • సాధారణంగా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఒక కిడ్నీతో కూడా మనిషి పూర్తి ఆరోగ్యంగా జీవించగలడు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులు కిడ్నీ చెడిపోయిన తమ కుటుంబ సభ్యులకు కిడ్నీని దానం చేయవచ్చు.
  • మూత్ర పిండాలకు వచ్చే సమస్యలేమిటి?
  • మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వంటివి సాధారణంగా ఏర్పడే సమస్యలు. ఇక ఎక్కువగా వచ్చే కేన్సర్లలో మూత్ర పిండ కేన్సర్ ఒకటి. రెనల్ సెల్ కార్సినోమాగా దీనిని పిలుస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ) వంటి సమస్యలు తలెత్తుతాయి.

కిడ్నీల్లో రాళ్లతో ఎన్నో సమస్యలు

మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య చాలా మందికి తెలిసినదే. కిడ్నీలు రక్తంలో నుంచి జల్లెడ పట్టిన ఖనిజాలు, ఆమ్ల లవణాలు ఒకదానికొకటి కలసి గట్టిపడి రాళ్లలా రూపొందుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రాళ్లుంటే మిగతా వారికీ ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇక ఇంతకు ముందు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన వారికి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ రాళ్లు వస్తాయి. శరీరానికి తగినంత మోతాదులో నీరు అందకపోవడం వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రక్తంలో పరిమితికి మించి ఉన్న కాల్షియం, ఆక్సలేట్, యూరేట్, ఫాస్పేట్, సిస్టిన్,  వంటి రసాయనాలు, ఆమ్లాలు, నీరు వంటి ద్రవాలను కిడ్నీలు వడగడతాయి. నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వడగట్టిన రసాయనాలు బాగా చిక్కగా ఉండి.. ఒకదానికొకటి అతుక్కుని గట్టిపడతాయి. అవే చివరికి రాళ్లలా మారుతాయి. కాలం గడిచిన కొద్దీ ఈ రాళ్ల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ రాళ్లు ఇసుక రేణువులంత పరిమాణం నుంచి నిమ్మకాయల సైజు వరకూ ఉండవచ్చు. అయితే రాళ్లు చిన్నగా ఉన్నప్పుడే నీరు ఎక్కువగా తీసుకుంటే అవి మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. చాలా మంది సాధారణ వ్యక్తుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. కొందరిలో మాత్రం రాళ్లు పెద్దవై మూత్ర పిండంలోగానీ, నాళాల్లోగానీ ఇరుక్కుపోతాయి. దానివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. మూత్రం మంటగా ఉంటుంది. రక్త స్రావం కనబడుతుంది.

ఈ సమస్య ఎవరికి వస్తుంది?

తగినంత మోతాదులో నీళ్లు తాగని వారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. చక్కెర, ఉప్పు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఊబకాయం, కాల్షియం సప్లిమెంట్లు అధికంగా తీసుకోవడం, విపరీతంగా ఆల్కాహాల్ వినియోగం, గ్యాస్ట్రిక్ సమస్యలకు చికిత్స పొందుతున్నవారికి, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రాళ్ల సమస్య ఉన్న వారికి రాళ్లు వస్తాయి. వీటిలో కాల్షియం, ఆక్సలేట్లు కలసి గట్టి పడడం వల్ల ఏర్పడే ఆక్సలేట్ రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, కాల్షియం రాళ్లు, స్ట్రువైట్ స్టోన్స్ తదితరాలు ఉంటాయి. పురుషుల్లో 19 శాతం మందికి, స్త్రీలలో 9 శాతం మందికి కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

రాళ్లుంటే కనబడే లక్షణాలు 

  • సాధారణంగా 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
  • రాళ్లు ఉన్నవారికి ముఖ్యంగా నడుము కింది భాగంలో ఒకవైపు తరచూ విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు పొత్తి కడుపు వరకూ ఉంటుంది.
  • మూత్రం విసర్జించేటపుడు నొప్పి, మంట వస్తాయి. మూత్రంలో రక్త స్రావం కనిపిస్తుంది.
  • మూత్రం ఎరుపు, గోధుమ రంగులో వస్తుంది, దుర్వాసన ఉంటుంది. తరచుగా కొద్ది కొద్దిగా మూత్రం వస్తుంది.
  • కొందరిలో విపరీతమైన నీరసం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
  • రక్త, మూత్ర పరీక్షల్లో కాల్షియం, యూరిక్ యాసిడ్ స్థాయులను గుర్తించడం ద్వారా రాళ్లు ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఇక సీటీ స్కాన్ ద్వారా అయితే రాళ్లు కిడ్నీలో ఉన్నాయా, నాళాల్లో ఉన్నాయా అనే అంశంతోపాటు వాటి పరిమాణాన్ని కూడా కచ్చితంగా గుర్తించవచ్చు.
  • మూత్ర పిండాల్లో రాళ్లను తొలగించడానికి మూడు రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. 
  • రాళ్లు కరిగేందుకు కొన్ని రకాల ఔషధాలతో చికిత్స చేస్తారు. రాళ్లు చిన్నవిగా ఉంటే, అవి కూడా కిడ్నీలో ఉన్నప్పుడే ఈ చికిత్స పనిచేస్తుంది. అంతేగాకుండా ఈ ఔషధాలు దీర్ఘకాలం వాడాలి. ఈ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఔషధాలు సరిగా పనిచేయవు.
  • రాళ్లు కొంచెం పెద్దగా ఉండి, కిడ్నీల నుంచి బ్లాడర్ కు వెళ్లే నాళాల్లో ఇరుక్కుపోయినప్పుడు ‘షాక్ వేవ్ లితోట్రిప్సీ’ చికిత్స ద్వారాగానీ, లేజర్లతోగానీ వాటిని పగులగొడతారు. చిన్న ముక్కలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
  • రాళ్లు మరీ పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స (ఆపరేషన్) చేసి తొలగించాల్సి ఉంటుంది.

నీళ్లే అసలు ఔషధంrepresentational image

  • కిడ్నీలు సరిగా పనిచేయడానికి శరీరానికి తగినంత మోతాదులో నీళ్లు అందుతుండడం అవసరం. రోజూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే రాళ్ల సమస్యకు దూరంగా ఉండొచ్చు.
  • మూత్ర పిండాలు దెబ్బతిన్నవారిలో ఎక్కువ శాతం నీటిని సరిగా తాగకపోవడమో, డీహైడ్రేషన్ సమస్యలకు తరచూ గురై ఉండడమో కారణమని వెల్లడైనట్లు అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ బక్ పార్కర్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. కూల్ డ్రింకులు, కాఫీ వంటి కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని.. నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
  • ముఖ్యంగా ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అందువల్ల ఆల్కాహాల్ కు దూరంగా ఉండడం మంచిది.
  • విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ బి9 (ఫోలిక్ యాసిడ్), విటమిన్ ఏ లు కిడ్నీలు సరిగా పనిచేయడానికి తోడ్పడుతాయని అమెరికాలోని ఆరెంజ్ కోస్ట్ మెమోరియల్ మెడికల్ సెంటర్ వైద్యులు క్రిస్టిన్ ఆర్థర్ వెల్లడించారు.
  • ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది. మాంసాహారం తగ్గించి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
  • పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, బీడీల వంటివాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం.
  • కిడ్నీ సమస్యలు తలెత్తిన వారు కచ్చితంగా వారి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే కిడ్నీలు మరింతగా దెబ్బతింటాయి.
  • కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లను బట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మూత్ర పరీక్షల ద్వారా ఆ రాళ్లు ఏ తరహావి అనేది నిర్ధారిస్తారు.
  • కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడినవారు బచ్చలికూర, చుక్కకూర, గోధుమ మొలకలు, నట్స్, ముల్లంగి ఆకులు వంటివాటికి దూరంగా ఉండాలి.
  • యూరిక్ యాసిడ్ రాళ్లున్నవారు అత్యధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తికి ప్రొటీన్లు దోహదం చేస్తాయి.
  • కాల్షియం రాళ్లున్నవారు ఉప్పు తగ్గించాలి. కాల్షియం సప్లిమెంట్లు వాడకూడదు. ఎందుకంటే ఉప్పులోని సోడియం కారణంగా శరీరం కాల్షియం ను ఎక్కువగా విసర్జిస్తుంది. అది కిడ్నీల్లో రాళ్లుగా మారుతుంది.

కిడ్నీ ఇన్ఫెక్షన్లు

కిడ్నీలకు ఇన్ఫక్షన్లు సోకడానికి ప్రధాన కారణం ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా తొలుత మూత్రాన్ని విసర్జించే నాళం ద్వారా బ్లాడర్ లోకి చేరుతుంది. అక్కడి నుంచి నాళాల ద్వారా కిడ్నీలకు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీనిని గుర్తించి తగిన చికిత్స చేయకపోతే మూత్ర పిండాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.

క్రానిక్ కిడ్నీ డిసీజ్ (తీవ్రమైన మూత్ర పిండాల వ్యాధి)

మూత్ర పిండాలు క్రమ క్రమంగా దెబ్బతిని పూర్తిగా పనిచేయని స్థితికి వెళ్లే వ్యాధి ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’. దీనినే క్రానిక్ రెనల్ డిసీజ్ అని కూడా అంటారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కిడ్నీలు దెబ్బతినడం మొదలైన తర్వాత రక్తంలో వ్యర్థ రసాయనాలు పేరుకుపోతూ విషంగా పరిణమిస్తాయి. దీంతో కిడ్నీలు మరింతగా దెబ్బతింటాయి. రక్తపోటు పెరుగుతుంది. రక్తంలో ఎర్రరక్త కణాలు తగ్గిపోయి ఎనీమియా వస్తుంది. 

శరీరంలో ఎముకలు బలహీనం అవుతాయి. నాడులు దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవిస్తుంది. అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధుల కారణంగా కిడ్నీల్లో అంతర్గతంగా ఉండే సన్నని రక్త నాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలు వ్యర్థాలు, రసాయనాలను సరిగా జల్లెడ పట్టలేక.. అవి రక్తంలోనే ఉండిపోతాయి. అసలు ఈ వ్యాధిని ‘సైలెంట్ డిసీజ్’గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి ముదిరేవరకూ లక్షణాలు పెద్దగా కనిపించవు. కుటుంబంలో ముందు తరాల వారెవరికైనా ఈ వ్యాధి ఉంటే వారి వారసులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

లక్షణాలు ఇవి..

విపరీతమైన నీరసం, ఆకలి మందగించడం, నిద్ర పట్టకపోవడం, దేనిపైనా సరిగా దృష్టి పెట్టలేకపోవడం, పాదాలు, చీల మండల వాపు, పొద్దున పూట కళ్ల చుట్టూ ఉబ్బడం, చర్మం ఎండిపోయి దురదగా అనిపించడం, సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ముఖ్యంగా రాత్రిపూట మూత్రం ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • రక్తంలో క్రియాటినైన్ స్థాయులను పరీక్షించే ‘ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ (ఈజీఎఫ్ఆర్) టెస్టు, అల్బుమిన్-క్రియాటినైన్ నిష్పత్తిని పరిశీలించే ఏసీఆర్ లేదా మైక్రో అల్బుమిన్ టెస్టుల ద్వారా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ను, దాని తీవ్రతను తెలుసుకోవచ్చు.
  • ఇక అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ ల సహాయంతో కిడ్నీల పరిమాణం, వాటి పరిస్థితి, రాళ్లు, ట్యూమర్లేమైనా ఉన్నాయా అనే అంశాలను గుర్తించవచ్చు.
  • మూత్ర పిండంలోని చిన్న భాగాన్ని సేకరించి (బయాప్సీ) పరీక్షించడం ద్వారా ఎంత వరకు దెబ్బతిన్నది, ఎలాంటి చికిత్స అవసరమనేది పరిశీలిస్తారు.
  • ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’కు నేరుగా చికిత్స చేసేందుకు ప్రత్యేకించిన ఔషధాలేమీ లేవు. అందువల్ల అసలు ఈ వ్యాధికి కారణమైన వాటిని నియంత్రించేందుకు వైద్యులు చర్యలు చేపడతారు.
  • రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటే యాంటీ బయాటిక్ లతో చికిత్స చేస్తారు.
  • మూత్ర పిండాల వ్యాధి ముదిరి అవి పూర్తిగా పనిచేయలేని పరిస్థితి నెలకొంటే.. ‘డయాలసిస్’ చేస్తారు.

పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ)

కిడ్నీల్లో ద్రవాలతో కూడిన కంతులు ఏర్పడడమే పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ). ఇది జన్యువుల్లో లోపం కారణంగా వారసత్వంగా సంక్రమించే వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి ముదిరే వరకు బయటపడే అవకాశం తక్కువ. కొందరిలో మాత్రం నొప్పి, మూత్రంలో రక్తం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, ఎమ్మారై స్కానింగ్ ల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారిలో సగం మందికిపైగా కచ్చితంగా నిత్యం డయాలసిస్ చేయడమో లేదా కిడ్నీ మార్పిడి చేయడమో తప్పదు. ఈ వ్యాధి ఉన్నవారిలో 30 శాతం మందికి కాలేయంలోనూ కంతులు ఏర్పడుతాయి. అయితే కాలేయం పనితీరు పెద్దగా దెబ్బతినదు. కానీ రక్తనాళాలు దెబ్బతిని గుండె, మెదడులో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పక్షవాతం రావొచ్చు. జన్యువుల్లో రెండు రకాల లోపాల కారణంగా పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. డామినెంట్ జన్యువుల ద్వారా వచ్చే పాలీసిస్టిక్ డిసీజ్ దాదాపుగా యుక్త వయసు వచ్చే వరకు బయటపడదు. అదే రెసెస్సివ్ జన్యువుల వచ్చే వ్యాధి చిన్నతనంలోనే బయటపడుతుంది. 

డయాలసిస్ ఎన్ని విధాలు..representational image

  • వ్యాధి ముదిరి మూత్ర పిండాలు దాదాపుగా పనిచేయని పరిస్థితుల్లో ‘డయాలసిస్’ చేయాల్సి ఉంటుంది. రక్తాన్ని కిడ్నీలు శుద్ధి చేసే తరహాలోనే కృత్రిమ కిడ్నీల్లా పనిచేసే పరికరాల ద్వారా శుద్ధి చేయడమే డయాలసిస్. ఈ యంత్రాలను ‘హెమోడయలైజర్’ అంటారు. బాధితుల భుజం వద్దగానీ, కాలు వద్దగానీ చిన్న శస్త్రచికిత్స చేసి.. అక్కడి రక్తనాళానికి ‘హెమోడయలైజర్’ను అనుసంధానిస్తారు. హెమోడయాలసిస్ గా పిలిచే ఈ విధానంలో పరికరం శరీరం బయటే ఉంటుంది. రక్తం పైపుల ద్వారా హెమోడయలైజర్ కు వచ్చి, అక్కడ వ్యర్థాలు వడపోత అయిన తర్వాత తిరిగి శరీరంలోకి వెళుతుంది.
  •  ఇక మరో విధానం పెరిటోనియల్ డయాలసిస్. ఈ విధానంలో హెమోడయలైజర్ పరికరాన్ని శరీరం లోపలే అమర్చుతారు. పొట్ట ప్రాంతంలో శస్త్రచికిత్స చేసి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లేదా కాథటర్ ను అమర్చుతారు. ఇందులోకి ‘డయాలైసేట్’గా పిలిచే ప్రత్యేకమైన ద్రవాన్ని మెల్లగా నింపుతారు. పొట్టలోని అవయవాల చుట్టూ రక్షణగా ఉండే కండరపు పొర (అబ్డామెన్ వాల్) అవతలి వైపు ఉండే ఈ కాథటర్ లోని ద్రవం.. అక్కడి రక్తం నుంచి అదనపు రసాయనాలు, ద్రవాలు, వ్యర్థాలను పీల్చుకుంటుంది. తర్వాత వ్యర్థాలతో కూడిన ఈ డయాలైసేట్ ను బయటికి తీసేసి.. మళ్లీ తాజా డయాలైసేట్ తో నింపుతారు. దీనిలోనూ రెండు రకాలున్నాయి. నిర్ధారిత సమయాల్లో మాన్యువల్ గా డయాలైసేట్ ను నింపుతూ తొలగిస్తూ ఉండడం ఒకటి కాగా... సైక్లర్ అనే పరికరాన్ని వినియోగించడం రెండోది. ఈ పరికరం ఆటోమేటిగ్గా డయాలైసేట్ ను నింపుతూ, తొలగిస్తూ ఉంటుంది.

(ఈ ఆర్టికల్ కేవలం పాఠకుల అవగాహన కోసం ఆయా నిపుణులు, అధ్యయనాల అభిప్రాయాలను క్రోడీకరించి రాసినది మాత్రమే)


More Articles